- Home
- Telangana
- Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Weather Update: పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులు, ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా వుంటుందనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

ఆగస్టు 10 వరకు దంచికొట్టనున్న వానలు.. ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాల నుంచి అందిన తాజా వాతవరణ బులెటిన్ ప్రకారం.. ఆగస్టు 10 వరకు రెండు రాష్ట్రాల్లో వాతావరణం కూల్‌గా ఉంటుంది. అలాగే, అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రాత్రి నుంచే వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. సరూర్ నగర్‌లో అత్యధికంగా 112 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఉప్పల్‌లో 81.3 మిల్లీ మీటర్లు, బండ్లగూడలో 79.5 మిల్లీ మీటర్లు, హయత్‌నగర్‌లో 72.5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడింది. తూర్పు తెలంగాణలో పడుతున్న వర్షాలు మధ్యాహ్నానికి కాస్త తగ్గుముఖం పట్టినా.. మధ్యాహ్నం నుంచి రాత్రి సమయానికి దక్షిణ, తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మళ్లీ వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి సమయంలో వాన పడే ఛాన్స్ ఉంది. అలాగే, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, హనుమకొండ, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు, ఈదురుగాలుల ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించిన వాతావరణ వివరాల ప్రకారం.. ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది.
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు బయట ఓపెన్ ప్లేసుల్లో ఉండకూడదని అధికారులు సూచించారు. పిడుగు పడే సూచనలు కనిపించినప్పుడు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు లేదా పాత బిల్డింగ్‌ల దగ్గర గానీ నిలబడకూడదు. పక్కా భవనాల్లోకి వెళ్లడం సురక్షితం. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం, రాడార్ వివరాలు, పిడుగుల అలర్ట్స్ తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అందించే మౌసమ్ (Mausam), దామిని (Damini), మేఘదూత్ (Meghdoot) యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని వాడాలని వాతావరణ శాఖ కోరింది.
ప్రమాద స్థాయిలు.. ఐఎండీ కీలక సూచనలు
వర్ష తీవ్రత ఆధారంగా ఐఎండీ అధికారులు ప్రమాద స్థాయిలను వర్గీకరించారు.
• మధ్యస్థ ప్రమాదం: రోడ్లపై నీరు నిలవడం, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ సమస్యలు రావొచ్చు.
• అధిక ప్రమాదం: బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే అవకాశం ఉంటుంది.
• అత్యంత తీవ్ర ప్రమాదం: లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడం, తాత్కాలిక షెడ్లు లేదా రేకుల ఇళ్లు దెబ్బతినే ఛాన్స్ ఉంది.
హెచ్చరికల కోసం నాలుగు రంగులు
• ఎరుపు: తక్షణ చర్యలు తీసుకోండి.
• నారింజ: సిద్ధంగా ఉండండి, అప్రమత్తత అవసరం.
• పసుపు : సమగ్ర వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ ఉండండి.
• ఆకుపచ్చ: ఎలాంటి ప్రమాదం లేదు.

