IPL 2026: పృథ్వీ షాకు జాక్‌పాట్.. మాక్ వేలంలో కళ్లు చెదిరే ధర! ఇతర ప్లేయర్ల సంగతేంటి?
IPL 2026: ఐపీఎల్ 2026 మాక్ వేలంలో పృథ్వీ షాకు జాక్‌పాట్ తగిలింది. రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 5.25 కోట్లకు పృథ్వీ షాను కొనుగోలు చేసింది. అయితే, ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2026: మాక్ వేలంలో పృథ్వీ షా మెరుపులు
ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన మాక్ వేలం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా, గత సీజన్‌లో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన యువ ఓపెనర్ పృథ్వీ షా, ఈ మాక్ వేలంలో సంచలనం సృష్టించాడు. డిసెంబర్ 16న జరగనున్న ఐపీఎల్ మినీ వేలానికి ముందు, అశ్విన్ నిర్వహించిన ఈ నమూనా వేలంలో పృథ్వీ షాకు భారీ ధర పలికింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అతన్ని ఏకంగా రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.
పృథ్వీ షా కోసం పోటీపడ్డ జట్లు
అశ్విన్ నిర్వహించిన మాక్ వేలంలో పృథ్వీ షా పేరు రాగానే ఫ్రాంచైజీల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. షా తన బేస్ ప్రైస్‌ను రూ. 75 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బిడ్డింగ్‌ను ప్రారంభించింది. వెంటనే పృథ్వీ షా మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కూడా పోటీలోకి దిగింది.
ధర పెరిగేకొద్దీ ఆర్‌సీబీ వెనక్కి తగ్గింది. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రేసులోకి రావడంతో బిడ్డింగ్ వార్ మరింత వేడెక్కింది. లక్నో జట్టు బిడ్‌ను రూ. 4 కోట్ల వరకు తీసుకెళ్లింది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పుకుంది. షా లక్నో జట్టుకు వెళ్తాడని అంతా భావించారు. కానీ, ధర రూ. 5 కోట్లు దాటగానే లక్నో కూడా వెనక్కి తగ్గింది. అప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రంగంలోకి దిగి, రూ. 5.25 కోట్ల నిర్ణయాత్మక బిడ్‌తో పృథ్వీ షాను సొంతం చేసుకుంది.
పృథ్వీ షా : గత వైఫల్యాలు.. రీఎంట్రీకి సిద్ధం
ఒకప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తు సూపర్ స్టార్‌గా పృథ్వీ షాను కీర్తించారు. కేవలం 18 ఏళ్ల వయసులో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసి, 99 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్రదర్శన చూసిన క్రికెట్ దిగ్గజాలు అతడు గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని అంచనా వేశారు.
అయితే, తర్వాతి కాలంలో మైదానం వెలుపల జరిగిన కొన్ని పరిణామాలు, ఫిట్‌నెస్ సమస్యలు, క్రికెట్‌పై ఏకాగ్రత తగ్గడం వంటి కారణాల వల్ల అతని కెరీర్ గాడి తప్పింది. ఫలితంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. అంతేకాకుండా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ జట్టూ అతన్ని కొనుగోలు చేయకపోవడంతో 'అన్‌సోల్డ్'గా మిగిలిపోయాడు. కానీ, ఇప్పుడు ఐపీఎల్ 2026 (19వ సీజన్) ద్వారా మళ్లీ తన సత్తా చాటాలని పృథ్వీ షా గట్టి పట్టుదలతో ఉన్నాడు.
అద్భుతమైన ఫామ్‌లో పృథ్వీ షా
పృథ్వీ షాపై మాక్ వేలంలోనే కాకుండా, రాబోయే అసలు వేలంలో కూడా భారీ ధర పలికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అతని ప్రస్తుత ఫామ్. దేశవాళీ క్రికెట్‌లో షా పరుగుల వరద పారిస్తున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షా, 6 మ్యాచుల్లో 164.22 స్ట్రైక్ రేట్‌తో 179 పరుగులు చేశాడు. అలాగే, రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో 5 మ్యాచుల్లోని 7 ఇన్నింగ్స్‌లలో 67.14 సగటుతో ఏకంగా 470 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ (హై స్కోర్ 222 పరుగులు), రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలు అతను ఎంతటి భీకర ఫామ్‌లో ఉన్నాడో స్పష్టం చేస్తున్నాయి.
పృథ్వీ షా ఐపీఎల్ కెరీర్, గత రికార్డులు
పృథ్వీ షా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కీలక ఆటగాడిగా ఉండేవాడు. 2018 నుండి 2024 వరకు ఢిల్లీ తరఫున ఆడిన అతనికి, ఫ్రాంచైజీ ఏడాదికి రూ. 7.50 కోట్ల వేతనం చెల్లించింది. అయితే, గత సీజన్‌కు ముందు ఢిల్లీ అతన్ని రిలీజ్ చేసింది.
తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 79 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా, 1892 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు మాక్ వేలంలో జరిగినట్లే, అసలు వేలంలో కూడా అతనిపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపిస్తాయో లేదో చూడాలి.
అశ్విన్ మాక్ వేలంలో కేకేఆర్ కొనుగోలు చేసిన ఇతర ఆటగాళ్లు
రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ఈ మాక్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ పృథ్వీ షాతో పాటు మరికొందరు స్టార్ ఆటగాళ్లను భారీ ధరకు కొనుగోలు చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి:
• లియామ్ లివింగ్‌స్టోన్ - రూ. 18.5 కోట్లు
• వెంకటేశ్ అయ్యర్ - రూ. 17.5 కోట్లు
• పృథ్వీ షా - రూ. 5.25 కోట్లు
• బెన్ డకెట్ - రూ. 4 కోట్లు
• జానీ బెయిర్‌స్టో - రూ. 3.75 కోట్లు

