- Home
- Sports
- Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లే కాదు.. యువరాజ్ సింగ్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Yuvraj Singh : సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ 44వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని 5 అద్భుతమైన రికార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఒకే ఓవర్‌లో 6 సిక్సర్ల నుంచి ఒకే ఐపీఎల్ సీజన్‌లో రెండు హ్యాట్రిక్‌ల వరకు యువరాజ్ అద్భుతమైన రికార్డులు సాధించాడు.

యువరాజ్ సింగ్ ఈ 5 రికార్డుల గురించి తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ !
Yuvraj Singh: భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక మతం, ఒక ఎమోషన్.. మొత్తంగా అయితే, కొన్ని మాటలతో చెప్పలేనిది. మన దేశంలో క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మరే ఇతర క్రీడకు లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రీడా ప్రపంచంలో భారత గడ్డపై ఎందరో గొప్ప క్రికెటర్లు జన్మించారు. తమ అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతేకాకుండా, మైదానంలో ఎన్నో కొత్త, అరుదైన రికార్డులను నెలకొల్పారు.
ఇలాంటి దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ప్రముఖంగా వినిపించే పేరు యువరాజ్ సింగ్. కేవలం రికార్డులు సృష్టించడమే కాకుండా, తన ఆటతో 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు యువీ. క్రికెట్ అభిమానులు ప్రేమగా సిక్సర్ల కింగ్ అని పిలుచుకునే యువరాజ్ సింగ్, డిసెంబర్ 12న తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ప్రతి భారతీయ క్రికెటర్‌కు కలగా మిగిలిపోయే యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 5 అద్భుతమైన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒకే ఓవర్‌లో 6 సిక్సర్ల విధ్వంసం రేపిన యువరాజ్ సింగ్
క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టిన సంఘటన గుర్తుకు రాగానే, మన మనసులో మెదిలే మొదటి పేరు యువరాజ్ సింగ్. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై ఆడిన ఆ ఇన్నింగ్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు.
ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో 6 బంతులను వరుసగా 6 సిక్సర్లుగా మలిచి యువరాజ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను సాధించలేకపోయారు. ఆ రోజు యువరాజ్ చూపించిన తెగువ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది.
2. అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కొట్టిన యూవరాజ్ సింగ్
2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై 6 సిక్సర్లు బాదిన అదే మ్యాచ్‌లో, యువరాజ్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశారు. కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి చారిత్రక రికార్డు నెలకొల్పారు.
ఈ అద్భుత ఘట్టం జరిగి 15 ఏళ్లకు పైగా గడిచినా, యువరాజ్ నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఈ ఇన్నింగ్స్, యువరాజ్ సింగ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
3. 5వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ రికార్డుల మోత మోగించిన యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ ప్రధానంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఆయన ఎక్కువగా 4, 5 లేదా 6వ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవారు. సాధారణంగా ఈ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం, భారీ స్కోర్లు సాధించడం కష్టంతో కూడుకున్న పని. కానీ, మైదానంలో నలువైపులా భారీ సిక్సర్లు కొట్టగల సత్తా ఉన్న యువరాజ్, 5వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తూ ఒక గొప్ప రికార్డును సృష్టించారు.
వన్డే క్రికెట్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఏకంగా 7 సెంచరీలు బాదిన ఘనత యువరాజ్ సింగ్ సొంతం. అంతేకాకుండా, ఆయన వన్డే కెరీర్ అత్యుత్తమ స్కోరు 150 పరుగులు కూడా ఈ స్థానంలోనే రావడం విశేషం.
4. ఒకే ఐపీఎల్ సీజన్‌లో రెండు హ్యాట్రిక్‌లు నమోదుచేసిన యువరాజ్ సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో యువరాజ్ సింగ్ అనేక జట్ల తరఫున ఆడారు. అయితే ఆయన తన ఐపీఎల్ ప్రయాణాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుతో ప్రారంభించారు. యువరాజ్ కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఆల్ రౌండర్ కూడా.
పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు, బౌలింగ్‌లో తన మ్యాజిక్ చూపించి ఒకే సీజన్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన రికార్డు ఇప్పటికీ యువరాజ్ పేరు మీదే ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ రికార్డు చెక్కు చెదరలేదు.
5. నాకౌట్ మ్యాచ్‌లలో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా యూవరాజ్ సింగ్ రికార్డులు
యువరాజ్ సింగ్ అంటేనే పెద్ద మ్యాచ్‌లకు పెట్టింది పేరు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా టోర్నమెంట్ కీలక దశలో ఉన్నప్పుడు ఆయన బ్యాట్ ఝుళిపిస్తారు. దీనికి నిదర్శనమే నాకౌట్ మ్యాచ్‌లలో ఆయన సాధించిన రికార్డులు. ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ దశలో అత్యధిక సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్న మొదటి ఆటగాడిగా యువరాజ్ రికార్డు సృష్టించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో, 2011 వన్డే ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఆయన ఈ అవార్డులను గెలుచుకున్నారు. అలాగే, 2007 టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లను ఎవరూ మరిచిపోలేరు. ఆ మ్యాచ్‌లలో కూడా ఆయనకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' పురస్కారం లభించింది.
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన నెలకొల్పిన ఈ రికార్డులు భవిష్యత్ తరాలకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

