T20 World Cup India Squad : ప్రత్యర్థులకు దడ.. ఇది టీమిండియా నయా అడ్డా
T20 World Cup 2026 India Squad : టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు ప్రత్యర్థులకు దడపుట్టిస్తోంది. పూర్తి జట్టు ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

T20 World Cup 2026 India Squad : టీమిండియా 2.0 తగ్గేదే లే !
T20 World Cup 2026 India Squad : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి భారత జట్టు యుద్ధనౌకలా సిద్ధమైంది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ దూకుడు నాయకత్వంలో టీమిండియాను చూస్తేనే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతోంది. అటు కొండంత లక్ష్యాన్ని కూడా కరిగించే విధ్వంసకర బ్యాటింగ్, ఇటు వికెట్లు కుప్పకూల్చే పదునైన బౌలింగ్ దళంతో భారత్ అత్యంత భీకరంగా కనిపిస్తోంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న స్కై సేన, మైదానంలో అడుగుపెడితే పరుగుల వరద పారాల్సిందే. ఈసారి సొంతగడ్డపై మరోసారి కప్పు ఎగరేసుకుపోవడమే లక్ష్యంగా, విశ్వవిజేతగా నిలిచేందుకు భారత జట్టు సమరశంఖం పూరించింది.
T20 World Cup 2026 India Squad : టోర్నమెంట్ ఎప్పుడు ఆరంభం అవుతుంది? జట్ల వివరాలు ఏంటి?
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7న అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా, వీటిని 5 జట్ల చొప్పున 4 గ్రూపులుగా (A, B, C, D) విభజించారు. టోర్నీ తొలి రోజునే మూడు మ్యాచ్‌లు జరగనుండగా, పాకిస్తాన్ vs నెదర్లాండ్స్, వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ మ్యాచ్‌ల తర్వాత, డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తన వేటను ముంబై లో అమెరికా (USA)తో మొదలుపెట్టనుంది. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరిగే ఈ క్రికెట్ పండుగలో గ్రూప్ దశ నుంచే తీవ్రమైన పోటీ నెలకొననుంది.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టులో ఎవరెవరున్నారంటే?
టీ20 ప్రపంచకప్ 2026 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వుండగా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. గిల్ ను టీమ్ నుంచి తప్పించారు. న్యూజిలాండ్ సిరీస్ కు ఇదే జట్టు ఉండనుంది.
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCuppic.twitter.com/7CpjGh60vk— BCCI (@BCCI) December 20, 2025
దాయాది పాకిస్తాన్ తో భారత్ పోరు.. టైటిల్ సమరం పై ఉత్కంఠ
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే భారత్ vs పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం లో జరగనుంది. ఇక టోర్నీ తుది అంకం విషయానికొస్తే, మార్చి 4న కోల్‌కతాలో మొదటి సెమీ ఫైనల్, మార్చి 5న ముంబైలో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరగా, విశ్వవిజేతను నిర్ణయించే గ్రాండ్ ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు షెడ్యూల్ ఇదే
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు గ్రూప్ Aలో ఉంది. ఈ మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికా (USA)తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో తలపడనుంది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే దాయాది పోరు ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో పాకిస్తాన్‌తో జరగనుంది. గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

