Sonam Yeshey : 4 ఓవర్లు.. 7 పరుగులు.. 8 వికెట్లు ! టీ20లో ఊహించని ప్రపంచ రికార్డు
8 Wickets For 7 Runs In T20 : భూటాన్ బౌలర్ సోనమ్ యెషీ మయన్మార్‌పై కేవలం 7 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించారు. పురుషుల లేదా మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

టీ20 చరిత్రలోనే సరికొత్త రికార్డు.. 7 పరుగులకే 8 వికెట్లు పడగొట్టిన భూటాన్ బౌలర్ !
సాధారణంగా టీ20 క్రికెట్ అంటే బ్యాట్స్‌మెన్ల ఆట అని, బౌలర్లను ఉతికి ఆరేస్తారని అంటుంటారు. చాలా వరకు అలాంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. కానీ భూటాన్‌కు చెందిన ఓ 22 ఏళ్ల స్పిన్నర్ ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేశాడు. టీ20 మ్యాచ్‌లలో ఇప్పటివరకు ఏ బౌలర్ సాధించలేని అరుదైన ఘనతను ఈ యంగ్ ప్లేయర్ సాధించాడు.
మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో భూటాన్ స్పిన్నర్ సోనమ్ యెషీ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక బౌలర్ ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
చరిత్ర సృష్టించిన సోనమ్ యెషీ స్పెల్
మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భూటాన్‌కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ సోనమ్ యెషీ ఈ అద్భుతాన్ని చేశాడు. గెలేఫూ మైండ్‌ఫుల్నెస్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో, యెషీ తన కోటా అయిన 4 ఓవర్లు వేసి, అందులో ఒక మేడిన్ ఓవర్‌తో సహా కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
తన బౌలింగ్ లో ఏకంగా ప్రత్యర్థి జట్టులోని 8 మంది బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. దేశవాళీ లేదా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఇలాంటి గణాంకాలు నమోదు కావడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ప్రదర్శనతో సోనమ్ యెషీ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించారు.
45 పరుగులకే కుప్పకూలిన మయన్మార్
సోనమ్ యెషీ అద్భుత బౌలింగ్ దాటికి మయన్మార్ జట్టు విలవిల్లాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భూటాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ జట్టు, యెషీ స్పిన్ మాయాజాలానికి తట్టుకోలేకపోయింది.
కేవలం 45 పరుగులకే మయన్మార్ ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు కేవలం 56 బంతులు మాత్రమే ఆడగలిగింది. సోనమ్ యెషీ దాటికి మయన్మార్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మయన్మార్ జట్టులో నలుగురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేకపోయారు. సోనమ్ యెషీ మయన్మార్ ఇన్నింగ్స్‌లోని మొదటి ఆరు వికెట్లను వరుసగా పడగొట్టాడు. ఆనంద్ మోంగార్ ఏడవ వికెట్ తీయడంతో యెషీ వికెట్ల వరుసకు కాస్త బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్ళీ యెషీ ఎనిమిదో వికెట్ తీసి ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఫలితంగా భూటాన్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
సోనమ్ యెషీ దెబ్బకు రికార్డులు బ్రేక్
సోనమ్ యెషీ ఈ ఘనత సాధించడానికి ముందు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 7 వికెట్లు తీయడమే అత్యుత్తమ రికార్డుగా ఉండేది. ఇలా ఆరు సార్లు జరిగింది. పురుషుల టీ20లో మలేషియాకు చెందిన సిజ్రుల్ ఇద్రుస్ 2023లో చైనాపై 8 పరుగులిచ్చి 7 వికెట్లు తీయగా, బహ్రెయిన్‌కు చెందిన అలీ దావూద్ 2025లో భూటాన్‌పై 19 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
మహిళల విభాగంలో ఇండోనేషియాకు చెందిన రోహమలియా మంగోలియాపై 0 పరుగులకే 7 వికెట్లు తీయగా, నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్‌డిక్ 3 పరుగులిచ్చి 7 వికెట్లు, అర్జెంటీనాకు చెందిన అలిసన్ స్టాక్స్ 3 పరుగులిచ్చి 7 వికెట్లు, సైప్రస్‌కు చెందిన సమంతీ దునుకెడెనియా 15 పరుగులిచ్చి 7 వికెట్లు తీశారు.
అలాగే దేశవాళీ టీ20లలో కూడా 7 వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి. 2019లో లీసెస్టర్‌షైర్‌కు చెందిన కాలిన్ అకెర్మాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు తీయగా, 2025లో దర్బార్ రాజ్‌షాహి తరఫున తస్కిన్ అహ్మద్ 19 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టారు. సోనమ్ యెషీ ఈ రికార్డులన్నింటినీ అధిగమించి, 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
ఎవరీ సోనమ్ యెషీ?
ప్రపంచ రికార్డు సృష్టించిన సోనమ్ యెషీ వయసు కేవలం 22 ఏళ్లు. 2003, డిసెంబర్ 3న జన్మించాడు. ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన యెషీ, 2022 జూలైలో మలేషియాపై జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
తన తొలి మ్యాచ్‌లోనే ఆయన 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇప్పటివరకు ఆయన 34 టీ20 మ్యాచ్‌లు ఆడగా, మొత్తం 37 వికెట్లు పడగొట్టాడు. ఆయన ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 5.6 పరుగులు మాత్రమే కావడం విశేషం. టీ20లలో ఒకసారి నాలుగు వికెట్లు, ఒకసారి ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా సాధించాడు.
సిరీస్‌లో అద్భుత ప్రదర్శన
ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో సోనమ్ యెషీ అత్యద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మయన్మార్‌తో జరిగిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భూటాన్ విజయాల్లో సోనమ్ యెషీ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు 8 వికెట్ల ప్రదర్శనతో క్రికెట్ రికార్డుల మోత మోగించాడు.

