రాసిపెట్టుకో.! రోహిత్, కోహ్లీనే టీమిండియా పరువు నిలబెట్టేది.. బీసీసీఐకి అల్టిమేటం
Team India: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను 2027 వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియాలో కొనసాగించాలని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. వారి అనుభవం, నిలకడైన ప్రదర్శన జట్టుకు అత్యవసరం అని, వారిద్దరూ లేకుండా ప్రపంచకప్ గెలవడం కష్టమని..

ఆ ఇద్దరూ ఉండాల్సిందే
భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దశాబ్దాలుగా సేవలు అందిస్తూ, కీలకమైన పిల్లర్లుగా ఉన్నారు. వారి అంకితభావం, నిలకడైన ప్రదర్శన మిగిలిన ఆటగాళ్లకు మోటివేషన్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువ. ఈ క్రమంలోనే, 2027 వన్డే ప్రపంచకప్‌లో వారిద్దరూ భారత జట్టు ప్రణాళికలలో ఉంటారా లేదా అనేది పెద్ద చర్చ కొనసాగుతోంది. టీమ్ మేనేజ్‌మెంట్ లేదా బీసీసీఐ ఈ ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని సంగతి తెలిసిందే.
అప్పుడు ఆస్ట్రేలియా.. ఇప్పుడు దక్షిణాఫ్రికా
అయితే, మాజీ భారత ఆటగాళ్లు మాత్రం కోహ్లీ, రోహిత్ సేవలు భారత జట్టుకు ఇంకా అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు. వారిద్దరూ లేని జట్టుతో తక్షణమే అద్భుతాలు సాధించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. వారి కెరీర్ గురించి సోషల్ మీడియాలో చర్చించి సీనియర్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడం సరైనది కాదని స్పష్టం చేశారు. యువ ఆటగాళ్ల కంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిలకడగా రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో, అలాగే దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన వన్డే మ్యాచ్ కూడా వీరిద్దరి అద్భుతమైన ప్రదర్శన పరిశీలిస్తే.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు వీరిని కొనసాగించాలని అంటున్నారు.
మాజీ క్రికెటర్లు వారికే ఓటు..
ఈ విషయంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. రోహిత్, కోహ్లీ అద్భుతమైన ఆటగాళ్లని, వారిద్దరూ లేకపోతే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు విజయవంతం కావని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచకప్ ఆడే భారత జట్టులో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఉండాల్సిందేనని, ఇందులో ఎలాంటి సందేహాలు ఉండకూడదని శ్రీకాంత్ గట్టిగా చెప్పారు. కోహ్లీ, రోహిత్ క్రీజ్‌లో 20 ఓవర్ల వరకు నిలబడితే, ప్రత్యర్థుల గెలుపు అవకాశాలు తగ్గుతాయని ఆయన వివరించారు.
మంచి రిథమ్‌లో ఉన్నారు..
రాంచీ వన్డేలో సీనియర్ల భాగస్వామ్యమే భారత్‌కు విజయం అందించిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఒకే ఫార్మాట్‌కు పరిమితమైనప్పుడు రిథమ్ కొనసాగించడం కష్టమే అయినా, వారిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారని, ఫిజికల్ ఫిట్‌నెస్‌పైనా దృష్టి సారించారని శ్రీకాంత్ అన్నారు. ప్రపంచకప్ ఆడే భారత జట్టులో ఓపెనర్ స్థానాన్ని రోహిత్, మూడో స్థానాన్ని విరాట్ కోహ్లీ సుస్థిరం చేసుకున్నారని, వారిద్దరూ లేకుండా ప్రపంచకప్ గెలవడం అసాధ్యమని శ్రీకాంత్ తేల్చి చెప్పారు.
రోకో ప్రపంచకప్ ఆడతారు..
ప్రస్తుతం రోహిత్ శర్మ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ కచ్చితంగా వన్డే ప్రపంచకప్ ప్రణాళికలలో ఉండాల్సిందేనని చర్చ జరుగుతోంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల వయస్సులోనూ దూకుడుగా ఆడుతున్న టాప్ క్లాస్ ప్లేయర్ కోహ్లీ ప్రపంచకప్ ఆడితే టీమిండియాకు ఎంతో ప్రయోజనమని అభిమానులు కూడా అంటున్నారు.

