JJ Gabriel ఎవరీ జూనియర్ మెస్సీ?.. సాకర్ తాజా సంచలనం!
లయోనల్ మెస్సీ.. పుట్ బాల్ ఆటలో ఒక దిగ్గజం. తన ఆట, వ్యక్తిత్వంతో సాకర్ ప్రపంచం శిఖరానికి చేరాడు. పధ్నాలుగేళ్ల మాంచెస్టర్ యునైటెడ్ కుర్రాడు జేజే గాబ్రియేల్ సైతం తన ఆటతో మెస్సీని మరిపిస్తున్నాడు. టాప్ క్లబ్బులు, బ్రాండ్లను ఆకర్షిస్తున్నాడు. అతడి వివరాలు..

యూట్యూబ్ వైరల్ బాయ్
మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీలో 14 ఏళ్ల జేజే గాబ్రియేల్ దుమ్ము రేపుతున్నాడు. చిన్న వయసులోనే టాప్ క్లబ్బులు, బ్రాండ్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. యూట్యూబ్‌లో అతడి వీడియో వైరల్ కావడంతో 'కిడ్ మెస్సీ' అంటున్నారు. నేమార్, రోనాల్డోలాంటి టాప్ ఆటగాళ్లతోనూ పోలుస్తున్నారు.
తారలా మెరిసే కుర్రాడు
గాబ్రియేల్ టాలెంట్ చిన్నప్పుడే తెలిసింది. ఆరేళ్ల వయసులో బంతిని కింద పడకుండా వెయ్యిసార్లు కాలితో ఆడాడు. అతని పట్టుదల, టెక్నిక్స్ వల్ల పెద్దవాళ్ల మ్యాచ్‌లలో కూడా వాళ్లతో సమానంగా ఆడేవాడు.
గాబ్రియేల్ ఒత్తిడిలో కూడా బాగా ఆడతాడు. ఫ్లడ్‌లైట్ కప్ గేమ్‌లో గాబ్రియేల్‌కు భుజం గాయమైంది. అయినా అతడు ఆడటం ఆపలేదు. హ్యాట్రిక్ గోల్స్ కొట్టి, ఒక గోల్ చేయడానికి సహాయం చేశాడు. అతడి పట్టుదలకు అప్పుడే అంతా ఫిదా అయ్యారు.
ప్రపంచ గుర్తింపు, ఆసక్తి
గాబ్రియేల్ టాలెంట్ చూసి బార్సిలోనా, బేయర్న్ మ్యూనిచ్, రియల్ మాడ్రిడ్ లాంటి టాప్ క్లబ్బులు అతన్ని తీసుకోవాలని చూస్తున్నాయి. ఐరిష్ పాస్‌పోర్ట్ ఉండటంతో 16 ఏళ్లకే యూరోపియన్ యూనియన్‌లో ఆడొచ్చు.
గాబ్రియేల్‌ను వదులుకోకూడదని మాంచెస్టర్ యునైటెడ్ ప్రయత్నిస్తోంది. ఫస్ట్-టీమ్ మ్యాచ్‌ల కోసం బాక్సులు ఇచ్చింది. ప్రీమియర్ లీగ్ కప్ ఫైనల్‌లో అండర్ 18 టీమ్‌తో కలిసి వార్మప్ చేయడానికి పిలిచింది.
గాబ్రియేల్‌కు క్రిస్టియానో రోనాల్డో జూనియర్‌తో మంచి స్నేహం ఉంది. ఇద్దరూ మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీలో ఆడేవారు. రోనాల్డో సీనియర్ ఇంటికి కూడా కలిసి వెళ్లేవారు. గాబ్రియేల్ ఎదుగుదలలో కుటుంబం పాత్ర ఎంతో ఉంది. అతని నాన్న, ఐర్లాండ్ ప్లేయర్ జో ఓ'సియారుయిల్, కొడుకు పేరును బ్రాండ్‌లా మార్చడానికి ఎంతో శ్రమించారు.
క్రమశిక్షణతో కూడిన జీవితం
గాబ్రియేల్ డైట్, ట్రైనింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. గాబ్రియేల్ కోచ్ ఆల్ఫీ బ్రూక్స్, గాబ్రియేల్ బెస్ట్ ప్లేయర్ అని పొగుడుతున్నాడు. అతను ఇప్పుడే ప్రీమియర్ లీగ్‌లోకి వెళ్లినా అందరికంటే బాగా ఆడగలడని చెబుతున్నాడు.
గాబ్రియేల్ కోసం పోటీ
గాబ్రియేల్ కోసం టాప్ బ్రాండ్లు పోటీ పడుతున్నాయి. నైక్ అతనితో మంచి డీల్ కుదుర్చుకుంది. అతని వయసులో ఇంత మంచి డీల్ ఎవరికీ రాలేదని అంటున్నారు.
మాంచెస్టర్ యునైటెడ్ కిట్ సప్లయర్ అయిన అడిడాస్ కూడా గాబ్రియేల్ కోసం ప్రయత్నించింది. మాంచెస్టర్ యునైటెడ్, చెల్సియా మ్యాచ్‌కు అతన్ని పిలిచింది. కానీ నైక్ అతన్ని సొంతం చేసుకుంది.