Banakacharla: బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు.. తెలంగాణ లేవనెత్తుతున్న అంశాలు ఏంటి?
Banakacharla: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

బనకచర్ల ప్రాజెక్టు: తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో చర్చలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదం మళ్లీ మొదలైంది. ఏపీ సర్కారు ప్రతిపాదిత బనకచర్ల నీటి ప్రాజెక్టు ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ క్రమంలోనే బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీలో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు గోదావరి జలాల వినియోగంపై తెలంగాణకు న్యాయం చేయదనీ, 1980 జల వివాదాల ట్రిబ్యునల్, 2014 పునర్విభజన చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. తెలంగాణకు 1500 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతులు జారీ చేయాలని కోరారు. కేంద్రం స్పందన ఆశాజనకంగా ఉందని తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు ఏమిటి?
బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయంగా మారే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. బనకచర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు గోదావరి-బనకచర్ల లింక్ ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఆర్ఐ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఏపీ నీటి నియమాల ఉల్లంఘనలు అంటూ తెలంగాణ ఆరోపణ
బనకచర్ల ప్రాజెక్టును గోదావరి వరద జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్నదని, ఇది గోదావరి నీటి వాటాల వివాదాల ట్రిబ్యునల్ - 1980 (Godavari Water Disputes Tribunal- 1980 GWDT), 2014 పునర్విభజన చట్టానికి విరుద్ధమని తెలంగాణ పేర్కొంది. GWDTలో వరద జలాల గురించి ఎటువంటి ప్రస్తావన లేదని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (CWC), నదీ యాజమాన్య బోర్డు, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌పై ముందుకు పోవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదాలు ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బనకచర్లపై కేంద్రం జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
బనచచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలనీ, తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. “కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని, బనకచర్ల ప్రాజెక్టును ఆపాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ డిమాండ్ చేశారు. ఇంతవరకూ పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు వరద జలాల పేరిట అనుమతులు లేకుండానే చేపట్టినదీ, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగించడమూ అన్యాయమని అన్నారు.
పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ఎత్తిపోతల (Lift Irrigation) ప్రాజెక్టులు, ముఖ్యంగా గోదావరి నది జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించేందుకు రూపొందించినవి. అయితే, ఇవి చాలా వరకు వివాదాస్పదమైనవిగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే ప్రాజెక్టులుగా తెలంగాణ సర్కారు పేర్కొంటోంది. ఈ ప్రాజెక్టులన్నీ GWDT - 1980 నియమాలకు విరుద్ధంగా, కేంద్ర అనుమతులు లేకుండా, వరద జలాల పేరిట చేపట్టినట్టు తెలంగాణ వాదనలు చేస్తోంది.
“గోదావరిలో నిజంగానే వరద జలాలు ఉంటే, కేంద్ర నిధులతో ఇచ్చంపల్లి - నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలించవచ్చు. తెలంగాణ దీనికి సిద్ధంగా ఉంది. కానీ బనకచర్ల ప్రాజెక్ట్ మాత్రం అనుమతించదగినది కాదు” అని రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణకు 1500 టీఎంసీల వినియోగానికి అనుమతి కోరిన రేవంత్ రెడ్డి
గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీల వినియోగానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ NOC ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనుమతులు వస్తే, కోటిన్నర ఎకరాల సాగునీటి అవసరాలను తెలంగాణ తీర్చగలదని వివరించారు. దీంతో రాష్ట్ర రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రం మరింత ప్రగతితో ముందుకు సాగుతుందని తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వండి
పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతో పాటు, అన్ని అనుమతులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే స్పందిస్తూ.. తెలంగాణ విషయంలో ఆలస్యం చేయడాన్ని ఆయన ఖండించారు.
“ఈ అన్యాయ వైఖరితో రాష్ట్రాల మధ్య అపోహలు, సమస్యలు పెరుగుతున్నాయి. ఇది సమన్వయానికి విఘాతం కలిగించే అవకాశాలు కల్పిస్తోంది” అని అన్నారు.
అలాగే, మూసీ పునరుజ్జీవనానికి నిధులివ్వాలని కోరారు. “గంగా-యమునా నదుల శుద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేసినట్లే, మూసీ నది పునరుజ్జీవనానికి కూడా నిధులు కేటాయించాలి” అని రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు.
తెలంగాణ సర్కారు వినతులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తమకు అందలేదని పేర్కొన్నారు. త్వరలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామన్న హామీ కూడా ఇచ్చారు” అని చెప్పారు.
ఈ కీలక సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి ఏపి జితేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తాం : రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై స్పందిస్తూ గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టుపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సహజమే అయినా, దీని మూలాలు గత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పడ్డాయని ఆయన ఆరోపించారు.
బుధవారం (జూన్ 19) తెలంగాణ లోకసభ, రాజ్యసభ సభ్యులతో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. 2016లో ఢిల్లీలో జరిగిన ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, అప్పటి సీఎం కేసీఆర్, నీటి పారుదల మంత్రి తన్నీరు హరీష్ రావు, ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారని అన్నారు. కేసీఆర్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతోనే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టును ఏపీ సర్కారు చేపడుతోందని విమర్శించారు.
సీఎం చంద్రబాబు కు రేవంత్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు లేకుండానే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు. అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీతో ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం తాము కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.