'టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించి.. కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఆడుతున్నాడు..' : మాజీ క్రికెటర్
Virat Kohli: మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంపై నిరాశ వ్యక్తం చేశారు. టెస్టుల్లో గత ఐదేళ్లలో కోహ్లీ సగటు 31 మాత్రమేనని, కానీ రెండు ఫార్మాట్ల నుంచి వైదొలిగి..

ఫ్యాబ్ ఫోర్‌లో ఒకడు..
విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో 'ఫ్యాబ్ ఫోర్'. దశాబ్ద కాలంగా ఈ నలుగురు అద్భుతంగా రాణిస్తూ, అన్ని ఫార్మాట్లలో తమదైన ముద్ర వేశారు. అయితే, కోహ్లీని పక్కన పెడితే, రూట్, విలియమ్సన్, స్మిత్ టెస్ట్ క్రికెట్‌లో తమ సత్తాను చాటుకుంటున్నారు.
రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం తనను చాలా నిరాశకు గురిచేసిందని అన్నారు. మంజ్రేకర్ మాట్లాడుతూ.. జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను చేరుకుంటుండగా, తన మనస్సు మాత్రం విరాట్ కోహ్లీ వైపు వెళుతోందని చెప్పారు.
ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడు..
రెండు రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేలు మాత్రమే ఆడాలని నిర్ణయించుకోవడం ద్వారా కోహ్లీ క్రికెట్‌లో 'ఈజీ ఫార్మాట్'ను ఎంచుకున్నాడని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. 2011లో వెస్టిండీస్ టూర్‌లో ఇండియా జట్టుకు 269వ టెస్ట్ ప్లేయర్‌గా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన విరాట్, 14 ఏళ్ల కెరీర్‌లో పరుగుల మోత మోగించడంతో పాటు తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు.
టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్..
కెప్టెన్‌గా టీమిండియాను టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చాడు. 2018-2019లో ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించాడు. అతని నాయకత్వంలో ఇండియా 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. 42 నెలల పాటు ఇండియాను టెస్టుల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిపాడు. దాంతో టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్‌గా మారాడు.
ఆ సిరీస్‌తో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు..
ఇండియా కెప్టెన్‌గా అత్యధికంగా 20 సెంచరీలు కొట్టి మరో రికార్డు సృష్టించాడు. తన నాయకత్వంలో స్వదేశంలో ఆడిన 11 సిరీస్‌లలో 11 గెలవడం విశేషం. అయితే, గత నాలుగేళ్ల నుంచి తను క్రమంగా ఫామ్ కోల్పోయాడు. సౌత్ ఆఫ్రికాలో సిరీస్ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 37 ఏళ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులాడి 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి.

