డేంజరస్ ప్లేయర్స్‌తో కావ్యపాప దమ్కీ.. ఈసారి 300 పరుగులు పక్కా అంటున్న ఆరెంజ్ ఆర్మీ
ఐపీఎల్ 2026 కోసం SRH తమ కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. డేంజర్ ప్లేయర్‌గా హెన్రిచ్ క్లాసెన్‌ను భారీ ధరకు రిటైన్ చేసుకోగా, కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగనున్నాడు.

SRH కీలక నిర్ణయం..
ఐపీఎల్ 2026 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. సన్‌రైజర్స్ యాజమాన్యం కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా డేంజర్ ప్లేయర్‌గా పేరుగాంచిన హెన్రిచ్ క్లాసెన్‌ను భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో రూ. 5.25 కోట్లకే తీసుకున్న క్లాసెన్‌ను, ఆపై ఏకంగా రూ. 23 కోట్లు వెచ్చించి అట్టిపెట్టుకుంది. క్లాసెన్‌ను వదులుకుని వేలంలో తక్కువ ధరకే మళ్లీ తీసుకోవాలనే ఆలోచన SRHకి ఉందని గతంలో ప్రచారం జరిగినా, యాజమాన్యం మాత్రం ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్‌ను వదులుకోవడానికి ఇష్టపడలేదు.
పాట్ కమిన్స్ కెప్టెన్..
కెప్టెన్సీ విషయంలోనూ సన్‌రైజర్స్ స్థిరమైన నిర్ణయం తీసుకుంది. పాట్ కమిన్స్ కెప్టెన్‌గా కొనసాగడం ఖాయమైంది. గత రెండు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కమిన్స్ సమర్థవంతంగా నడిపించాడు. 2024లో జట్టును అద్భుతంగా ఫైనల్ వరకు తీసుకెళ్లి, కెప్టెన్‌గా మంచి మార్కులను సంపాదించుకున్నాడు. గత సీజన్లో జట్టు విఫలమైనా, కమిన్స్‌ను వదులుకోవడానికి సన్‌రైజర్స్ యాజమాన్యం ఆసక్తి చూపించలేదు.
అవన్నీ వట్టి రూమర్స్..?
ట్రావిస్ హెడ్ కూడా జట్టును వీడి వెళ్తాడన్న వార్తలు నిజం కాలేదు. అలాగే, ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ హైదరాబాద్‌కు వస్తాడని వచ్చిన కథనాలు కేవలం ప్రచారం మాత్రమేనని తేలిపోయింది. స్టార్ ప్లేయర్‌లను వేలంలోకి వదిలేస్తే, తిరిగి వారిని దక్కించుకోవడం కష్టం కాబట్టి, క్లాసెన్, ట్రావిస్ హెడ్ విషయంలో SRH ఎలాంటి రిస్క్ తీసుకోలేదని చర్చ నడుస్తోంది.
వారిని రిటైన్..
యువ ఆటగాళ్లైన ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మలను కూడా SRH రిటైన్ చేసుకుంది. కొంతకాలంగా హర్షల్ పటేల్‌ను వదిలేస్తారని ప్రచారం జరిగినా, అతనిని కూడా జట్టులో కొనసాగించింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టులోనే ఉన్నాడు. అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, హర్ష్ దుబే, కమిండు మెండిస్, బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ, జీషాన్ అన్సారీ వంటి ఆటగాళ్లను కూడా SRH అట్టిపెట్టుకుంది.
ఎనిమిది మంది ఆటగాళ్లు రిలీజ్
మరోవైపు, ఎనిమిది మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ వదిలేసింది. వారిలో అభినవ్ మనోహర్, అథర్వ తైద్, వనిందు హసరంగ, సచిన్ బేబీ, మహమ్మద్ షమీ, సిమర్జీత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా ఉన్నారు. ఇతర ఫ్రాంచైజీల నుంచి ఏ ఆటగాడినీ ట్రేడ్ చేసుకోలేదు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 25.50 కోట్ల పర్స్ మిగిలి ఉంది. బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.