- Home
- Telangana
- బస్సు ఎక్కాలంటేనే భయం.. సినిమాను మించిన ట్విస్టులున్న బస్సు ప్రమాదంలో ఊహకందని మలుపులు. Big Storyలో ఇంట్రెస్టింగ్ విషయాలు
బస్సు ఎక్కాలంటేనే భయం.. సినిమాను మించిన ట్విస్టులున్న బస్సు ప్రమాదంలో ఊహకందని మలుపులు. Big Storyలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Big story: కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. రోడ్డుపై ప్రైవేట్ బస్సు కనిపిస్తేనే భయపడే పరిస్థితి ఉంది. 19 మంది మరణించిన ఈ ఘటనలో ప్రమాదానికి నేరుగా కారణమైన అంశాలను బిగ్ స్టోరీలో చూద్దాం.

అసలేం జరిగింది.?
శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. ఫోరెన్సిక్ బృందాల ప్రాథమిక నివేదికల ప్రకారం, బస్సు లగేజీ క్యాబిన్‌లో ఉన్న వందల మొబైల్ ఫోన్లు అగ్నిప్రమాదానికి ప్రధాన కారణమయ్యాయి.
ప్రమాదం ఎలా జరిగిందంటే.?
బస్సు ముందు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
దాని ఆయిల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అయింది, వెంటనే మంటలు వ్యాపించాయి.
బస్సు కింద ఇరుక్కున్న ద్విచక్రవాహనం కారణంగా బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్‌కి వ్యాపించాయి.
క్యాబిన్‌లోని 400కు పైగా మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలడంతో మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.
ఫోరెన్సిక్ నివేదికలు
బస్సులోని ఫోన్ల లిథియం బ్యాటరీలు పేలడంతో పెద్ద ఎత్తున శబ్ధం వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు ఆపి తన సీటు పక్కన ఉన్న కిటికీ నుంచి తప్పించుకున్నాడు. బస్సు లోపల మిగిలిన ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అత్యవసర ద్వారం పనిచేయకపోవడం వల్ల ఫలితం లేకుండా పోయింది.
నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సాధారణంగా ప్రయాణికుల వ్యక్తిగత లగేజీ మాత్రమే అనుమతిస్తారు. కానీ ఈ బస్సుల యాజమాన్యాలు లగేజీ క్యాబిన్‌లో ఇతర సరుకులను రవాణా చేస్తూ ప్రమాదానికి కారణమవుతున్నాయి.
మొబైల్ ఫోన్లు – ప్లాస్టిక్ కవచం, లిథియం బ్యాటరీలు.
మంటలో లిథియం పేలిపోవడం ప్రమాద తీవ్రతను పెంచుతుంది. కర్నూలు ఘటనలో కూడా ఇదే ప్రధాన కారణం. కర్నూలు బస్సు ప్రమాద సంఘటనలో బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వెంటనే మంటలు వ్యాపించాయి. రెండు నిమిషాల్లోనే పరిస్థితి కంట్రోల్ తప్పింది. మొదటి భాగంలో కూర్చున్న ప్రయాణికులే ప్రాణాలు కోల్పోయారు.
బైక్ ప్రమాదంలో అసలు ట్విస్ట్
మొదట అందరూ.. బస్సు వెనకాల నుంచి బైక్‌ను ఢీకొట్టిందని అనుకున్నారు. అయితే హైవేకి సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో రికార్డ్ అయిన సీసీటీవీ విజువల్స్‌తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బైక్‌పై శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరు వెళ్తున్నారు. శివశంకర్ బైక్ నడుపుతున్న క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని, దీంతో శివశంకర్ సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్వల్పగాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి బైక్‌ను పక్కకు తీసే క్రమంలో బస్సు వచ్చి ఢీకొట్టినట్లు తేలింది. ప్రస్తుతం ఎర్రిస్వామిని లోతుగా విచారిస్తున్నారు.
స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు.?
బస్సు ప్రమాదాల్లో అధికంగా స్లీపర్ బస్సుల్లోనే జరుగుతున్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి.
* నిపుణుల ప్రకారం, స్లీపర్ బస్సులలో నిర్మాణ పరిమితులు ప్రమాదానికి కారణమవుతున్నాయి:
* 2x1 సీటింగ్ ప్యాటర్న్, బెర్తుల పొడవు సుమారు 6 అడుగులు, వెడల్పు 2.5 అడుగులు.
* బస్సు మధ్యలో ఎక్కువ స్థలం లేకపోవడంతో ఎమర్జెన్సీ సమయంలో బయటకు రావడం కష్టమవుతుంది.
* ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.
* ఇక బస్సుల ఎత్తు సాధారణ బస్సుల కంటే ఎక్కువ (8–9 అడుగులు), కాబట్టి రేస్క్యూ ఆపరేషన్ మరింత కష్టతరం అవుతుంది.
రాత్రి ప్రయాణాల ముప్పు
* స్లీపర్ బస్సులు ప్రధానంగా రాత్రి ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు.
* డ్రైవర్‌ల అలసట ప్రమాదాన్ని పెంచుతుంది.
* 2018 సర్వే ప్రకారం 25% డ్రైవర్లు నిద్ర మత్తుతో డ్రైవింగ్ చేశారని చెప్పారు.
* ఎమర్జెన్సీ సమయంలో, మొదటి రెండు నిమిషాల్లో తీసుకునే చర్యలే ప్రాణాలను కాపాడుతాయి.
* అప్పర్ బెర్తులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడడం కష్టమవుతుంది.
* అలాగే ఏసీ స్లీపర్ బస్సుల్లో ఉండే పరదాలు కూడా బయట ఏం జరుగుతుందన్న విషయం తెలియకుండా చేస్తాయి.
అతివేగం
రాత్రి బస్సు ఎక్కి పడుకుంటే ఉదయం లేచే సరికి గమ్యాన్ని చేరుకోవాలి. ఇదిగో ఇదే పాయింట్‌పై ఇలాంటి ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న ట్రావెల్స్ వేగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కర్నూలు ప్రమాదం జరిగే సమయంలో కావేరి ట్రావెల్స్ బస్సు 100 స్పీడ్‌లో ఉందని వార్తలు వచ్చాయి. సమయానికి గమ్యానికి చేర్చాలన్న ఉద్దేశంతో డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* బస్సులో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.
* ఎమర్జెన్సీ ఎగ్జిట్ లొకేషన్ తెలుసుకోవాలి.
* ప్రయాణం మధ్యలో అప్పుడప్పుడు డ్రైవర్ అలర్ట్‌గా ఉన్నారో లేదో చూడాలి.
* డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
* వీలైతే రాత్రి ప్రయాణాలు తగ్గించాలి.
* బస్సుకు RTO అనుమతులు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉందో చూడాలి.
స్లీపర్ బస్సులపై చర్చ
* గతంలో స్లీపర్ బస్సులు అనేక ప్రమాదాలకు గురయ్యాయి.
* చైనాలో 2009–2012 మధ్య 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరగ్గా 252 ప్రాణాలు కోల్పోయారు.
* చైనా, జర్మనీ, వియత్నాం దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి.
* అయితే భారత్‌లో కఠిన నిబంధనలు ఉన్నా అనుకున్న స్థాయిలో అమలు చేయడం లేదు.
డిజైన్ లోపాలు
* ఏసీ బస్సుల్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ సిస్టమ్, ఫ్యాన్లు, బల్బులు షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమవుతాయి.
* ప్లాస్టిక్, కాటన్, రెగ్జీన్ సీట్లు వంటివి మంటలు మరింత పెరగడానికి కారణమవుతాయి.
* బస్సులో నాణ్యత లేని కేబుల్స్, కాంపోనెంట్లు ఉపయోగించినా ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
* బస్సుల ఫిట్‌నెస్‌ను కచ్చితంగా తనిఖీ చేయాలి.
* ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, ఫైర్ సేఫ్టీ సిస్టమ్‌లను తప్పనిసరిగా అమలు చేయించాలి.
* రాత్రి స్లీపర్ బస్సుల సంఖ్యను నియంత్రించాలి.
* నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.
* డ్రైవర్ అలసట నివారణ కోసం డ్రైవ్ టైమ్ పరిమితులు పెట్టాలి.
* నాణ్యత లేని సీట్లు, పరికరాలు, వైరింగ్ ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి.
మొత్తంగా చెప్పాలంటే..
కర్నూలు బస్సు ఘటన మనకు ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదని చెప్పాలి. ప్రజల ప్రాణాలను కాపాడటానికి భద్రతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అనే విషయాన్ని చెబుతోంది. స్లీపర్ బస్సులపై కఠిన నియంత్రణలు, డ్రైవర్‌లపై పర్యవేక్షణ, ఎమర్జెన్సీ సౌకర్యాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రయాణికులు కూడా వేగం, సౌకర్యం కంటే రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.