- Home
- Telangana
- Agriculture : ఎకరాకు రూ.10 లక్షల లాభం..! ఇలా కదా వ్యవసాయం చేయాల్సింది, ఇది కదా రైతులకు కావాల్సింది
Agriculture : ఎకరాకు రూ.10 లక్షల లాభం..! ఇలా కదా వ్యవసాయం చేయాల్సింది, ఇది కదా రైతులకు కావాల్సింది
Avocado Farming : ఇటీవల కాలంలో విదేశాలకు చెందిన చాలారకాల పండ్లకు మన దేశంలో డిమాండ్ పెరిగింది. ఇలాంటి ఓ పండును సాగుచేయడం ద్వారా రైతులు ఎకరాకు రూ.10 లక్షల వరకు లాభం పొందవచ్చట. అదేంటో తెలుసా?

ఈ పండు యమ కాస్ట్లీ గురూ..!
Avocado Farming : ఒకప్పుడు వ్యవసాయం అంటే పండగ... కానీ ప్రస్తుతం దండగ అనే భావన ప్రజల్లో వచ్చింది. ఒకప్పుడు పెళ్లిచూపుల సమయంలో అబ్బాయికి ఎంత వ్యవసాయ భూమి ఉందని ఆరా తీసేవారు, ఎంత ఎక్కువుంటే అంత ప్రాధాన్యం... ఇప్పుడు వ్యవసాయం కుటుంబంలోకి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి రైతన్నలకు వచ్చింది. అయితే కొందరు యువ రైతులు సరికొత్త ప్రయోగాలు, విలువైన పంటలతో వ్యవసాయానికి మళ్లీ పాతరోజులు తీసుకువస్తున్నారు... లాభం లేదనుకున్న వ్యవసాయంలో కోట్లు చూపిస్తున్నారు.
ఇలా మీరు కూడా వ్యవసాయంలో అద్భుతాలు చేయాలంటే సరికొత్త ప్రయోగాలు చేయాల్సిందే. ముఖ్యంగా ఉద్యానవన పంటల్లో ప్రస్తుతం అధిక లాభాలు వస్తున్నాయి... కొద్దిగా రిస్క్ ఉన్నా తక్కువ శ్రమ, ఎక్కువ లాభాలుండటంతో యువ రైతులు ఇటువైపు మళ్లుతున్నారు. ఇలా రైతులకు లాభాల పంట పండిస్తోంది విదేశీ ఫ్రూట్స్ లో అవకాడో ముందుంది. మెక్సికో వంటి దేశాల్లో విరివిగా పండే ఈ పండ్లకు ఇండియాలో మంచి గిరాకీ ఉంది.
అవకాడో ఎక్కడ పండుతుంది..?
అవకాడో పండ్లను కేవలం కొండ ప్రాంతాల్లోనే కాకుండా, మైదాన ప్రాంతాల్లో కూడా విజయవంతంగా సాగు చేయవచ్చు. సరైన సాగు పద్ధతులు, ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఉపయోగించుకుని పండిస్తే మంచి దిగుబడి, మంచి లాభాలు పొందవచ్చు.
అవకాడో కొండ ప్రాంతాల్లోనే పండుతుందని అనుకుంటాం. కానీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొందరు రైతులు కరవు నేలలోనూ దీన్ని విజయవంతంగా పండిస్తున్నారు… ఎకరాకు రూ.10 లక్షలు సంపాదిస్తున్నారు. దీన్నిబట్టి మైదాన ప్రాంతాల్లోనూ అవకాడో సాగు సాధ్యమని ఇది నిరూపితమయ్యింది.
మెక్సికో అంటే చల్లని దేశం.. కాబట్టి అవకాడో కూడా ఇలాంటి వాతావరణంలోనే పెరుగుతుందని రైతుల అభిప్రాయం. కానీ తమిళనాడు కోయంబత్తూర్ లాంటి వేడి ప్రాంతాల్లో కూడా ఈ పంటను కొందరు రైతులు పండిస్తున్నారు... అధిక దిగుబడి పొందుతున్నారు. సరైన అంటు మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ వాడితే కరవు ప్రాంతాల్లోనూ ఇది బాగా పండుతుందని నిరూపిస్తున్నారు.
అవకాడోలో ఏ రకం ఉత్తమం
అవకాడో సాగుపై రైతుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. కొండ ప్రాంతాల్లో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా సాగు చేస్తున్నారు... మైదాన ప్రాంతాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండే రకాలను గుర్తిస్తున్నారు. 'హాస్' (Hass) రకం మైదాన ప్రాంతాల్లో సాగుకు ఉత్తమం అని అవకాడో సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు.
మైదాన ప్రాంతాల్లో 20x20 అడుగుల దూరంలో అవకాడో మొక్క నాటాలి. నీటి పారుదల కోసం డ్రిప్ ఇరిగేషన్ వాడాలి. మొదటి రెండేళ్లు మొక్కలకు నీడ అవసరం... చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం ఎండ, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా చెట్టు చనిపోతుంది. బాగా పెరిగిన తర్వాత ఎండకు తట్టుకుంటుంది.
అవకాడోను ఎందుకు ఉపయోగిస్తారు..?
అవకాడోను 'సూపర్ ఫుడ్' అంటారు. హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ పండ్లను ఎక్కువగా ఐస్‌క్రీం, సౌందర్య సాధనాల్లో వాడతారు. ఒకసారి నాటితే 40-50 ఏళ్ల వరకు ఫలసాయం వస్తుంది. ఇది చాలా లాభదాయకమై పంట.
అవకాడో సాగుపై సబ్సిడి...
అవకాడో సాగును తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక సబ్సిడీ అంటూ ఏమీలేదు. కానీ సాధారణంగా ఉద్యానవన పంటలపై లభించే సబ్సిడి వర్తిస్తుంది. మొక్కల కొనుగోలు, నీటి వనరుల ఏర్పాటు, మల్చింగ్ వంటి వాటికోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రైతులు సబ్సిడి పొందవచ్చు. కాబట్టి అవకాడో సాగు చేయాలని భావించే రైతులు ఉద్యానవన శాఖ అధికారులు సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అవకాడో ధర ఎంత..?
అవకాడో పండ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె, ఫోలెట్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి-6, మెగ్నీషియం, లూటీన్ వంటి అనేక పోషలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరుకు, జీర్ణక్రియకు ఉపయోగపడతాయి...అలాగే బరువు తగ్గడానికి కూడా పనికివస్తాయి. అందుకే ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది...
మార్కెట్ లో అవకాడో పండ్లు కిలో రూ.300-400 ధర పలుకుతోంది. కాబట్టి ఈ పంట రైతులకు మంచి అవకాశం... సాగు ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. కొందరు రైతులు ఇప్పటికే అవకాడో సాగు ద్వారా ఎకరాకు రూ.10 లక్షల వరకు లాభం పొందుతున్నట్లు సమాచారం.

