- Home
- Telangana
- డిల్లీలో వాయుకాలుష్యం పీక్స్, 400 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ .. మరి హైదరాబాద్ లో AQI ఎంత?
డిల్లీలో వాయుకాలుష్యం పీక్స్, 400 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ .. మరి హైదరాబాద్ లో AQI ఎంత?
Delhi Air Pollution : దేశ రాజధాని డిల్లీలో గాలికాలుష్యం తారాస్థాయికి చేరుకుంది… మరి హైదరాబాద్ సంగతేంటి? ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దీపావళి రోజు ఎంత నమోదయ్యింది?

దీపావళికి తారాస్థాయికి చేరిన ఎయిర్ పొల్యూషన్
Hyderabad Air Pollution : కాలుష్యం అనగానే ముందుగా గుర్తుకువచ్చే డిల్లీనే. దేశ రాజధాని నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ఇక్కడ సాధారణంగానే అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం ఉంటుంది… ఇక నగరవాసులు దీపావళి పండగ నేపథ్యంలో భారీగా టపాసులు కాల్చేసరికి ఈ కాలుష్యం తారాస్థాయికి చేరింది. రాత్రంతా పండగవాతావరణంతో ఆకాశం బాణసంచా వెలుగులతో మెరిసిపోడమే కాదు కాలుష్యం కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. డిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణ స్థితి 'రెడ్ జోన్' కు చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వెల్లడించింది.
దీపావళి పండగ సందర్భంగా గాలి కాలుష్యం పెరిగిపోతుందని ముందుగానే ఊహించిన దేశ అత్యున్నత న్యాయస్థానం కొన్ని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా దీపావళి (అక్టోబర్ 20న) రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యమాత్రమే అదీ గ్రీన్ క్రాకర్స్ కాల్చాలని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. అయినప్పటికి డిల్లీ ప్రజలు ఈ టైమ్ తో సంబంధంలేకుండా టపాసులు కాల్చారు... దీంతో నగరంలో మరోసారి రికార్డు స్థాయిలో కాలుష్యం నమోదయ్యింది. సోమవారం రాత్రి డిల్లీలోని అన్ని ప్రాంతాల్లో AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ప్రమాదకర స్థాయికి చేరింది.. మొత్తం 38 గాలి నాణ్యతను లెక్కించే కేంద్రాలలో 36 చోట్ల అత్యంత దారుణంగా గాలి కాలుష్యమైనట్లు డేటా వెల్లడించింది.
సోమవారం రాత్రి 10 గంటల సమయానికి ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 344 (Very Poor)గా ఉంది. నగరంలోని నాలుగు స్టేషన్లలో AQI 400 మార్కును దాటడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) సమీర్ యాప్ ప్రకారం వజీర్‌పూర్ (423), ద్వారక (417), అశోక్ విహార్ (404), ఆనంద్ విహార్ (404) అత్యధిక AQI నమోదయ్యింది...ఇవి అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంది CPCB.
ఈ రెండ్రోజులూ డిల్లీలో గాలి కాలుష్యం ఎలా ఉంటుందంటే..
దీపావళి తర్వాత రెండ్రోజులు (అక్టోబర్ 21 మంగళవారం, అక్టోబర్ 22 బుధవారం) కూడా డిల్లీలో వాయుకాలుష్యం తీవ్రంగానే ఉంటుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంచనా వేస్తోంది. అందుకే డిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ II (GRAPS-2)ని యాక్టివేట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారితో పాటు ముసలివారు, చిన్నారులు బయటకు రావద్దని... ఇతరులు కూడా అత్యవసం అయితేనే ఇంట్లోంచి బయటకు రావాలని సూచిస్తోంది.
భారత వాతావరణ శాఖ (IMD), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) అంచనాలతో గ్రాప్ సబ్ కమిటీ అత్యవసర సమీక్ష నిర్వహించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదివారం నుంచే ఢిల్లీలో గ్రాప్ స్టేజ్ IIని అమలు చేసింది. మరో రెండ్రోజులు ఇవి అమల్లో ఉండనున్నాయి.
హైదరాబాద్ గాలి కాలుష్యం సంగతేంటి?
కేవలం డిల్లీలోనే కాదు ప్రధాన నగరాలన్నింటిలో దీపావళి సందర్భంగా గాలికాలుష్యం పెరిగింది. ఇలా హైదరాబాద్ లో కూడా సోమవారం రాత్రికి గాలి పూర్తిగా కాలుష్యమయ్యింది... పీల్చుకోడానికి వీలులేకుండా మారింది. అక్టోబర్ 20న రాత్రి 9 గంటలకు హైదరాబాద్ లో AQI 385 గా ఉంది... అంటే ఇది అత్యంత కాలుష్య నగరంగా పేరుపొందిన డిల్లీలోని కొన్ని ప్రాంతాలతో సమానం. ఒకేసారి వాతావరణ కాలుష్యం ఈ స్థాయికి చేరుకోవడం నగరవాసులు ఇబ్బంది పడ్డారు.
దీపావళి పండగపూట తెలుగు రాష్ట్రాల్లో గాలి నాణ్యత
హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని నగరాలు, పట్టణాల గాలి నాణ్యతను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఇలా అక్టోబర్ 20, 2025, 4PM వరకు ఎక్కడ గాలి నాణ్యత ఎలా ఉందంటే...
దీపావళి రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ గాలి నాణ్యత AQI 82 సంతృప్తికరం. సాయంత్రం నుండి రాత్రివరకు ఒక్కసారిగా కాలుష్యం పెరిగిపోయింది.
అమరావతిలో గాలి నాణ్యత అద్భుతంగా ఉంది - ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) కేవలం 23
అనంతపూర్ లో AQI 54 గా ఉంది. అంటే సంతృప్తికరం.
తిరుమల AQI 27 గా ఉంది... అంటే గాలి నాణ్యత బాగున్నట్లు.
విజయవాడ లో AQI 58. గాలి నాణ్యత బాగుంది.
విశాఖపట్న లో AQI 44... గాలి స్వచ్చంగా ఉందన్నమాట.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంతుంటే మంచిది... ఎంతుంటే ప్రమాదకరం
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) గాలి నాణ్యతను ఈ విధంగా వర్గీకరిస్తుంది.
0–50 : గాలి మంచిది
51–100 : గాలి నాణ్యత సంతృప్తికరం
101–200 : మధ్యస్థం (గాలి అంత స్వచ్చంగా లేదు.. మరీ కాలుష్యం కాలేదు)
201–300 : గాలి నాణ్యత దారుణం. కాలుష్యం ఎక్కుగా ఉన్నట్లు.
301–400 : గాలి నాణ్యత అత్యంత దారుణం. పూర్తిగా గాలి కాలుష్య అయినట్లు.
401–500 : చాలా తీవ్రంగా గాలి కాలుష్యం అయినట్లు. పీల్చుకుంటే ప్రజారోగ్యం దెబ్బతింటుంది.