ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది
Abhishek Sharma: 2025లో పాకిస్తాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాడిగా భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ నిలిచాడు. బాబర్ ఆజామ్ లేదా షాహీన్ షా అఫ్రిదీలను సైతం అధిగమించి, అభిషేక్ అగ్రస్థానం దక్కించుకున్నాడు.

పాకిస్తాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాడిగా..
2025లో పాకిస్తాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాడిగా భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ నిలిచాడు. బాబర్ ఆజామ్ లేదా షాహీన్ షా అఫ్రిదీలకు పక్కకు తోసి.. ఆ స్థానాన్ని భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ దక్కించుకున్నాడు. ఆశ్చర్యకరంగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, నీరజ్ చోప్రాలను కూడా అభిషేక్ ఈ విషయంలో అధిగమించాడు.
ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్
ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్ అయిన అభిషేక్ శర్మ 2025లో పొట్టి ఫార్మాట్‌లో నిలకడైన ప్రదర్శన కనబరిచి అంతర్జాతీయంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 2025 ఆసియా కప్‌లో అతని ఆటతీరు అద్భుతం. ఈ టోర్నమెంట్‌లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
దూకుడైన బ్యాటింగ్ అతడి సొంతం..
ఆసియా కప్ సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్‌పై కేవలం 39 బంతుల్లో 74 పరుగులు చేసి, పాకిస్తాన్ బౌలర్లను ఆట ఆదుకున్నాడు. 2025లో అభిషేక్ శర్మ మొత్తం 17 టీ20ఐ మ్యాచ్‌లలో 47.25 సగటుతో 756 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు, ఇది అతడి దూకుడైన బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు.
అభిషేక్ శర్మపై ప్రశంసలు
అతని అద్భుతమైన ఫామ్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్ ఐడిన్ మార్క్రమ్ కూడా అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. "నేను సన్‌రైజర్స్‌లో అభిషేక్‌తో కలిసి గతంలో ఆడాను. అతను గొప్ప ఆటగాడు. బాగా బ్యాటింగ్ చేస్తాడు. అతడే మాకు కీలక వికెట్ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు" అని పేర్కొన్నాడు.
అతను మ్యాచ్ విన్నర్
కొత్త బంతిని ఎవరు వేసినా అభిషేక్ శర్మను ముందుగానే అవుట్ చేయడం ఒక సవాలుగా ఉంటుందని మార్క్రమ్ అభిప్రాయపడ్డాడు. "అతను మ్యాచ్ విన్నర్. ఇది మాకు ముఖ్యమైన వికెట్. నిర్భయంగా బ్యాటింగ్ చేస్తాడు. మొదటి బంతి నుంచే ఆటను తన ఆధీనంలోకి తీసుకుంటాడు" అని ప్రొటీస్ కెప్టెన్ అభిషేక్ శర్మను కొనియాడారు. పాకిస్తాన్‌లో అతని పట్ల ఈ క్రేజ్, అతని అసాధారణ ప్రతిభకు, 2025లో అతని అద్భుతమైన క్రికెట్ ప్రదర్శనలకు నిదర్శనం.

