- Home
- Telangana
- weather report: కూల్ న్యూస్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. జాగ్రత్తగా ఉండాలంటోన్న అధికారులు
weather report: కూల్ న్యూస్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. జాగ్రత్తగా ఉండాలంటోన్న అధికారులు
ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో వాతావారణం ఒక్కసారిగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో ద్రోణి ప్రభావంతో పాటు ఉపరితల చక్రవాత ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగినా, సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు.
Bengaluru Rain
వర్ష సూచన ఉన్న జిల్లాలు:
మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకూ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
బుధవారం వాతావరణ సూచన:
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది.
heavy rain thrisur
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే:
రాబోయే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, 12 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 35 మండలాల్లో సాధారణ వడగాలులు నమోదవుతాయని పేర్కొంది. అలాగే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకారం, బుధవారం అల్లూరి, తూర్పు, పశ్చిమగోదావరి, వైఎస్ఆర్ కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఒకే దశలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది.
గంటకు 50–60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే పరిస్థితి ఉన్నందున ప్రజలు హోర్డింగ్స్, చెట్లు, శిథిల భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ఎండలు కూడా:
ఓవైపు వర్ష సూచన ఉన్నా మరో వైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 41°C నుంచి 43°C వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మంగళవారం 43.2°C ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 12 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, మరో 35 మండలాల్లో సాధారణ వడగాలులు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.