5G Users in India : అమెరికానే వెనక్కినెట్టేసి.. ప్రపంచంలోనే 5G యూజర్స్ లో ఇండియా టాప్
కేవలం మూడేళ్లలోనే భారత్ 40 కోట్ల 5జీ యూజర్లను సంపాదించి ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా, యూరప్‌లను వెనక్కి నెట్టిన భారత్ డిజిటల్ విప్లవం గురించి మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అమెరికానే వెనక్కినెట్టిన ఇండియా
5G Users in India : టెలికాం రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించిందని కేంద్ర సాంకేతికశాఖ మంత్రి సింధియా పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీలో చాలా దేశాలు వెనుకబడి ఉంటే, భారత్ మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోయిందన్నారు. కేవలం మూడేళ్లలోనే 40 కోట్లకు పైగా 5G యూజర్లను కలిగిన దేశంగా భారత్ నిలిచిందని మంత్రి వెల్లడించారు.
ఇండియాలో 5G రికార్డులు
ఈ అద్భుతమైన వృద్ధితో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. అమెరికా, యూరప్, జపాన్‌లను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం ఆసక్తికరం. అయితే ప్రపంచంలో అత్యధిక 5G వినియోగదారులకు కలిగిన దేశం చైనా... ఇక్కడ 110 కోట్లమంది 5G వినియోగదారులు ఉన్నారు.
మూడేళ్లలో ఇండియా అద్భుతాలు
అక్టోబర్ 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. వేగవంతమైన మౌలిక సదుపాయాలు, చౌక డేటా ధరల వల్ల భారత్ ఈ ఘనతను కేవలం మూడేళ్లలోనే సాధించింది. మనకంటే అమెరికా చాలా వెనకబడింది... ఇక్కడ కేవలం 35 కోట్ల మంది మాత్రమే 5G వినియోగిస్తున్నారు. అయితే దేశ జనాభాను, వినియోగదారులను పోల్చి చూస్తే మాత్రం మనకంటే అమెరికానే మెరుగైన స్థానంలో ఉంటుంది.
ఇండియన్ గ్రామాల్లో 5G దూసుకుపోతోంది
సాధారణంగా టెక్నాలజీ నగరాలకే పరిమితం అవుతుంది. కానీ ఈసారి 5జీ గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగంగా విస్తరించింది. గత 10 ఏళ్లలో గ్రామీణ కనెక్షన్లు రెట్టింపు వేగంతో పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడాలేదు... దేశవ్యాప్తంగా 5G యూజర్స్ పెరుగుతున్నారు.
5G కాదు 6G దిశగా ఇండియా
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 'భారత్ 6జీ మిషన్'తో 6జీ టెక్నాలజీ పరిశోధనలో నిమగ్నమై ఉంది. 5జీ తర్వాత ఇప్పుడు 6జీ టెక్నాలజీని కూడా తక్కువ సమయంలోనే సొంతంగా అభివృద్ధి చేస్తోంది. ఇలా టెక్నాలజీ విషయంలో ఇండియా ప్రపంచంలోని అగ్రదేశాలకు కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతోంది.

