కివీస్‌తో వన్డే సిరీస్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. ఆ ఇద్దరికీ రెస్ట్.!
Team India: సెలెక్టర్లు త్వరలోనే వన్డే జట్టును ప్రకటించనున్నారు. ఈ ఎంపికలో గిల్ రీ-ఎంట్రీ, శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్, బుమ్రా-పాండ్యా రెస్ట్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో..

జట్టు విషయంలో సస్పెన్స్..
భారత వన్డే జట్టు ఎంపికపై సెలెక్టర్లు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నారు. టీ20 ప్రపంచకప్‌కు జట్టును ఇప్పటికే ప్రకటించిన సెలెక్టర్లు, జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా జట్టును అనౌన్స్ చేశారు. టీ20 జట్టు ఎంపికలో శుభమాన్ గిల్‌ను తప్పించడం, ఇషాన్ కిషన్, రింకు సింగ్‌లను జట్టులోకి తీసుకోవడం లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వన్డే జట్టులోనూ అలాంటి అనూహ్య మార్పులు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది.
గిల్ రీఎంట్రీ..
గాయం కారణంగా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శుభమాన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఉంది. అయితే, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక కావడం కష్టమేనని తెలుస్తోంది. ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ, మ్యాచ్ ఫిట్‌నెస్‌ను త్వరగా సాధించడం అతడికి సవాల్‌గా మారింది. ఐపీఎల్ నాటికి శ్రేయస్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వాళ్ళిద్దరికీ రెస్ట్..
బుమ్రా, పాండ్యా లాంటి కీలక ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత బుమ్రా వన్డేల్లో ఆడలేదు. టెస్టులు, టీ20లలో మాత్రమే పాల్గొంటున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోనే వన్డే ఆడాడు. ఆ తర్వాత టీ20లలోనే భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన హార్దిక్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా ఆడే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లను గాయాల బారి నుంచి కాపాడుకోవాలని సెలెక్టర్లు భావిస్తే, వారిని వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.
వికెట్ కీపర్‌పై సర్వత్రా పోటీ..
వికెట్ కీపర్ల స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండనున్నాడు. అయితే, రెండో వికెట్ కీపర్ స్లాట్ కోసం జితేశ్ శర్మ, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్ లాంటి ఆటగాళ్ల మధ్య పోటీ ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో బరిలోకి దిగి కీలక పాత్ర పోషించనున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఆడితే, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉండటం ఖాయం. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ సైతం వన్డే జట్టులోకి ఎంపిక కావడం ఖాయమనే చర్చ ఉంది.
బౌలర్లు వీరే..
స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపిక దాదాపు ఖాయం. బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. జట్టులో చోటు కోసం సిరాజ్ కూడా ఎదురుచూస్తున్నాడు. మొత్తంగా, రాబోయే వన్డే జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది.

