- Home
- Business
- వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న ఫాస్టాగ్ రూల్స్. డబుల్ టోల్ చెల్లించాల్సిందే
వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న ఫాస్టాగ్ రూల్స్. డబుల్ టోల్ చెల్లించాల్సిందే
FASTag: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేగంగా కదలడానికి FASTag వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 1, 2025 నుంచి KYV పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్లు ఆటోమేటిక్‌గా నిలిపివేయనున్నారు.

అసలేంటీ KYV.?
KYV అంటే Know Your Vehicle. తాజాగా దీనిని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం.. ఇటీవలి కాలంలో ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు ఉపయోగించడం, లేదా ఒకరి ఫాస్టాగ్‌ను మరొకరు ఉపయోగించడం వంటి దుర్వినియోగాలు పెరిగాయి. కొంతమంది ఫాస్టాగ్‌ను వాహనంలో ఉంచకుండా చేతిలో పట్టుకుని టోల్ దాటిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ రకమైన అక్రమాలు నివారించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) KYVను తప్పనిసరి చేసింది. దీని ద్వారా ప్రతి ఫాస్టాగ్ ఇప్పుడు దానికే జారీ చేసిన వాహనంతో శాశ్వతంగా అనుసంధానమవుతుంది.
KYV ప్రక్రియ ఎలా చేయాలి?
KYV ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. దీనికి అవసరమైన పత్రాలు:
* వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
* యజమాని గుర్తింపు రుజువు (ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్)
* అవసరమైతే వాహనం ఫోటో, నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించే చిత్రం
* మీరు FASTag జారీ చేసిన బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి “Know Your Vehicle” లేదా “Update KYV” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి OTP ద్వారా ధృవీకరించండి.
* ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ ట్యాగ్ “Verified” స్టేటస్‌లో యాక్టివ్‌గా కనిపిస్తుంది.
చేయకపోతే ఏమవుతుంది?
మీ FASTagలో బ్యాలెన్స్ ఉన్నా కూడా KYV పూర్తి చేయకపోతే అది ఆటోమేటిక్‌గా డీయాక్టివ్ అవుతుంది. దీంతో మీరు టోల్‌గేట్ వద్ద డబుల్ టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 1కు ముందే KYV పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.?
ప్రభుత్వం చెబుతున్నదేమిటంటే, KYV వ్యవస్థ ద్వారా వాహన యాజమాన్యాన్ని సులభంగా గుర్తించవచ్చు. చోరీ అయిన లేదా విక్రయించిన వాహనాలను ట్రాక్ చేయడం సులభతరం అవుతుంది. అలాగే తప్పుడు టోల్ వసూలును తగ్గించి, డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. ఒకవేళ మీ వాహనం అమ్మినా లేదా నెంబర్ మారినా మళ్లీ KYV చేయాల్సి ఉంటుంది.