చలి పంజా.. మరో వారం రోజులు జాగ్రత్త
Cold wave : తెలంగాణలో చలి పంజా విసురుతోంది. మరో వారం రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా చలి చంపేస్తోంది.

తెలంగాణపై చలి పిడుగు.. వణికిస్తున్న ఉష్ణోగ్రతలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతటా చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. నవంబర్ మొదటి వారంలోనే శీతల గాలులు, పొగమంచు, తక్కువ ఉష్ణోగ్రతలు ప్రజలని వణికిస్తున్నాయి.
భారత వాతావరణ శాఖ ప్రకారం మరో వారం రోజుల పాటు ఇదే స్థాయి చలి కొనసాగనుంది. కొన్నిచోట్ల మరింత చలి వుండవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో రాత్రివేళల్లో చలితీవ్రత మరింత పెరగనుందని ఐఎండీ పేర్కొంది.
రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
గత వారం రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ (యూ)లో 10.2 డిగ్రీల స్థాయికి పడిపోయింది.
హైదరాబాద్ నగరంలో కూడా పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో 11-13°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం (నవంబర్ 13) నుండి 21 వరకు ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలి గాలుల తీవ్రత పెరగనుందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.
ఆరోగ్యంపై చలి ప్రభావం
వాతావరణంలో ఈ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరాలు వంటి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలి గాలుల ప్రభావంతో ఇస్నోఫిలియా, బ్రాంకైటిస్, శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆసిఫాబాద్ జిల్లా వైద్యులు తెలిపారు. “చలిగాలుల్లో తిరగకుండా ఉండటం, గోరువెచ్చని నీళ్లు తాగడం, వెచ్చని దుస్తులు ధరించడం, చిన్న పిల్లల్ని చలికి గురి కాకుండా చూసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని” వైద్యులు చెబుతున్నారు.
మారుమూల గ్రామాల్లో చలి దెబ్బ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రామాల్లో చలి పంజా మరింత తీవ్రమైంది. కెరమెరి, జైనూర్, వాంకిడి, తిర్యాణి మండలాల్లో ఉదయం పది గంటల వరకు జనం బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, కూలీలు పనులకు వెళ్లనీయకుండా చలి దెబ్బకొడుతోంది. పొగమంచు కారణంగా రవాణా కూడా అస్తవ్యస్తమైంది. మార్కెట్లలో ఉదయం పూట ప్రజల రాకపోకలు తగ్గిపోవడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
రైతు కూలీలు పత్తి సీజన్ పనులు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం చలిగాలులతో పాటు తేమ అధికంగా ఉండడం వల్ల పత్తి కోత పనులు ఆలస్యం అవుతున్నాయి. ఇది వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై కూడా ప్రభావం చూపుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పెరుగుతున్న చలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
చలి పెరుగుతోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది.
• చలి తీవ్రంగా ఉంటే రాత్రి, ఉదయం వేళల్లో బయట తిరగడం తగ్గించాలి.
• చిన్నారులు, వృద్ధులు వెచ్చని దుస్తులు ధరించాలి.
• ఫ్రీజ్ వాటర్ వాడకూడదు, గోరువెచ్చని నీరు తాగాలి.
• గదుల్లో తేమ ఎక్కువగా ఉండకుండా చూడాలి.
• ఏవైనా జలుబు, జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అధికారుల అంచనా ప్రకారం రాబోయే వారం రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీల మేర తక్కువగా ఉండే అవకాశం ఉంది. చలి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య శాఖ హెచ్చరిస్తోంది.