Cyber Fraud : నకిలీ పోలీస్ స్టేషన్ ఓకే.. నకిలీ సుప్రీంకోర్టు ఏంట్రా బాబు..!
మోసగాళ్ళు మరీ బరితెగించారు. ఒకడు ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ నే సృష్టిస్తే ఇంకొకడు సుప్రీంకోర్టు పేరిట విచారణ చేపట్టి మోసం చేసాడు. ఈ విచిత్రమైన మోసాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
- FB
- TW
- Linkdin
Follow Us
)
బరితెగించిన సైబర్ నేరగాళ్లు..
Cyber Fraud : మనకు ఏదయినా సమస్య ఎదురైతే వెంటనే పోలీస్ స్టేషన్ కు గానీ కోర్టుకు గానీ వెళతాం. అక్కడయితేనే మనకు తగిన న్యాయం దొరుకుతుందని నమ్ముతాం. కానీ కొందరు కేటుగాళ్లు నకిలీ పోలీస్ స్టేషన్, కోర్టులను ఏర్పాటుచేసి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా న్యాయం చేసేవారి వేషంలోనే అన్యాయానికి పాల్పడుతున్నారు కొందరు దుండగులు. తాజాగా ఇలాంటి ఘరానా మోసమే తెలంగాణలో వెలుగుచూసింది.
సుప్రీంకోర్టు జడ్జిని వదల్లేదుగా...
మొదట్లో సైబర్ నేరగాళ్లు కాల్ సెంటర్, బ్యాంక్ ఉద్యోగుల పేరిట ఫోన్ చేసి మోసాలకు పాల్పడేవారు. బ్యాంక్ అకౌంట్, ఓటిపి వంటి వివరాలను సేకరించి బ్యాంకులోని డబ్బులను ఖాళీ చేసేవారు. తర్వాత టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఫోన్ కు మెసేజ్ లు, మెయిల్స్ పంపించి అందులోని డాటాను సేకరించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలకు అవగాహన రావడంతో డిజిటల్ అరెస్ట్ నాటకాలకు తెరతీసారు.
ఇలా ప్రజలు అప్రమత్తమవుతుంటే సైబర్ నేరగాళ్లు కూడా కొత్తకొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. చివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరిట నకిలీ విచారణ చేపట్టి ఓ వ్యక్తిని నిండా ముంచిన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. ఈ కొత్తతరహా సైబర్ నేరంగురించి తెలిసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
అసలు విషయం ఏంటంటే... హైదరాబాద్ లోని వరస్థలిపురంలో నివాసముండే ఓ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కు ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎవరినుండి వచ్చిందోనని అతడు లిప్ట్ చేసాడు. అవతలివైపు నుండి ఓ వ్యక్తి తాము సుప్రీంకోర్టు నుండి మాట్లాడుతున్నామని... మీపై ఓ కేసు నమోదయ్యింది... విచారణలో భాగంగా వీడియో కాల్ లిప్ట్ చేయాల్సిందిగా తెలిపారు. కేసు, సుప్రీంకోర్టు అనగానే కంగారుపడిపోయిన సదరు ఇంజనీర్ వారు చెప్పినట్లు వీడియో కాల్ కూడా లిప్ట్ చేసాడు.
సైబర్ నేరగాళ్ల వలలో రిటైర్డ్ ఇంజనీర్
రిటైర్డ్ ఇంజనీర్ తమ వలలో పడ్డాడని.. భయపడుతున్నాడని సదరు సైబర్ నేరగాళ్లకు అర్థమయ్యింది. దీంతో వెంటనే వారు ఓ నకిలీ జడ్జిని రంగంలోకి దింపారు. కేసు చాలా తీవ్రంగా ఉందని... వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని సదరు నకిలీ జడ్జి రిటైర్డ్ ఇంజనీర్ ను బెదిరించాడు. దీంతో మరింత భయపడిపోయిన అతడు సైబర్ నేరగాళ్లు ఎలా చెబితే అలా చేసాడు.
ముందుగా కేసు విచారణలో భాగంగా కొంత డబ్బును సుప్రీంకోర్టు అకౌంట్లో వేయాలని సూచించారు. విచారణ అనంతరం ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన రిటైర్డ్ ఇంజనీర్ వారు పంపిన అకౌంట్ లో డబ్బులు వేసాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటిన్నర రూపాయలు వారి అకౌంట్లో వేసాడు. డబ్బులు అందాక సైబర్ నేరగాళ్లు ఈ కేసును తర్వాత విచారణ చేస్తామని చెప్పి కాల్ కట్ చేసారు.
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త..
డబ్బులు చెల్లించినట్లు ఎలాంటి రసీదు రాకపోవడం, తదుపరి విచారణపై ఏ సమాచారం చెప్పకుండానే ఫోన్ కట్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తిరిగి ఆ ఫోన్ నెంబర్ కు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇలా ఎవరైన పోలీసులు, కోర్టుల పేరిట ఫోన్ చేసి బెదిరిస్తే భయపడవద్దని... నిజానిజాలు తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు, కోర్టులు డబ్బులు డిమాండ్ చేయవు... కాబట్టి డబ్బులిచ్చి మోసపోవద్దని సూచించారు. నిజంగానే పోలీసులు ఫోన్ చేసారని భావిస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని... ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ నే ఏర్పాటుచేసేసారుగా...
బిహార్ లో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. కొందరు కేటుగాళ్లు ప్రజలను మోసం చేయడానికి ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్ నే ఏర్పాటుచేసారు. దాదాపు ఏడాది పాటు ఆ పోలీస్ స్టేషన్ ను కొనసాగించారుకూడా. పోలీస్ ఉద్యోగాల పేరిట యువత నుండి భారీ డబ్బులు వసూలు చేసి పోలీస్ స్టేషన్ బోర్డ్ తిప్పారు. దీంతో మోసపోయామని గ్రహించిన యువకులు అసలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బిహార్ పూర్ణియ జిల్లా మోహిని గ్రామానికి చెందిన రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి ఈ నకిలీ పోలీసు స్టేషన్ తెరిచాడు. గ్రామీణ రక్షాదళ్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానిక యువత వద్ద లక్షలు వసూలు చేసాడు.
ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2,500 నుండి రూ.5,000 వరకు వసూలు చేసి వారికి పాలసీ యూనిఫాములు, లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు కూడా అందించాడు. అంతేకాదు వీరిచేత అక్రమ మద్యం రవాణాపై దాడులు చేయించి డబ్బులు వసూలు చేయించాడు.. ఇందులో సగం డబ్బులు తీసుకుని మిగతావి యువకులకే ఇచ్చేవాడట. దాదాపు ఏడాదిపాటు ఈ నకిలీ పోలీసులు దందా సాగింది.
ఇటీవల ఈ వ్యవహారం బైటపడటంతో రాహుల్ నకిలీ పోలీస్ స్టేషన్ మూసేసి పరారయ్యాడు. బాధిత యువకులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఏడాది కాలంగా ఇంత జరుగుతున్నా ఇటు ప్రజలకు, అటు పోలీసులకు అనుమానం రాకపోవడం ఆశ్చర్యకరం. ఈ వ్యవహారంలో ఇంకెవరి పాత్రయినా ఉందా అన్నకోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.