- Home
- Sports
- Siraj: సిరాజ్ ను ఎందుకు పక్కన పెట్టారు? రెండో టెస్ట్ నుంచి కూడా ఔట్.. గ్రౌండ్‌లో ఏడ్చేశాడా?
Siraj: సిరాజ్ ను ఎందుకు పక్కన పెట్టారు? రెండో టెస్ట్ నుంచి కూడా ఔట్.. గ్రౌండ్‌లో ఏడ్చేశాడా?
Mohammed Siraj: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ మహ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై హర్ష భోగ్లే, మురళీ కార్తీక్, గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరాజ్ ఎమోషనల్ అవుతున్నట్టు కనిపిస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.

ఆరేళ్ల కెరీర్‌లో సిరాజ్‌కు తొలిసారి ఇంత అవమానం.. అసలు టీమ్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తోంది?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ లో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి సిరాజ్‌ను పక్కన పెట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
హర్ష భోగ్లే ఫైర్: ఇది చాలా అన్యాయం
సిరాజ్‌ను మరోసారి బెంచ్‌కే పరిమితం చేయడంపై ప్రముఖ క్రికెట్ కామెంటర్ హర్ష భోగ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా అన్యాయం అని ఆయన విమర్శించారు. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్ల జాబితాలో భారత్ తరఫున కేవలం జస్ప్రీత్ బుమ్రా మాత్రమే మిగిలాడని భోగ్లే గుర్తు చేశారు. ఇలాంటి సెలక్షన్ నిర్ణయాల వల్ల జట్టులోని ఇతర బౌలర్లకు కూడా తమకు సరైన సపోర్టు లభిస్తుందో లేదో అన్న అభద్రతా భావం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Siraj is now India's 6th ranked fast bowler. I find it so unfair. Of the top 5 wicket takers in test cricket in this WTC cycle, India now have place only for Bumrah. You wish the bowlers selected well, they have great conditions to bowl in, but they will know they won't get a long rope when it is their turn.
— Harsha Bhogle (@bhogleharsha) November 26, 2026
సిరాజ్ ఏడుస్తున్నాడా? మురళీ కార్తీక్ ఎమోషనల్ కామెంట్స్
మ్యాచ్ టాస్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో కళ్లద్దాలు పెట్టుకుని నడుస్తున్న 32 ఏళ్ల సిరాజ్‌ను చూసి మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ భావోద్వేగానికి గురయ్యారు. సోనీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ.. "అతను ఏడుస్తున్నాడా? ఎందుకంటే సిరాజ్ చాలా ఎమోషనల్ పర్సన్" అని అన్నారు. కొంతమంది జట్టులో చోటు కోల్పోయినా మామూలుగా ఉంటారని, కానీ సిరాజ్ లాంటి వాళ్లు ఎప్పుడూ ఆడాలనే తపనతో ఉంటారని తెలిపారు. కాలు నొప్పి ఉన్నా, తలనొప్పి ఉన్నా లెక్కచేయకుండా ప్రాణం పెట్టి ఆడే రకం సిరాజ్ అని కొనియాడారు.
వన్డే సిరీస్‌లోనూ అతన్ని పక్కన పెట్టారని, వెస్టిండీస్‌పై కూడా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఆడించారని కార్తీక్ గుర్తు చేశారు. "అతని ఫామ్ బాగోలేదని లేదా నెట్స్‌లో సరిగ్గా బౌలింగ్ చేయడం లేదని మీకు అనిపిస్తే.. అసలు స్క్వాడ్‌లోకి ఎందుకు తీసుకున్నారు? న్యూజిలాండ్‌కు ఎందుకు తీసుకొచ్చారు?" అని మేనేజ్‌మెంట్‌ను సూటిగా ప్రశ్నించారు.
No Siraj in the XI again! 👀
Our #ExtraaaInnings panel isn't mincing words about his omission.
Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.
#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/MGpL4RReX6
— Sony Sports Network (@SonySportsNetwk) November 26, 2026
ఆరేళ్ల కెరీర్‌లో సిరాజ్‌కు ఇదే తొలిసారి
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్ అయినప్పటికీ, గత వారం వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ అతన్ని తీసుకోలేదు. ఆ మ్యాచ్‌లో బుమ్రా, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో బరిలోకి దిగిన భారత్ 20 వికెట్లు తీయలేక డ్రాతో సరిపెట్టుకుంది.
ఆరేళ్ల క్రితం టెస్టుల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి, సిరాజ్ ఒక సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు, తన ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో సిరాజ్ ఇప్పటివరకు న్యూజిలాండ్ గడ్డపై ఒక్క టెస్టు కూడా ఆడకపోవడం గమనార్హం.
గవాస్కర్, శాస్త్రి అసంతృప్తి.. మోర్కెల్ క్లారిటీ
బుమ్రా తర్వాత సేనా దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) భారత్‌కు అత్యంత కీలకమైన బౌలర్ సిరాజ్. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడంపై దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మ్యాచ్‌కు ముందు స్పందించారు.
"సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాస్త వెనక్కి తగ్గి ఎక్కడ మెరుగుపడాలో చూసుకుందామని నేను సిరాజ్‌తో చెప్పాను. సెలక్షన్ అనేది మా చేతుల్లో ఉండదు" అని మోర్కెల్ స్పష్టం చేశారు. మరోవైపు తొలి టెస్టులో పిచ్ నెమ్మదించడం వల్ల అన్షుల్ కాంబోజ్ వేగం తగ్గిందని, కానీ అతను క్రమశిక్షణతో బౌలింగ్ చేసి జట్టుకు కంట్రోల్ ఇచ్చాడని మోర్కెల్ అన్నారు.
సిరాజ్ రీసెంట్ ఫామ్ ఎలా ఉంది?
సిరాజ్ చివరిసారిగా ఆగస్టులో శ్రీలంక పర్యటనలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అక్కడ రెండు మ్యాచ్‌లలో 4 వికెట్లు మాత్రమే తీసి లయ కోల్పోయినట్లు కనిపించాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు రెండుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించి, న్యూజిలాండ్-A జట్టుపై 4 వికెట్లు పడగొట్టాడు. కివీస్‌తో జరిగిన 5 వన్డేల సిరీస్‌లోనూ ఒకే మ్యాచ్ ఆడి 2 వికెట్లు తీశాడు.
ఇక రెండో టెస్టు విషయానికొస్తే, టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు గంటలు వికెట్లు పడకపోయినా, లంచ్ సమయానికి అరంగేట్ర బౌలర్ గుర్నూర్ బ్రార్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత రెండో సెషన్‌లో ఆకాశ్ దీప్, కాంబోజ్ చెలరేగి కేవలం 15 బంతుల వ్యవధిలో 3 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి రోజు ఆటను న్యూజిలాండ్ 246/5 పరుగులతో ముగించింది.













