బుమ్రా మిరాకిల్ ! కోల్‌కతాలో కుప్పకూలిన సౌతాఫ్రికా
India vs South Africa : కోల్ కతా టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో అదరగొట్టాడు. భారత బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
తొలి టెస్టులో బుమ్రా అద్భుత స్పెల్
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఉత్కంఠను రేపింది. టాస్ గెలిచిన సఫారీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ ముందు సఫారీ జట్టు బ్యాటర్లు నిలబడలేకపోయారు.
సౌతాఫ్రికాకు మంచి ఆరంభం లభించినా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కుప్పకూలిపోయింది. మొత్తం 55 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
మొదటి సెషన్‌లో చక్కగా మొదలుపెట్టిన సఫారీలు
ఆరంభంలో ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ జోడీ 57 పరుగుల భాగస్వామ్యంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ కు మంచి పునాది వేసింది. మార్క్రమ్ 31 పరుగులు, రికెల్టన్ 23 పరుగులు చేస్తూ భారత బౌలర్లకు కాస్త ఇబ్బంది కలిగించారు. అయితే, బుమ్రా రికెల్టన్ వికెట్ తీయడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత భారత బౌలర్లు వేగం పెంచడంతో సౌతాఫ్రికా రన్‌ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. ఒక దశలో 105/3గా ఉన్న జట్టు, కేవలం 54 పరుగులు జోడించేలోపే మిగతా 7 వికెట్లు కోల్పోయింది.
బుమ్రా ఐదు వికెట్లతో దుమ్మురేపాడు
ఈ మ్యాచ్‌లో బుమ్రా పూర్తి స్థాయి పేస్, లైన్, లెంగ్త్ బౌలింగ్ తో దక్షిణాఫ్రికా బ్యాటర్లను చిత్తు చేశాడు. మొత్తం 27 పరుగులు ఇచ్చి ఐదు కీలక వికెట్లు తీసి భారత పేసింగ్ దళానికి ట్రెండ్ సెట్ చేశాడు. టోనీ డి జార్జి, మార్క్రమ్, రికెల్టన్, మహరాజ్, హార్మర్ వంటి బ్యాటర్లను తన ఊహించని బంతులతో పెవిలియన్‌కు పంపాడు.
ఇది బుమ్రా టెస్ట్ కెరీర్‌లో స్వదేశంలో వచ్చిన అరుదైన ఫైవ్-వికెట్ హాల్ కావడం విశేషం.
సిరాజ్, కుల్దీప్, అక్షర్ మెరుపులు
బుమ్రాకు తోడునిలిచిన సిరాజ్ రెండువికెట్లు తీసి మధ్య ఓవర్లలో సౌతాఫ్రికా పై ఒత్తిడి పెంచాడు. వికెట్ కీపర్ కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్ కీలకంగా భావించినప్పటికీ సిరాజ్ స్వింగ్ ముందు నిలువలేకపోయారు.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తన మాయజాలం చూపించాడు. ముల్డర్, కెప్టెన్ బవుమా వంటి కీలక వికెట్లను సాధించాడు. అక్షర్ పటేల్ కూడా కార్బిన్ బాస్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు.
ఓపెనర్ల పోరాటం
దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ 31, ముల్డర్ 24, టోనీ డి జోర్జి 24, రికెల్టన్ 23 పరుగులు చేశారు. కానీ మిగతావారంతా డబుల్ డిజిట్‌లోకి కూడా రాలేదు.
కెప్టెన్ టెంబా బవుమా 3 పరుగులు మాత్రమే చేయడం వారి జట్టుకు పెద్ద దెబ్బ. స్టబ్స్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇన్నింగ్స్ మొత్తాన్ని పరిశీలిస్తే, పరుగుల కోసం ప్రయత్నించినా భారత బౌలర్ల వ్యూహాల ముందు ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. భారత్ బౌలర్లు తొలి రోజునే మ్యాచ్ ను భారత్ వైపు తీసుకొచ్చారు.