Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !
Shreyas Iyer : విజయ్ హజారే ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. తీవ్ర గాయం నుంచి కోలుకున్న అయ్యర్, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు తన ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు.

శ్రేయస్ అయ్యర్ ఈజ్ బ్యాక్.. 53 బంతుల్లో 82 రన్స్!
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ క్రికెట్ మైదానంలోకి అద్భుతమైన రీతిలో రీఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆయన తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. జైపూర్‌లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్‌లో హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు సాధించి, తన ఫిట్‌నెస్ విషయంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు. అక్టోబర్ 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా గాయపడిన తర్వాత అయ్యర్ ఆడిన తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. సుదీర్ఘ విరామం తర్వాత బ్యాట్ పట్టినప్పటికీ, ఆయనలో పాత దూకుడు ఏమాత్రం తగ్గలేదని ఈ ఇన్నింగ్స్ నిరూపించింది.
ఐసీయూ నుంచి తిరిగి మైదానంలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ గాయం తొలుత అనుకున్నదాని కంటే చాలా తీవ్రమైనదిగా తేలింది. ఆస్ట్రేలియా సిరీస్ సమయంలో స్ప్లీన్ గాయానికి గురైన అయ్యర్‌ను సిడ్నీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్పించాల్సి వచ్చింది. అక్కడ ఆయనకు ఒక చిన్న వైద్య ప్రక్రియ కూడా జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సుదీర్ఘమైన రిహాబిలిటేషన్ ప్రక్రియను ఆయన పూర్తి చేశారు. అక్కడ చివరి 10 రోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్న తర్వాత, బీసీసీఐ (BCCI) వైద్య బృందం ఆయనను తిరిగి క్రికెట్ ఆడటానికి అనుమతించింది. వైద్య బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అయ్యర్ మైదానంలో దిగి సత్తా చాటారు.
53 బంతుల్లోనే 82 పరుగుల విధ్వంసం
31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగి హిమాచల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ఆయన చేసిన 82 పరుగులలో పది ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయ్యర్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ముంబై జట్టు కాస్త ఇబ్బందికర పరిస్థితిలో ఉంది.
ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై 55 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 18 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ కాగా, సర్ఫరాజ్ ఖాన్ 10 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు.
సెంచరీ చేజారినా.. కీలక భాగస్వామ్యాలు
వికెట్లు పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్, ముషీర్ ఖాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ముషీర్ ఖాన్ (51 బంతుల్లో 73 పరుగులు)తో కలిసి మూడో వికెట్‌కు వేగంగా 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ హిమాచల్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.
ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో జతకట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 39 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. అయ్యర్ సెంచరీ దిశగా సాగుతున్నట్లు కనిపించినా, 82 పరుగుల వద్ద కుశాల్ పాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. సెంచరీ చేజారినప్పటికీ, జట్టుకు భారీ స్కోరు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
న్యూజిలాండ్ సిరీస్‌కు అయ్యర్ కు గ్రీన్ సిగ్నల్
రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌కు ఈ ఇన్నింగ్స్ ద్వారా అయ్యర్ తన సన్నద్ధతను చాటుకున్నారు. జనవరి 11న వడోదరలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టు వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆయనపై నమ్మకం ఉంచింది.
అయితే, జట్టులో చేరడానికి ముందు ఆయన తన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన అయ్యర్, విజయ్ హజారే ట్రోఫీలో తన ప్రదర్శన ద్వారా ఆ అడ్డంకిని దాటారు. హిమాచల్‌పై ఆయన బ్యాటింగ్ తీరు చూస్తుంటే, న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లలో ప్లేయింగ్ 11 ఆయన స్థానం ఖాయమైనట్లే కనిపిస్తోంది.

