'వాళ్లకు కోహ్లీ పేరు తీయకపోతే పూట గడవదు..' తమ్ముడి కోహ్లీని వెనకేసుకొచ్చిన అన్న..
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంజ్రేకర్ తీరుపై విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించాడు.

గట్టిగా ఇచ్చిపడేశాడుగా..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియాలో స్పందించాడు. 'కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదన్నట్లుగా ఉంది ఈ పరిస్థితి' అంటూ పరోక్షంగా మంజ్రేకర్‌తో పాటు కోహ్లీని విమర్శించే ఇతర మాజీ ఆటగాళ్లను ఉద్దేశించి పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఏకీభవిస్తున్న కోహ్లీ అభిమానులు..
వికాస్ కోహ్లీ వ్యాఖ్యలతో విరాట్ కోహ్లీ అభిమానులు ఏకీభవిస్తున్నారు. కొందరు మాజీ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే కోహ్లీని విమర్శిస్తున్నారని, పనిగట్టుకుని వ్యక్తిగత దాడి చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంజయ్ మంజ్రేకర్ అన్నది ఇదే..
ఇటీవల సంజయ్ మంజ్రేకర్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. సులువైన ఫార్మాట్ అయిన వన్డే క్రికెట్‌ను ఎంచుకున్నాడని మంజ్రేకర్ చులకనగా మాట్లాడాడు. తన లోపాలను సరిదిద్దుకోకుండా టెస్టులకు వీడ్కోలు పలికాడని అభిప్రాయపడ్డాడు. జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో కొత్త రికార్డులను అందుకుంటుంటే, తన మనసు మాత్రం కోహ్లీ వెంటే పరుగులు తీస్తోందని మంజ్రేకర్ తెలిపాడు. కోహ్లీ చాలా ముందుగానే టెస్టుల నుంచి తప్పుకున్నాడని, రిటైర్మెంట్ ప్రకటించడానికి ఐదేళ్ల ముందు నుంచి ఫామ్ లేమితో ఇబ్బంది పడినా, ఈ ఐదేళ్లలో టెస్టుల్లో సగటు 31కి ఎందుకు పడిపోయిందో ఆలోచించలేదని అతడు విమర్శించాడు. లోపాలను సరిదిద్దుకొని మళ్లీ ఫామ్ అందుకునేందుకు మనసు పెట్టి ప్రయత్నించలేదని మంజ్రేకర్ తెలిపాడు.
'ఇక చాలు' అనుకున్నాడు..
జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు తమ పొరపాట్లను సరిచేసుకొని టెస్ట్ క్రికెట్‌లో మరింత గొప్ప పేరు తెచ్చుకున్నారని, కానీ కోహ్లీ 'ఇక చాలు' అని వీడ్కోలు పలకడం తనకు బాధగా ఉందని మంజ్రేకర్ పేర్కొన్నాడు. విరాట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా బాగుండేదని, కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్ కు ఎంతో సులువైన వన్డేలో కొనసాగడం తనను మరింత నిరాశకు గురి చేసిందని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
జనవరి 11 నుంచి మళ్లీ మైదానంలోకి..
అయితే, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 2027 వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

