వాట్సాప్ అప్డేట్ చేసుకునే సమయం వచ్చేసింది.. అందుబాటులోకి అదిరిపోయే ఫీచర్
WhatsApp Schedule Messages: వాట్సాప్ యూజర్లకు ఉపయోగపడే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఎవరికైనా నిర్దిష్ట సమయానికి మెసేజ్ పంపాలనుకుంటే అప్పటివరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇకపై మెసేజ్‌లు పంపేందుకు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు
వాట్సాప్‌లో ఇప్పటివరకు మెసేజ్‌లు పంపాలంటే వాటిని వెంటనే సెండ్ చేయాల్సి వచ్చేది. ఒకవేళ పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రత్యేక సందర్భాల్లో అభినందనలు లేదా ముందుగా నిర్ణయించుకున్న సమాచారాన్ని నిర్దిష్ట సమయంలో పంపాలంటే రిమైండర్లు పెట్టుకోవాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ అప్లికేషన్లను కూడా ఉపయోగించేవారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్ వచ్చింది. దీని ద్వారా పంపాల్సిన సందేశాన్ని ముందుగానే రడీ చేసి, డెలివరీ సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. వ్యక్తిగత చాట్లతో పాటు గ్రూపుల్లోనూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
రెండు వారాల ముందే సందేశాలను షెడ్యూల్ చేసుకునే అవకాశం
ఈ ఫీచర్లో మెసేజ్ పంపడానికి కనీసం 10 నిమిషాల తర్వాతి సమయాన్ని ఎంచుకోవచ్చు. గరిష్ఠంగా రెండు వారాల వరకు ముందుగానే షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంది. కేవలం సాధారణ టెక్ట్స్ మెసేజ్‌లే కాకుండా వెబ్ లింకులు, ఫొటోలు, వీడియోలను కూడా నిర్ణీత సమయానికి పంపేలా సెట్ చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి డాక్యుమెంట్లను షెడ్యూల్ చేసే అవకాశం లేదు. షెడ్యూల్ చేసిన సందేశాలకు కూడా వాట్సాప్ అందించే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత వర్తిస్తుంది. దీంతో సందేశాల గోప్యతకు రక్షణ ఉంటుంది.
ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా మెసేజ్ డెలివరీ
ఈ ఫీచర్లో మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే.. మెసేజ్ పంపాల్సిన సమయంలో ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, వాట్సాప్ యాప్‌ను మూసివేసినా సందేశం ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతుంది. వినియోగదారులు ప్రత్యేకంగా ఆ సమయంలో యాప్ ఓపెన్ చేసి మెసేజ్ పంపాల్సిన పనిలేదు. షెడ్యూల్ చేసిన సందేశాలు డెలివరీ అయ్యేంతవరకు వాటి వివరాలను సంబంధిత చాట్‌లోని ప్రత్యేక సెక్షన్ ద్వారా చూసుకోవచ్చు. ఒకవేళ మనసు మార్చుకుంటే లేదా ఆ మెసేజ్ అవసరం లేదనుకుంటే డెలివరీకి ముందే దాన్ని తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది.
గ్రూప్ చాట్‌లలోనూ ప్రత్యేకంగా పనిచేస్తుంది
గ్రూప్‌లలో షెడ్యూల్ చేసిన సందేశాలకు సంబంధించి వాట్సాప్ ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చింది. ఉదాహరణకు ఒక గ్రూప్‌లో మెసేజ్‌ను షెడ్యూల్ చేసిన తర్వాత, అది డెలివరీ అయ్యే సమయానికి గ్రూపులో ఉన్న సభ్యులకు మాత్రమే ఆ సందేశం చేరుతుంది. మెసేజ్ డెలివరీ అయిన తర్వాత కొత్తగా గ్రూపులో చేరిన వారికి ఆ పాత సందేశం కనిపించదు. దీనివల్ల సందేశం షెడ్యూల్ చేసిన సమయానికి గ్రూపులో ఉన్న సభ్యులకే అది పరిమితం అవుతుంది.
వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేయడం ఎలా?
ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం చాలా సులభం. ముందుగా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కింది విధానాన్ని ఫాలో అవ్వాలి.
* ముందుగా వాట్సాప్‌లో మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయాలి.
* పంపాల్సిన టెక్ట్స్ మెసేజ్‌ను టైప్ చేయాలి లేదా ఫొటో, వీడియో వంటి మీడియాను యాడ్ చేయాలి.
* అనంతరం సెండ్ బటన్‌పై కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయాలి.
* అప్పుడు తేదీ, సమయాన్ని ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
* మీకు కావాల్సిన డెలివరీ తేదీ, సమయాన్ని ఎంచుకుని షెడ్యూల్‌ను కన్ఫర్మ్ చేయాలి.
ఇక షెడ్యూల్ చేసిన సందేశాల వివరాలు అదే చాట్‌లో ప్రత్యేక సెక్షన్లో కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లలో కొందరికి దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. కాబట్టి యాప్ అప్డేట్ చేసిన వెంటనే కనిపించకపోతే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.















