ఐపీఎల్ 2026 మినీ వేలానికి డేట్ ఫిక్స్.. క్రికెట్ హంగామా షురూ !
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరుగుతుంది. రిటెన్షన్ గడువు నవంబర్ 15 కాగా, జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వరుసగా మూడోసారి విదేశాల్లోనే ఐపీఎల్ వేలం జరగనుంది.

డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 మినీ వేలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ వేలం తేదీ ఖరారైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ వేలం డిసెంబర్ 16న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో జరగనుంది. బీసీసీఐ ఈ వివరాలను నవంబర్ 15న అధికారికంగా ప్రకటించనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
గత కొన్ని రోజులుగా ముంబై వేదికగా వేలం జరుగుతుందని చర్చలు వచ్చినప్పటికీ, చివరకు యూఏఈలోనే దీన్ని నిర్వహించే దిశగా ఐపీఎల్ నిర్వాహకులు ముందుకు వెళ్లారు. ఒక్కరోజు వ్యవధిలో ముగిసే ఈ మినీ వేలం 2026 సీజన్ జట్ల కూర్పులో కీలక భూమిక పోషించనుంది.
వరుసగా మూడో సంవత్సరం విదేశాల్లోనే ఐపీఎల్ వేలం
ఐపీఎల్ వేలాన్ని భారత్ వెలుపల నిర్వహించడం కొత్త పరిణామం కాదు. 2024లో వేలం దుబాయ్‌లో, 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఇపుడు 2026 మినీ వేలం అబుదాబిలో జరగనుండడంతో వరుసగా మూడోసారి విదేశాల్లోనే ఆక్షన్ జరుగుతుంది.
అంతర్జాతీయ వేదికల్లో మెరుగైన సౌకర్యాలు, విదేశీ స్టాఫ్‌కు అనుకూల పరిస్థితులు, సులభ లాజిస్టిక్స్ వంటి అంశాలను బీసీసీఐ ప్రాముఖ్యతనిచ్చినట్లు తెలుస్తోంది.
రిటెన్షన్ గడువు, రిజిస్టర్డ్ ప్లేయర్ల లిస్ట్
మినీ వేలా ప్రక్రియలో రిటెన్షన్ దశ అత్యంత కీలకం. ఫ్రాంచైజీలు తమ జట్టులో ఉంచుకోవాలనుకున్న, విడుదల చేయాలనుకున్న ఆటగాళ్ల తుది జాబితాను నవంబర్ 15 మధ్యాహ్నం 3 గంటలలోపు బీసీసీఐకు అందించాల్సి ఉంటుంది.
రిటెన్షన్ జాబితాలు పొందిన తర్వాత, బీసీసీఐ రిజిస్టర్డ్ ప్లేయర్ల పూర్తి జాబితాను జట్లకు పంపిస్తుంది. తర్వాత ఫ్రాంచైజీలు తమ అంతర్గత ప్రణాళికల ఆధారంగా షార్ట్‌లిస్ట్ రూపొందిస్తాయి. చివరగా, బోర్డు ఈ జాబితా నుండి వేలం పూల్‌ను ఫైనల్ చేస్తుంది.
ట్రేడింగ్ విండో కూడా అదే తరహాలో కీలకం. 2025 సీజన్ ముగిసిన వెంటనే ప్రారంభమైన ఈ విండో వేలానికి వారం ముందువరకు యాక్టివ్‌గా ఉంటుంది. వేలం అనంతరం మళ్లీ తెరుచుకుని, 2026 సీజన్ ప్రారంభానికి ఒక నెల ముందు వరకు కొనసాగుతుంది.
ఐపీఎల్ 2026 కు ముందు భారీ ట్రేడింగ్ మూవ్స్
వేలానికి ముందు జట్ల మధ్య ఇప్పటికే పలు కీలక ట్రేడ్లు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా, ముంబై ఇండియన్స్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పూర్తి నగదు ఒప్పందంతో సంతకం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండర్ షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్‌ను ముంబై తీసుకుంది. లక్నో, తమ బోర్డును బలపర్చడానికి అర్జున్ టెండుల్కర్‌ను అతడి బేస్ ప్రైస్ 30 లక్షలకు కొనుగోలు చేసింది.
అదే సమయంలో, సంజూ శాంసన్ చెన్నైకి, జడేజా రాజస్థాన్‌కు వెళ్తారనే ఊహాగానాలు కూడా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కొంతమంది జట్లు స్టార్ ప్లేయర్లను వేలంలో వదిలే ప్రయత్నం చేస్తుండడంతో, ఈసారి వేలం మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం అభిమానుల్లో ఉత్సాహం
బీసీసీఐ 2026 సీజన్ కోసం మార్చి 15 నుంచి మే 31 మధ్య తాత్కాలిక విండోను నిర్ణయించింది. అప్పటి నుండి దాదాపు రెండున్నర నెలల పాటు అభిమానులు నాన్-స్టాప్ క్రికెట్ ఫెస్టివల్‌ను ఆస్వాదించనున్నారు.
మినీ వేలం పూర్తైన తర్వాత జట్లు తమ తుది కూర్పులను సిద్ధం చేసుకుంటూ సీజన్‌కు ముందుగానే వ్యూహాత్మక ప్రణాళికలు ప్రారంభించనున్నాయి. ప్రతి సంవత్సరం వేలంలో రికార్డు ధరలు పలికే స్టార్ ప్లేయర్లపై ఈసారీ ఏ జట్లు కోట్ల వర్షం కురిపిస్తాయన్నది క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.