కుల్దీప్ యాదవ్: పెళ్లి చేసుకుంటాను.. సెలవు ఇవ్వండి సామీ !
Kuldeep Yadav Wedding : కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. నవంబర్ చివరలో పెళ్లి చేసుకోనున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. వారం రోజుల సెలవు ఇవ్వాలని బీసీసీఐని కోరాడు.

కుల్దీప్ యాదవ్ పెళ్లి సందడి
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జీవితంలోని ప్రత్యేక ఘట్టం వైపు అడుగులు వేస్తున్నాడు. నవంబర్ చివరి వారంలో అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో కీలక మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివాహ ఏర్పాట్ల కోసం ఒక వారం రోజుల సెలవు కావాలని కుల్దీప్ బీసీసీఐకి అధికారికంగా అభ్యర్థించినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి.
బీసీసీఐ స్పందన కోసం వేచి చూస్తున్న కుల్దీప్ యాదవ్
ప్రస్తుతం టీమిండియా సౌతఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో, కుల్దీప్ అభ్యర్థనపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. జట్టుకు అతని సేవలు అత్యవసరం అయ్యే సందర్భాలు, మ్యాచ్‌లకు అనుగుణంగా అతడికి సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సెలవుల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
సఫారీ సిరీస్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. నవంబర్ 22 నుంచి గౌహతిలో రెండో టెస్ట్, నవంబర్ 30 నుంచి రాంచీలో తొలి వన్డే జరగనున్నాయి. ఈ రెండు కీలక పోరులకు కుల్దీప్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటీవలే కుల్దీప్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను లేకపోవడం టీమ్ కాంబినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయాన్ని జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను ప్రత్యామ్నాయంగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
బౌలింగ్ లో సత్తా చాటుతున్న కుల్దీప్ యాదవ్
కుల్దీప్ యాదవ్ ఇండియా ఏ, సౌతాఫ్రికా ఏ మ్యాచ్‌లో బాగా రాణించాడు. అలాగే నవంబర్ 14న ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో రెండు కీలక వికెట్లు తీసి తన మ్యాచ్ రిథమ్‌ను చూపించాడు.
అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్, ప్రస్తుతం భారత స్పిన్ విభాగంలో అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసకుంటున్న కుల్దీప్ యాదవ్
కుల్దీప్ యాదవ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు వంశిక. వారిది లక్నో. ప్రస్తుతం ఆమె ఎల్‌ఐసీలో పనిచేస్తోంది. ఇద్దరూ స్కూల్ డేస్ నుంచే స్నేహితులు, తరువాత ఆ బంధం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంలోకి చేరుతోంది. ఈ ఏడాది జూన్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది.
ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఐపీఎల్ షెడ్యూల్ కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. నవంబర్ చివరి వారంలో పెళ్లి షెడ్యూల్ నేపథ్యంలో కుల్దీప్ కీలక మ్యాచ్ లకు దూరం కానున్నాడు.