ప్రిన్స్ కోసం పక్కనపెట్టేశారు.. టీమిండియా అన్‌లక్కీ ప్లేయర్ ఇక తిరిగి రావడం కష్టమే..
Team India: సంజు శాంసన్ ఒకప్పుడు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్. శుభ్ మన్ గిల్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మారగా, జితేష్ శర్మ జట్టులోకి రావడంతో సంజు స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

12 నెలల్లో 3 సెంచరీలు
ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ వరకు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్ సంజు శాంసనే. గత 12 నెలల్లో సంజు మూడు అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసి, కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టులో కీలక ఆటగాడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే, శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు కల్పించేందుకు సంజు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓపెనర్‌గా రాణించిన సంజు, గిల్ కారణంగా మిడిల్ ఆర్డర్‌లో ఆడే పరిస్థితి ఏర్పడింది.
సంజూ టీం నుంచి అవుట్..
ప్రస్తుతం, జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడుతుండటంతో సంజు ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇక సంజు మరల తిరిగి జట్టులోకి రావడం కష్టమేనా? ఆసియా కప్ 2025కు ముందు జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం లభిస్తుందని, శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారని తొలుత భావించారు. అయితే, జట్టు యాజమాన్యం సంజు శాంసన్ ని ఎంచుకుని ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయం కొంతవరకు విజయవంతమైంది. టోర్నీలో సంజు తనదైన రీతిలో రాణించాడు. ఫైనల్ లో తిలక్ వర్మతో కలిసి సంజు నెలకొల్పిన భాగస్వామ్యం టీం ఇండియాను తిరిగి మ్యాచ్ లోకి తీసుకువచ్చింది.
అన్ లక్కీ ప్లేయర్ శాంసన్
అయితే, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. అదే సిరీస్ కాన్బెర్రా మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బదులుగా మూడవ స్థానంలో బ్యాటింగ్ కు పంపారు. మెల్‌బోర్న్‌లో సంజు మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దీని తర్వాత, మూడో మ్యాచ్ లో జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్ లో అవకాశం దక్కింది. హోబర్ట్ మ్యాచ్ లో జితేష్ శర్మ బాగా రాణించాడు. అలాగే నాలుగో టీ20లో జితేష్ సరిగ్గా ఆడలేకపోయినా.. చివరి మ్యాచ్ ఆడటం ఖాయంగా ఉంది.
జితేష్ ఆగమనం
జితేష్ శర్మ ఆగమనంతో ఇప్పుడు రాబోయే నెలల్లో సంజు శాంసన్ భవిష్యత్తు ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. జితేష్ మిడిల్ ఆర్డర్ లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటే ఇక సంజుకి జట్టులో స్థానం దొరకడం కష్టం కావచ్చు. సంజు ఒకప్పుడు ఓపెనర్ గా మూడు సెంచరీలు సాధించాడు.
గిల్ కోసం వేటు
శుభ్ మన్ గిల్ కు స్థానం కల్పించడానికి అతనిపై వేటు వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని రెండవ వికెట్ కీపర్ గా కొనసాగిస్తారా లేదా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం అతనికి కష్టమేనా అనే అనుమానాలు తీవ్రంగా తలెత్తుతున్నాయి. సంజు శాంసన్ ఒకప్పుడు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్. శుభ్ మన్ గిల్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మారగా, జితేష్ శర్మ జట్టులోకి రావడంతో సంజు స్థానం ప్రశ్నార్థకంగా మారింది.