- Home
- Sports
- WPL 2026 Auction : తెలుగమ్మాయా మజాకా.. రూ.30 లక్షల బేస్ ప్రైజ్ శ్రీచరణిని ఎంతకు కొన్నారో తెలుసా?
WPL 2026 Auction : తెలుగమ్మాయా మజాకా.. రూ.30 లక్షల బేస్ ప్రైజ్ శ్రీచరణిని ఎంతకు కొన్నారో తెలుసా?
Shree Charani : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) కోసం తాజాగా క్రికెటర్ల వేలంపాట జరిగింది. ఇందులో తెలుగమ్మాయి శ్రీ చరణిని రికార్డు ధరకు కొనుగోలు చేసింది డిల్లీ క్యాపిటల్స్. ఎంతో తెలుసా?

WPL వేలంలో శ్రీ చరణికి రికార్డు ధర
Shree Charani : డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యామని చెప్పుకునే సినీనటులు చాలామంది ఉన్నారు. అంటే నటనలో చిన్నప్పటి నుండి ప్రావిణ్యం ఉండాల్సిన అవసరం లేదు... పెద్దయ్యాక ఏ యాక్టింగ్ స్కూల్లోనో చేరితే సరిపోతుంది. కానీ క్రీడలు అలాకాదు... చిన్నప్పటి నుండి పట్టుదలతో సాధన చేయాల్సిందే. అలాంటిది చిన్నప్పటి నుండి ఖోఖో సాధనచేసిన ఓ తెలుగమ్మాయి సడన్ గా క్రికెటర్ గా మారింది. చివరకు ఐసిసి ఉమెన్స్ ప్రపంచకప్ ఆడేస్థాయికి ఎదిగి అత్యత్తమ ప్రదర్శనతో దేశానికి తొలి కప్ ను కూడా అందించింది. ఆమె ఎవరో కాదు మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీ చరణి.
ఇప్పటికే మహిళల వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీ చరణి యావత్ తెలుగు ప్రజలు గర్వపడేలా చేసింది. దీంతో ఆమెను చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలంతో పాటు కోట్ల రూపాయల నగదు బహుమతిగా ప్రకటించారు. ఇలా వరల్డ్ కప్ విజయంతో శ్రీ చరణి జీవితమే మారిపోయింది... ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో కూడా కోటి రూపాయలకు పైగా చెల్లించి శ్రీ చరణిని దక్కించుకుంది డిల్లీ క్యాపిటల్స్.
WPL వేలంలో శ్రీచరణికి రికార్డు ధర
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలంలో తీవ్రమైన పోటీ కనిపించింది. చాలా మంది భారత క్రీడాకారిణులు, వర్ధమాన తారలు ఫ్రాంచైజీల నుంచి మంచి డీల్స్ దక్కించుకున్నారు. ఇలా తెలుగమ్మాయి శ్రీచరణి కోసం కూడా ప్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆమె బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా ఏకంగా రూ.1.30 లక్షలకు కొనుగోలు చేసింది డిల్లీ క్యాపిటల్స్.
ఇటీవల జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 లో శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేసి WPL ప్రాంచైజీల కంటపడింది. 9 మ్యాచ్‌లలో 27.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్స్ రేసులో నిలిచింది.
ఇక టీ20 ఫార్మాట్‌లోనూ శ్రీచరణి అద్భుతంగా ఆడుతుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు T20Iలలో 14.80 సగటుతో 10 వికెట్లు తీసింది... ఇందులో ఒక ఫోర్-వికెట్ హాల్ కూడా ఉంది. ఇలా బంతితో మాయచేయగల శ్రీ చరణిని మరోసారి డిల్లీ తరపున ఆడనుంది.
ఇద్దరు ఆటగాళ్ల చేరికతో స్ట్రాంగ్ గా మారిన డిసి
ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కీలక కొనుగోళ్లతో తమ జట్టును పటిష్టం చేసుకుంది. ఒకరు శ్రీ చరణి కాగా మరొకరు స్నేహ్ రాణా. ఈ ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది డిల్లీ క్యాపిటల్స్. ఈ ఇద్దరు టాప్ బౌలర్లు జట్టులోకి రావడం డిసికి మరింత బలం చేకూరింది.
స్నేహ్ రాణా 29 T20Iలలో 24.41 సగటుతో 24 వికెట్లు తీసింది. ఈమె అత్యుత్తమ గణాంకాలు 3/9. స్నేహ్ రాణా అనుభవం డిల్లీ క్యాపిటల్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్రీ చరణి, స్నేహ్ రాణా డిసి బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నారు.
RTM కార్డు వాడిన యూపీ, గుజరాత్..
మరో ఇండియన్ ప్లేయర్ కిరణ్ నవగిరెను యూపీ వార్సియర్స్ దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించి రూ. 60 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది. నవగిరె అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవల మహిళల T20 ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ఆడి పంజాబ్ పై కేవలం 34 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ చేసింది. ఆమె పవర్-హిట్టింగ్ సామర్థ్యం వల్ల WPL వేలంలో ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇక గుజరాత్ జెయింట్స్ తమ RTM కార్డును తెలివిగా ఉపయోగించి ముంబై ఇండియన్స్ ఆసక్తి చూపిన భారతి ఫుల్మాలిని రూ. 70 లక్షలకు దక్కించుకుంది. భారత్ తరఫున రెండు T20Iలు ఆడి 23 పరుగులు చేసిన ఫుల్మాలి, మంచి మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా గుర్తింపు పొందింది.
బౌలింగ్ దాడిని పెంచుకున్న ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాధా యాదవ్‌ను రూ. 65 లక్షలకు కొనుగోలు చేసి తమ బౌలింగ్‌ను పటిష్టం చేసుకుంది. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మంచి T20I నైపుణ్యాలను కలిగి ఉంది. ఆమె 89 మ్యాచ్‌లలో 19.09 సగటుతో 103 వికెట్లు తీసింది... ఇందులో రెండు ఫోర్-వికెట్ హాల్స్ ఉన్నాయి. ఆమె అనుభవం, వికెట్లు తీసే సామర్థ్యం ఆర్సీబీ స్పిన్ విభాగానికి బలాన్ని చేకూరుస్తాయి.
ఇదిలా ఉండగా 2024-25 టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యురాలైన మాజీ ప్లేయర్ ఎస్ మేఘన అమ్ముడుపోలేదు. మేఘన భారత్ తరఫున మూడు వన్డేలలో ఒక అర్ధ సెంచరీతో సహా 114 పరుగులు చేసింది. అలాగే 17 T20Iలలో 18.42 సగటుతో ఒక అర్ధ సెంచరీతో 258 పరుగులు చేసింది. అంతర్జాతీయ అనుభవం ఉన్నప్పటికీ, ఈసారి ఆమెను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

