214 సెంచరీలతో చరిత్ర సృష్టించాడు.. ఎవడ్రా వీడు ఇలా కొట్టేశాడు !
Cricket 214 Centuries Record: 214 సెంచరీలు, 67170 పరుగులు, 52 ఏళ్ల వయసు వరకు క్రికెట్ లో దుమ్మురేపాడు. ఎవరికీ సాధ్యం కాని రికార్డులతో అదరగొట్టాడు. అతనే సర్ జాక్ హాబ్స్. ఈ స్పెషల్ ప్లేయర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

214 సెంచరీలు.. 52 ఏళ్ల వరకు క్రికెట్
క్రికెట్ ప్రపంచంలో ఆశ్చర్యపరిచే రికార్డులు ఎన్నో ఉన్నాయి. అయితే సర్ జాక్ హాబ్స్ సాధించిన గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నం. ఒకే బ్యాట్స్‌మన్ 214 సెంచరీలు చేయడం, 67170 పరుగులు సాధించడం, అంతేకాకుండా 52 ఏళ్ల వయసు వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం.. ఈ మూడు అంశాలు ఎవరినైనా ఆశ్చర్యంలో ముంచివేస్తాయి. ఈ రికార్డులను చూస్తే వీటిని ఎవరైనా భవిష్యత్తులో బద్దలు కొట్టగలరా అనే ప్రశ్నకు సమాధానం అసాధ్యమనే వస్తుంది.
ఇప్పటికీ చాలా మంది అభిమానులు ప్రపంచంలో అత్యధిక సెంచరీలు, పరుగుల రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీదే ఉందని భావిస్తారు. కానీ మొత్తం (అంతర్జాతీయ + ఫస్ట్ క్లాస్) రికార్డుల విషయంలో సర్ జాక్ హాబ్స్ స్థాయి పూర్తిగా వేరే లెవల్ లో ఉంటుంది.
67170 పరుగులతో క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డు
ఇంగ్లాండ్‌కు చెందిన సర్ జాక్ హాబ్స్ తన కెరీర్ మొత్తం 67170 పరుగులు చేశారు. ఇవి అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను కలిపిన గణాంకాలు. 214 సెంచరీలతో పాటు 301 హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ అద్భుతమైన రికార్డులు ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప గణాంకాలుగా నిలిచాయి.
హాబ్స్ 16 డిసెంబర్ 1882లో జన్మించారు. 1905లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగు పెట్టారు. 1934 వరకు ఆయన నిరంతరం పరుగుల వర్షాన్ని కురిపించారు. ఈ క్రమంలో 52 ఏళ్ల వయసు వరకు క్రికెట్‌ను కొనసాగించడం ఆయన కెరీర్‌లో అత్యంత విశేషాంశంగా నిలిచింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 199 సెంచరీలు
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హాబ్స్ చేసిన రికార్డులు మరింత అద్భుతం. ఆయన 834 మ్యాచ్‌లలో మొత్తం 61760 పరుగులు చేశారు. ఈ సమయంలో 199 సెంచరీలు, 273 అర్థశతకాలు నమోదు చేశారు. 50.70 సగటుతో ఆయన తన ఆటను కొనసాగించడం మరో ప్రత్యేకత.
ఈ రికార్డులు బద్దలు కావడం ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో దాదాపు అసాధ్యం. సంవత్సరానికి చాలా తక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు జరగడం వల్ల కొత్త ఆటగాళ్లు ఇటువంటి భారీ గణాంకాలను చేరుకోవడం కష్టసాధ్యం.
అంతర్జాతీయ అరంగేట్రం నుంచి 23 ఏళ్ల ప్రయాణం
సర్ జాక్ హాబ్స్ 1 జనవరి 1908న ఆస్ట్రేలియా జట్టుపై తన తొలి టెస్ట్ ఆడారు. సుమారు 23 సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్‌లో చురుకుగా కొనసాగారు. ఆయన చివరి టెస్ట్ కూడా ఆస్ట్రేలియా పైనే, 1930 ఆగస్టులో ఆడారు.
46 ఏళ్ల వయసులో టెస్ట్ సంచరీ చేసిన రికార్డు ఇప్పటికీ ఎవ్వరూ అధిగమించలేదు. మొత్తం 61 టెస్ట్ మ్యాచ్‌ల్లో హాబ్స్ 5,410 పరుగులు సాధించారు. ఇందులో 15 సెంచరీలు, 28 అర్థశతకాలు ఉన్నాయి.
నైట్ హుడ్ పొందిన తొలి క్రికెటర్
1953లో సర్ జాక్ హాబ్స్‌కు నైట్ హుడ్ గౌరవం లభించింది. ఈ అత్యున్నత గుర్తింపును పొందిన తొలి క్రికెటర్ ఆయననే. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలకు ఇది అత్యద్భుత గుర్తింపుగా నిలిచింది.
సర్ జాక్ హాబ్స్ కెరీర్ మొత్తం అత్యంత అరుదైన రికార్డులతో నిండిపోయింది. 214 సెంచరీలు, 67170 పరుగులు, 52 ఏళ్ల వరకు క్రికెట్.. ఇవన్నీ కలిసి క్రికెట్ ప్రపంచంలో ఆయనను శాశ్వత ప్రేరణగా నిలపుతున్నాయి.

