Padma Awards 2026 : ప్రపంచాన్ని గెలిచినోళ్లకు పద్మ కిరీటం.. రోహిత్, హర్మన్‌లకు సలాం !
Padma Awards : 2026 పద్మ పురస్కారాల్లో క్రీడాకారుల హవా కొనసాగింది. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మభూషణ్, క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ వరించాయి.

రోహిత్, హర్మన్‌ప్రీత్‌లకు అరుదైన గౌరవం.. పద్మ అవార్డుల పూర్తి లిస్ట్ ఇదే
భారత ప్రభుత్వం ఆదివారం ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలు 2026ను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ జాబితాలో క్రీడా రంగానికి చెందిన పలువురు దిగ్గజాలకు స్థానం దక్కింది. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌కు ఎంపికయ్యారు.
భారత క్రికెట్ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ ఏడాది పద్మ అవార్డుల్లో క్రీడా రంగానికి చెందిన మొత్తం 8 మందికి చోటు దక్కగా, వారిలో ఒకరికి పద్మభూషణ్, ఏడుగురికి పద్మశ్రీ లభించింది.
టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మభూషణ్
2026 పద్మ అవార్డుల్లో క్రీడా రంగం నుంచి పద్మభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి విజయ్ అమృత్‌రాజ్ కావడం విశేషం. భారత టెన్నిస్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అమోఘం. అమృత్‌రాజ్ తన కెరీర్‌లో రెండుసార్లు వింబుల్డన్, యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుని, భారత టెన్నిస్‌లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.
క్రీడలకు ఆయన అందించిన సేవలకు గాను 1974లోనే అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ పురస్కారం ఆయన్ను వరించాయి. దశాబ్దాల పాటు క్రీడా మైదానంలోనూ, వెలుపల ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ దక్కింది. అమెరికాలో స్థిరపడిన ఆయన పేరును కేంద్రం ఈ జాబితాలో చేర్చింది.
క్రికెట్ స్టార్లు రోహిత్, హర్మన్‌ప్రీత్‌లకు గుర్తింపు
భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 2024లో భారత్‌కు రెండవ టీ20 ప్రపంచకప్ అందించడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారు. అలాగే గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రోహిత్ సారథ్యంలోనే భారత్ టైటిల్ గెలుచుకుంది. 2025లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, వన్డేల్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. గత ఏడాది వన్డే ఫార్మాట్‌లో 650 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.
మరోవైపు, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో 2025 భారత్‌కు చిరస్మరణీయమైన ఏడాదిగా నిలిచింది. సొంతగడ్డపై జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. మహిళల క్రికెట్‌లో భారత్‌కు ఉన్న ప్రపంచకప్ కరవును తీర్చిన ఘనత ఆమెకు దక్కింది.
హాకీ, పారా స్పోర్ట్స్ క్రీడాకారులకు సత్కారం
క్రికెట్‌తో పాటు హాకీ, ఇతర క్రీడలకు కూడా ఈసారి పద్మ అవార్డుల్లో ప్రాధాన్యం దక్కింది. భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పూనియాకు పద్మశ్రీ అవార్డు లభించింది. అంతర్జాతీయంగా భారత హాకీ జట్టు విజయాల్లో ఆమె నిలకడైన ప్రదర్శన, నాయకత్వ లక్షణాలు కీలక పాత్ర పోషించాయి. అలాగే, పారా హై జంపర్ ప్రవీణ్ కుమార్ (ఉత్తర ప్రదేశ్) కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు. పారా స్పోర్ట్స్ విభాగంలో దేశానికి పతకాలు సాధించిపెట్టిన ఆయన కృషికి ఈ గుర్తింపు లభించింది.
కోచ్‌లకు, ఇతర క్రీడాకారులకు దక్కిన గౌరవం
దేశంలో మహిళల హాకీ ముఖచిత్రాన్ని మార్చిన కోచ్‌గా గుర్తింపు పొందిన బల్దేవ్ సింగ్ (పంజాబ్)కు పద్మశ్రీ దక్కింది. అలాగే క్రీడల్లో విశేష కృషి చేసిన భగవాన్‌దాస్ రైక్వార్ (మధ్యప్రదేశ్), కె. పజనివేల్ (పుదుచ్చేరి) కూడా పద్మశ్రీ జాబితాలో ఉన్నారు. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, రవి దహియా వంటి స్టార్ రెజ్లర్లను తీర్చిదిద్దిన జార్జియాకు చెందిన కోచ్ వ్లాదిమిర్ మెస్ట్‌విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.
మొత్తం 131 పద్మ పురస్కారాలు
2026 సంవత్సరానికి గాను రాష్ట్రపతి మొత్తం 131 పద్మ పురస్కారాలను ఆమోదించారు. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఈ జాబితాలో 19 మంది మహిళలు ఉండగా, విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐ/పిఐఓ విభాగం నుంచి 6 మంది ఎంపికయ్యారు. 16 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు వంటి వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలు దక్కాయి.
పద్మ అవార్డ్స్ 2026 - క్రీడాకారుల జాబితా ఇదే
• విజయ్ అమృత్‌రాజ్ - పద్మభూషణ్ (టెన్నిస్)
• రోహిత్ శర్మ - పద్మశ్రీ (క్రికెట్)
• హర్మన్‌ప్రీత్ కౌర్ - పద్మశ్రీ (క్రికెట్)
• సవితా పూనియా - పద్మశ్రీ (హాకీ)
• ప్రవీణ్ కుమార్ - పద్మశ్రీ (పారా అథ్లెటిక్స్)
• బల్దేవ్ సింగ్ - పద్మశ్రీ (హాకీ కోచ్)
• భగవాన్‌దాస్ రైక్వార్ - పద్మశ్రీ
• కె. పజనివేల్ - పద్మశ్రీ
• వ్లాదిమిర్ మెస్ట్‌విరిష్విలి - పద్మశ్రీ (రెజ్లింగ్ కోచ్ - మరణానంతరం)

