ఆర్సీబీతో పాటు అమ్మకానికి మరో టీమ్ ! ఐపీఎల్ లో ఏం జరుగుతోంది?
Rajasthan Royals : ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ రెండు ఫ్రాంచైజీలు అమ్మకానికి సిద్ధమవడంతో క్రికెట్ వరల్డ్ తో పాటు ఐపీఎల్ మార్కెట్‌లో కొత్త చర్చ మొదలైంది. కొత్త యజమానుల కోసం పోటీ తీవ్రంగా ఉందని సమాచారం. అయితే, ఎందుకు ఈ పరిస్థితి?

ఒకేసారి అమ్మకానికి రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అరుదైన పరిణామంగా, ఒకేసారి రెండు ప్రముఖ ఫ్రాంచైజీలు యాజమాన్యం మార్పు దిశగా సాగుతున్నాయి. గత సీజన్‌లో తొలిసారిగా టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే విక్రయ ప్రక్రియలోకి ప్రవేశించగా, దానికి మరో జట్టు తోడైంది. 2008 తొలి ఛాంపియన్ అయిన రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా అదే మార్గంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వ్యాపారవేత్త హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్ మరింత బలపరిచింది. ఆయన వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో, వ్యాపారవర్గాల్లో, క్రికెట్ సర్కిల్స్‌లో పెద్ద చర్చ మొదలైంది.
హర్ష్ గొయెంకా ట్వీట్‌తో రచ్చ: ఆ రెండు ఐపీఎల్ టీమ్స్ కు కొత్త యజమానులు ఎవరూ?
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా సోదరుడు హర్ష్ గొయెంకా నవంబర్ 27న చేసిన పోస్ట్ ఈ పరిస్థితులకు కేంద్ర బిందువుగా మారింది.
“రెండు ఐపీఎల్ జట్లు.. RCB, RR అమ్మకానికి ఉన్నాయి. ఐదు మంది వరకు కొనుగోలుదారులు రేసులో ఉన్నారు. కొత్త యజమానులు పూణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా యూఎస్ఏ నుంచే వస్తారా? ” అని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యి, రెండు జట్ల భవిష్యత్తుపై ఊహాగానాలు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ 65 శాతం వాటాను కలిగి ఉండగా, ముర్డాక్ కుటుంబం, రెడ్‌బర్డ్ క్యాపిటల్ వంటి సంస్థలు కూడా వాటాదారులుగా ఉన్నారు.
I hear, not one, but two IPL teams are now up for sale- RCB and RR. It seems clear that people want to cash in the rich valuations today. So two teams for sale and 4/5 possible buyers! Who will be the successful buyers- will it be from Pune, Ahmedabad, Mumbai, Bengaluru or USA?
— Harsh Goenka (@hvgoenka) November 27, 2025
ఆర్సీబీ విక్రయం పై డియాజియో అధికారిక ప్రకటన
ఆర్సీబీ యాజమాన్య సంస్థ డియాజియో నవంబర్ 5న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి అధికారిక సమాచారం సమర్పిస్తూ, ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియ ప్రారంభమైందని ధృవీకరించింది. ఆర్సీబీ అంచనా విలువ 2 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు ₹16,600 కోట్లు). ఈ టీమ్ కోసం ఆసక్తి చూపుతున్న వారిలో ఆదార్ పూనావాలా, మోహన్‌దాస్ పాయ్, వినోద్ ఖమత్ లు ఉన్నారని సమాచారం.
డియాజియో ప్రధాన వ్యాపారం అయిన మద్యం మార్కెట్ అమెరికాలో నష్టాలను ఎదుర్కొనడం, భారీ ట్యారిఫ్‌లు, వినియోగం పడిపోవడం వల్ల ఆర్థిక ఒత్తిడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఆర్సీబీ విక్రయాన్ని ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది.
అంతేకాక, 2026 మార్చి 31 నాటికి మొత్తం విక్రయ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. విక్రయం పూర్తయితే ఆర్సీబీ కొత్త పేరుతో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ ఎందుకు అమ్మకానికి వచ్చింది?
2008లో ట్రోఫీ గెలిచినప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన పెద్దగా లేదు. ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితి మరింత దిగజారింది. 2022లో ఫైనల్ చేరి ఓటమి పాలైంది. 2025 సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలోకి పడిపోయింది. మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆటగాళ్ల కొనుగోలు ఖర్చులు పెరగడం, ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం జట్టును ప్రభావితం చేస్తోందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ ప్రతికూలతల వల్ల ఫ్రాంచైజీకి కోట్ల రూపాయల నష్టాలు నమోదైనట్లు వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్‌లో ఫ్రాంచైజీ విలువలు గరిష్టస్థాయిలో ఉండగా, యాజమాన్యం ఈ సమయంలో విక్రయంతో భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2026 ముందు భారీ మార్పులతో అభిమానుల్లో ఉత్కంఠ
రిటెన్షన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. డిసెంబర్ 16న అబుధాబిలో మిని వేలం జరగనుంది. ఇలాంటి కీలక దశలో రెండు ఫ్రాంచైజీలు యాజమాన్యం మార్పు దిశగా సాగడం ఐపీఎల్ మార్కెట్‌ను పూర్తిగా కదిలించింది.
భారత వ్యాపారవేత్తలు, అమెరికన్ ఇన్వెస్టర్లు, స్పోర్ట్స్ కంపెనీలు.. అన్ని వర్గాలు ఆసక్తి చూపుతున్న పరిస్థితి క్రికెట్ ఫ్రాంచైజీల విలువ ఎంత పెరిగిందో మరోసారి రుజువు చేస్తోంది.
వచ్చే కొన్ని వారాల్లో ఆర్సీబీ, ఆర్ఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం ముందున్న ప్రధాన ప్రశ్న. యాజమాన్యం మారితే జట్ల పేర్లు, మార్గదర్శకత్వం, వ్యూహాల్లో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

