Bharat Bandh : దసరా తర్వాత కూడా విద్యాసంస్థలు తెరుచుకోవా..? సెలవులు కొనసాగుతాయా?
Bharat Bandh : దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల సంగతేంటోగానీ తెలంగాణలో మాత్రం విద్యార్థులకు దసరా సెలవులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకో తెలుసా?

దసరా సెలవులు పెరుగుతాయా?
Bharat Bandh : దసరా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు వెంటనే తెరుచుకునేలా కనిపించడంలేదు. ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని విద్యాసంస్థలకు సెలవులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా దసరా సెలవుల తర్వాత ఏఏ విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశం లేదు… కారణమేంటి? ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల సమావేశం
తెలంగాణలో కొద్దిరోజుల కిందటే ప్రైవేట్ వృత్తివిద్యా కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గత సెప్టెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఎంబిఏతో పాటు ఇతర వొకేషనల్ కాలేజీ యాజమాన్యాలు బంద్ కు సిద్దమయ్యాయి. తమ సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం నుండి రావాల్సిన ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల కోసం ఈ బంద్ చేపట్టాలని భావించాయి.. అయితే ప్రభుత్వం వీరితో చర్చలు జరిపి పలు హామీలిచ్చి బంద్ ను విరమించేలా చేసింది.
ప్రభుత్వ పెద్దలు దసరాలోపు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదలచేస్తామని హామీ ఇవ్వడంతో కాలేజీల యాజమాన్యాలు బంద్ విషయంలో వెనక్కి తగ్గాయి. అయితే దాదాపు 15 రోజులు గడిచినా ఇంకా ఈ బకాయిలు క్లియర్ కాలేవు.. ఇక రేపే (అక్టోబర్ 2, గురువారం) దసరా కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా పూర్తయ్యింది. దీంతో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? అన్నదానిపై చర్చించేందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అత్యవసరంగా ఇవాళ సమావేశం అయ్యాయి. ఇందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ బంద్ ఉంటుందా?
ప్రభుత్వంపై ఫీజు రియింబర్స్మెంట్ బకాయిల విడుదలకోసం ఒత్తిడి తీసుకురావాలంటే కొన్నిరోజులు విద్యాసంస్థల బంద్ కొనసాగించాలన్నది మెజారిటీ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల అభిప్రాయంగా తెలుస్తోంది. దీనికి అందరూ కట్టుబడి ఓ నిర్ణయానికి వస్తే దసరా సెలవుల తర్వాత కాలేజీలు తెరవకూడదని నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వృత్తివిద్యా కాలేజీలే కాదు డిగ్రీ కాలేజీలు కూడా మూతపడే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తివిద్యా కాలేజీల విద్యార్థులకు దసరా సెలవులు పొడిగించినట్లు అవుతుంది.
ప్రభుత్వం కాలేజీలకు ఎంత బకాయి ఉంది?
తెలంగాణలో విద్యార్థుల చదువుకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం ట్యూషన్ ఫీజును భరిస్తుంది. అయితే ఈ ఫీజు రియింబర్స్ మెంట్ కింద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదు. దీంతో ప్రతి ఏటా బకాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు, మెయింటెనెన్స్ కోసం కూడా ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఇలాగైతే కుదరదని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బకాయిలను క్లియర్ చేసుకునేందుకు తెలంగాణ కాలేజీ యాజమాన్యాల సంఘం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యెర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ (FATHI) సిద్దమయ్యింది.
గత సెప్టెంబర్ మధ్యలోనే ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునివ్వగా ఈ దసరాలోపు రూ.600 కోట్ల బకాయిలను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తర్వాత మరో నెలలో అంటే దీపావళి లోపు ఇంకో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కాని మొదటి విడతగా ఇస్తామన్న డబ్బులు ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో మరోసారి కాలేజీల బంద్ కు యాజమాన్యాలు పిలుపునిస్తాయా? మరేదైనా పద్దతిలో నిరసన తెలుపుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం అన్ని కాలేజీలకు దసరా సెలవులున్నాయి. అక్టోబర్ 6 నుండి కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఒకవేళ బంద్ కు పిలుపునిస్తే కాలేజీలు తెరుచుకునే అవకాశం ఉండదు... ఈ బంద్ ఎప్పటివరకు కొనసాగితే అప్పటివరకు సెలవులు కంటిన్యూ కానున్నాయి. దసరా తర్వాత విద్యాసంస్థలు తెరవొద్దనే యోచనలో కాలేజీ యాజమాన్యాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అక్టోబర్ 3న భారత్ బంద్?
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అక్టోబర్ 3న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పండగవేళ బంద్ చేపట్టడంవల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలుండటంతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఈ వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మళ్ళీ భారత్ బంద్ ఎప్పుడు నిర్వహించనున్నది త్వరలోనే ప్రకటిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తెలిపింది.