ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?
IPL 2026: ఎంఎస్ ధోనీకి ఐపీఎల్ 2026 చివరి సీజన్ కానుంది. ఆ తర్వాత ధోనీ మెంటర్ పాత్రలోకి మారతాడని ఊతప్ప వెల్లడించాడు. యువ ఆటగాళ్లపై సీఎస్కే దృష్టి సారించడం, రికార్డు ధరలకు అన్-క్యాప్డ్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం..

ధోని రిటైర్మెంట్
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి ఆటగాడిగా చివరి సీజన్ అవుతుందని స్పష్టం చేశాడు. ఈ సీజన్ తర్వాత 44 ఏళ్ల ధోనీ ఆట నుంచి వీడ్కోలు తీసుకొని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మెంటర్ పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నాడని ఊతప్ప తెలిపాడు.
యువ ఆటగాళ్లపై దృష్టి
ఇటీవలి కాలంలో సీఎస్కే యువ ఆటగాళ్లపై ఎక్కువగా దృష్టి సారించింది. అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో, సీఎస్కే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను, వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మను 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరూ ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన అన్-క్యాప్డ్ దేశీయ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. మొత్తం రూ. 41 కోట్లలో రూ. 28.4 కోట్లను కేవలం ఈ యువ ఆటగాళ్లపైనే ఖర్చు చేయడం గమనార్హం.
అందుకే జడేజాను ట్రేడ్ చేసింది..
మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసి, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చాహర్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం కూడా ఇదే వ్యూహానికి నిదర్శనమని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. ధోనీ లాంటి గొప్ప మెంటర్ జట్టులో ఉంటే, మరో జడేజాను తయారు చేయడం అసాధ్యం కాదని అతడు అభిప్రాయపడ్డాడు.
చెన్నై ఇక తగ్గేదేలే
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీతో పాటు ధోనీ మెంటార్ షిప్ ఉంటే సీఎస్కే సరైన దిశలో ముందుకు వెళ్తుందని ఊతప్ప అన్నాడు. ధోనీ ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కూడా సీఎస్కేతో తన అనుబంధాన్ని కొనసాగిస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని అతడు నొక్కి చెప్పాడు.
మెంటార్ గా ధోని..
ఈ పరిణామాలన్నీ ధోనీ ఆటగాడిగా కాకుండా మెంటర్ పాత్రలోకి మారబోతున్నాడని సూచిస్తున్నాయని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు. గత ఐదు సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఉన్నప్పటికీ, అభిమానులకు సరైన వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో అతడు ఇంకా కొనసాగుతున్నాడని ఊతప్ప వెల్లడించాడు. ధోనీ మెంటార్ షిప్‌లో సీఎస్కే సరైన దిశలో పయనిస్తుందని అతడు ధీమా వ్యక్తం చేశాడు.

