- Home
- Sports
- Ridhima Pathak : నన్ను తీసేయడమేంటి? నేనే రానన్నా! బంగ్లాదేశ్ కు రిధిమా పాఠక్ దిమ్మతిరిగే కౌంటర్
Ridhima Pathak : నన్ను తీసేయడమేంటి? నేనే రానన్నా! బంగ్లాదేశ్ కు రిధిమా పాఠక్ దిమ్మతిరిగే కౌంటర్
Ridhima Pathak : భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతింటున్న వేళ, భారత స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్ బీపీఎల్ నుంచి వైదొలగడం చర్చనీయాంశమైంది. ఆమెను తొలగించారని వార్తలు రాగా, దేశం కోసమే తాను స్వయంగా తప్పుకున్నానని రిధిమా స్పష్టం చేశారు.

దేశమే ముఖ్యం: బంగ్లాదేశ్ లీగ్ ఆఫర్ తిరస్కరించిన భారతీయ యాంకర్!
భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన, క్రీడా సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ తాజాగా చోటుచేసుకున్న ఒక పరిణామం వివాదాన్ని మరింత రాజేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) హోస్టింగ్ ప్యానెల్ నుండి ప్రముఖ భారతీయ ప్రజెంటర్ రిధిమా పాఠక్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా తొలగించిందన్న వార్తలు క్రీడాలోకంలో కలకలం రేపాయి.
అయితే, ఈ వార్తలను రిధిమా పాఠక్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తానే స్వచ్ఛందంగా లీగ్ నుంచి వైదొలిగానని ఆమె స్పష్టం చేశారు.
యాంకర్ రిధిమా ఏం చెప్పారంటే?
బీపీఎల్ నుంచి తనను తొలగించారంటూ బంగ్లాదేశ్ మీడియాలో వస్తున్న కథనాలపై రిధిమా పాఠక్ సోషల్ మీడియాలో స్పందించారు. "గత కొన్ని గంటలుగా నన్ను బీపీఎల్ నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. అది అవాస్తవం. లీగ్ నుంచి తప్పుకోవాలన్నది నా వ్యక్తిగత నిర్ణయం. నాకు ఎప్పుడూ నా దేశమే ముఖ్యం. క్రికెట్ ఆటను నేను ఏ అసైన్‌మెంట్ కన్నా ఎక్కువగా గౌరవిస్తాను. ఇన్నాళ్లుగా నేను నిజాయితీతో, గౌరవంతో ఈ క్రీడకు సేవలు అందించాను. ఇకపై కూడా అదే చిత్తశుద్ధితో కొనసాగుతాను" అని ఆమె పేర్కొన్నారు. తనకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె, క్రికెట్‌కు నిజాయితీ ఉండాలని వ్యాఖ్యానించారు.
ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ రిలీజ్.. వివాదానికి నాంది
ఈ తాజా వివాదానికి బీజం జనవరి 3న పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనికి ప్రతీకారంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ నిషేధం
బీసీసీఐ నిర్ణయానికి కౌంటర్‌గా, జనవరి 5న బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక ఆపరేటర్ల ద్వారా బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ (IPL) ప్రసారాలను పూర్తిగా నిషేధించింది. అంతేకాకుండా, రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టు భారత్‌కు వెళ్లడంపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని డిమాండ్ చేసింది.
ఐసీసీ హెచ్చరిక: ఆడితే భారత్‌లో.. లేదంటే లేదు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని చేసిన ప్రయత్నాలకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. గ్రౌండ్ మార్పు కుదరదని, బంగ్లాదేశ్ జట్టు తప్పనిసరిగా భారత్‌లోనే ఆడాలని స్పష్టం చేసింది. ఒకవేళ భారత్‌కు రాకపోతే, ఆ మ్యాచ్‌లను ఓటమిగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో బీసీబీ ఇరకాటంలో పడింది. మరోవైపు, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI)లో పాల్గొనే బంగ్లాదేశ్ గోల్ఫర్ల పరిస్థితి కూడా అయోమయంగా మారింది.
పెరుగుతున్న దౌత్యపరమైన అగాధం
ఒకప్పుడు స్నేహపూర్వకంగా ఉండే భారత్-బంగ్లా క్రీడా సంబంధాలు ఇప్పుడు దౌత్యపరమైన గొడవల కారణంగా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రిధిమా పాఠక్ ఉదంతం, ముస్తాఫిజుర్ రెహమాన్ తొలగింపు, ఐపీఎల్ బ్యాన్ వంటివి ఈ అగాధాన్ని మరింత పెంచాయి. బీసీసీఐ, బీసీబీ మధ్య జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

