Mustafizur Rahman : భారత్, బంగ్లా మధ్య క్రికెట్ అగ్గి .. ముస్తాఫిజుర్ రహ్మాన్ ఎమన్నారంటే?
Mustafizur Rahman : ఐపీఎల్ టీమ్ కేకేఆర్ జట్టు నుండి తనను తొలగించడంపై ముస్తాఫిజుర్ రహ్మాన్ స్పందించాడు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

కేకేఆర్ సంచలన నిర్ణయం: ముస్తాఫిజుర్ రహ్మాన్ రియాక్షన్ ఇదే !
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చోటుచేసుకున్న పరిణామాలు భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రూ. 9.2 కోట్లకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను అకస్మాత్తుగా జట్టు నుండి విడుదల చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ పరిణామంపై ఎట్టకేలకు ముస్తాఫిజుర్ రహ్మాన్ మౌనం వీడారు. బీసీసీఐ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, తాను చేయగలిగిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ వివాదం ముదురుతుండటంతో రాబోయే టీ20 ప్రపంచ కప్ ప్లేస్ ల మార్పుపై కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం పట్టుబడుతోంది.
నేను చేయగలిగిందేమీ లేదు : ముస్తాఫిజుర్ రహ్మాన్
మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ, బీసీసీఐ ఆదేశాల మేరకు తనను రిలీజ్ చేయడంపై ముస్తాఫిజుర్ రహ్మాన్ నిరాశ వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశం చేజారడంపై ఆయన విచారం వ్యక్తం చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ విషయంపై బిడిక్రిక్‌టైమ్ తో మాట్లాడుతూ ముస్తాఫిజుర్ తన తొలి స్పందనను తెలియజేశారు. "ఒకవేళ వారు (KKR/BCCI) నన్ను విడుదల చేయాలని నిర్ణయించుకుంటే, ఆ విషయంలో నేను చేయగలిగిందేమీ లేదు" అని ఆయన చాలా క్లుప్తంగా, కానీ ఆవేదనతో సమాధానమిచ్చారు. ఈ పరిస్థితిని ఆయన చాలా ప్రశాంతంగా ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఆటగాడి అనుమతి లేకుండా లేదా బీసీసీఐ జోక్యం లేకుండా ఫ్రాంచైజీ ఒక ఆటగాడిని విడుదల చేయకూడదు. అయితే, ఈ నిర్ణయం తమ చేతుల్లో లేదని, బీసీసీఐ ఆదేశాల మేరకే జరిగిందని కేకేఆర్ ఫ్రాంచైజీ తెలిపింది. ఈ సీజన్‌కు ముస్తాఫిజుర్ స్థానంలో వేరే ఆటగాడిని తీసుకునేందుకు తమకు అనుమతి లభించిందని కేకేఆర్ పేర్కొంది.
ప్రపంచ కప్ మ్యాచ్‌ల తరలింపునకు బంగ్లా డిమాండ్
ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతం తర్వాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత్‌లో షెడ్యూల్ చేసిన తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని కోరాల్సిందిగా బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)ని ఆదేశించింది.
ఆటగాళ్ల భద్రతపై ఆందోళన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. కోల్‌కతాలో మూడు, ముంబైలో ఒకటి చొప్పున బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని జైషా నేతృత్వంలోని ఐసీసీని కోరాలని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ జట్టు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న నేపాల్‌తో ముంబైలో చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పాకిస్థాన్ తన ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. రాజకీయ ఉద్రిక్తతలు
ఈ వివాదం కేవలం మైదానానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ డిమాండ్ చేశారు. "బంగ్లాదేశ్ క్రికెట్‌ను, క్రికెటర్లను లేదా దేశాన్ని అవమానించడాన్ని మేము సహించం. బానిసత్వపు రోజులు పోయాయి" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసేలా చూడాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరినట్లు ఆయన తెలిపారు.
గత ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవిని కోల్పోయి భారత్‌కు పారిపోయిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువుల పై దాడులు జరుగుతున్నాయన్న రిపోర్టుల నేపథ్యంలో భారత్‌లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఎంపిక చేసినందుకు కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్‌పై బీజేపీ నేత సంగీత్ సోమ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ఈ రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు క్రీడలపై పడుతోంది.
మార్పులు అసాధ్యం: బీసీసీఐ వర్గాలు
బంగ్లాదేశ్ డిమాండ్‌పై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. టోర్నీ ప్రారంభానికి కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉన్నందున, ఇప్పుడు మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చడం దాదాపు అసాధ్యం అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
"ఎవరి ఇష్టానుసారం మ్యాచ్‌లను మార్చలేము. ఇది నిర్వహణాపరంగా చాలా పెద్ద సవాలు. ప్రత్యర్థి జట్ల విమాన టిక్కెట్లు, హోటళ్లు అన్నీ ఇప్పటికే బుక్ అయ్యాయి. ప్రతిరోజూ మూడు మ్యాచ్‌లు ఉన్నాయి, అంటే ఒక మ్యాచ్ శ్రీలంకలో జరగాల్సి ఉంటుంది. ప్రసార సిబ్బందిని, ఇతర ఏర్పాట్లను మార్చడం చెప్పినంత సులభం కాదు" అని ఒక బీసీసీఐ అధికారి తెలిపినట్టు పీటీఐ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వివాదాల మధ్య బంగ్లాదేశ్ టీ20 జట్టు ప్రకటన
ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్‌గా కొనసాగనుండగా, వివాదానికి కేంద్రబిందువైన ముస్తాఫిజుర్ రహ్మాన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.
గాయం కారణంగా ఐర్లాండ్ సిరీస్‌కు దూరమైన పేసర్ టస్కిన్ అహ్మద్ జట్టులోకి తిరిగి వచ్చారు. బ్యాటింగ్ విభాగంలో లిటన్ దాస్‌కు తోడుగా తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ కీలకం కానున్నారు. బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీతో కలిసి గ్రూప్ సిలో ఉంది. ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నాయి.
బంగ్లాదేశ్ జట్టు : లిటన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్), తంజిద్ హసన్, మహ్మద్ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, కాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తంజిమ్ హసన్ సాకిబ్, టస్కిన్ అహ్మద్, ఎండి సైఫుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.

