ఏమిటీ.. ఈ భారత సంతతి బౌలర్ 50,000 ఓవర్లు వేశారా..! ఇంతకూ అతడెవరో తెలుసా?
Muttiah Muralitharan : శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ భారత సంతతికి చెందినవాడని మీకు తెలుసా? అతడు ఇప్పటివరకు ఎన్ని ఓవర్లు వేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

ముత్తయ్య మురళీధరన్ కే సాధ్యం...
Muttaiah Muralidharan : క్రికెటర్లు చాలామంది వస్తుంటారు, పోతుంటారు... కానీ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రతో తమ పేరును లింఖించుకునేది కొందరు మాత్రమే. ఇలా డాన్ బ్రాడ్ మాన్, బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్ వంటి బ్యాటర్లు చరిత్రలో నిలిచిపోయే క్రికెట్ ఆడారు. కానీ బౌలర్లు ఈ స్థాయికి చేరుకోవడం కష్టం... కానీ అసాధ్యంమాత్రం కాదు. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే భారత సంతతి శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. క్రికెట్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు, గుర్తుండిపోయే వ్యక్తి మురళీధరన్.
అంతర్జాతీయ క్రికెట్లో స్పిన్ బౌలర్లకు గౌరవాన్ని తీసుకువచ్చిన వ్యక్తి మురళీధరన్. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్లో తీయని వికెట్ లేదు... సాధించని రికార్డు లేదు. సుదీర్ఘకాలం క్రికెటర్ గా కొనసాగిన మురళీధరన్ ఇప్పటివరకు ఎన్ని ఓవర్లు వేసివుంటారో ఆలోచించారా..? ఈ ఆసక్తికర విషయాన్ని ఓ కార్యక్రమంలో స్వయంగా ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. ఇది వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం.
ఇప్పటివరకు మురళీధరన్ వేసిన ఓవర్లు ఎన్ని..?
ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక క్రికెటర్ గా 1992 నుండి 2011 వరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. అంటే దాదాపు 20 ఏళ్ళపాటు ఆయన క్రీడాప్రస్థానం సాగింది... ఈ క్రమంలో వేయికి పైగా వికెట్లు తీయడానికి అతడు లక్షల బంతులు వేశాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్స్ లో కలిపి మురళీధరన్ 15 వేల ఓవర్లు వేశారట... ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ బైటపెట్టారు.
ఓ కార్యక్రమంలో మురళీధరన్ తో కలిసి పాల్గొన్న సచిన్ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. ''ముత్తయ్య మురళీధరన్ ఇప్పటివరకు కేవలం ఇంటర్నేషనల్ క్రికెట్ లో 15 వేల ఓవర్లు వేశారు. అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మరో 10 వేల ఓవర్లు వేసుంటారు. అంతకుముందు ఇంకో 15 నుండి 20 వేల ఓవర్లు వేసివుంటారు'' అని సచిన్ అన్నారు. ఈ మాటలను బట్టి చూసుకుంటే మురళీధరన్ ఇప్పటివరకు మొత్తంగా 50 వేల ఓవర్లు వేసివుంటారన్నమాట.
మురళీధరన్ గణాంకాలివే...
ముత్తయ్య మురళీధరన్ కు టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ రికార్డులు ఉన్నాయి. అతడు మొత్తం 133 టెస్టులు అంటే 230 ఇన్నింగ్సులు ఆడారు... ఇందులో అతడువేసిన బంతులు 44,039... తీసిన వికెట్లు 800. ఆసక్తికర విషయం ఏమిటంటే అతడు ఏకంగా 22 మ్యాచుల్లో 10 వికెట్లు, 67 మ్యాచుల్లో 5 వికెట్లు పడగొట్టారు. ఒకే మ్యాచులో 16 వికెట్లు, ఒకే ఇన్నింగ్స్ లో 9 వికెట్లు తీసిన రికార్డు మురళీధరన్ ది.
ఇక వన్డే క్రికెట్లో మొత్తం 350 మ్యాచుల్లో 18811 బంతులు వేసిన మురళీధరన్ 534 వికెట్లు తీశారు. ఇందులో 15 మ్యాచుల్లో 4 వికెట్లు, 10 మ్యాచుల్లో 5 వికెట్ల రికార్డు సాధించారు. ఇక టీ20 లో కేవలం 12 మ్యాచులే ఆడిన ఇతడు 282 బంతులు వేసి 13 వికెట్లు పడగొట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో హైదరాబాద్ టీం సన్ రైజర్స్ తో పాటు మరికొన్ని జట్లలో ఆడారు ముత్తయ్య మురళీధరన్. ఈ క్రమంలోనే 66 మ్యాచులాడిన ఆయన 1524 బంతులేసి 63 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్ లో అతడి అత్యుత్తమ గణాంకాలు 3/11.
మురళీధరన్ కు ఇండియాతో సంబంధం..
ముత్తయ్య మురళీధరన్ భారత సంతతికి చెందినవాడు.. అంటే అతడి పూర్వీకులు భారత్ నుండి శ్రీలంకకు వలస వెళ్లారు. 1972 ఏప్రిల్ 17న శ్రీలంకలోని ఓ తమిళ కుటుంబంలో మురళీధరన్ జన్మించారు. చిన్నప్పటినుండి క్రికెట్ పై మక్కువ పెంచుకుని చివరకు అనుకున్నది సాధించారు... అనేక అవాంతరాలను అధిగమించి శ్రీలంక క్రికెట్ జట్టులో చోటు సాధించారు. ప్రపంచస్థాయి క్రికెటర్ గా ఎదిగారు.
మురళీధరన్ తమిళనాడుకు చెందిన మదిమలార్ ను పెళ్లాడారు. 2005 లో వీరి వివాహం జరిగింది. అసలు క్రికెట్ గురించి ఏమాత్రం అవగాహనలేని మదుమలార్ లెజెండరీ క్రికెటర్ కి భార్యగా మారింది.
మురళీధరన్ కెరీర్ కు ఇండియాతో సంబంధం
మురళీధరన్ క్రికెటర్ గా కూడా భారత్ తో అనేక మరుపురాని అనుభవాలున్నాయి. అతడు మొదటి వన్డే 1993 లో భారత్ తోనే ఆడాడు... చివరి వన్డే 2011 లో భారత్ తోనే. ఇక టెస్ట్ క్రికెట్ 1992 లో ఆస్ట్రేలియాతో ప్రారంభించినా ఎండింగ్ మాత్రం 2010 లో భారత్ తోనే. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్నారు ముత్తయ్య.

