- Home
- Telangana
- Rains Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం... ఈ జిల్లాలకు పొంచివున్న వరదముప్పు
Rains Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం... ఈ జిల్లాలకు పొంచివున్న వరదముప్పు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు గురువారం కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వరదముప్పు పొంచివుంది… ఆ జిల్లాలేవో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో కుండపోతే...
Telangana and Andhra Pradesh Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా వర్షం కురుస్తోంది. దీంతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఈ భారీ వర్షాలు ఇవాళ (గురువారం) కూడా కొనసాగే అవకాశాలు ఉండటంతో కొన్నిజిల్లాలకు వరదముప్పు పొంచివుంది.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
నేడు తెలంగాణలో వర్షాలే వర్షాలు :
తెలంగాణలోని ములుగు, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు కొమ్రంబీం జిల్లాలోని బెజ్జూరులో అత్యధికంగా 234 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక ములుగు జిల్లా వెంకటాపురంలో 214, మంగపేటలో 119 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇవాళ (గురువారం) కూడా ఈ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
పొంచివున్న వరదముప్పు
ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రాంతాల్లో భారీ వర్ష హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వరద ప్రమాదం పొంచివున్న లోతట్టు ప్రాంతాలు… నదులు, చెరువులు, వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ సంస్థ, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఇతర ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉన్నారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షసూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్. జనగాం జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గురువారం విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలు
హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రాత్రి నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం కూడా నగరవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీచేశారు. ఈ వర్షాల కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి కాబట్టి సాప్ట్ వేర్ కంపనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు
రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఇవి ఇవాళ (గురువారం) కూడా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇలా గురువారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొట్టనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమయ్యింది.