ప్రధాని మోదీతో భారత ఛాంపియన్ ప్లేయర్లు.. స్పెషల్ గిఫ్ట్ !
India Women Team Meets PM Modi : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2025 విజేత భారత మహిళా జట్టు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. టీమిండియా ప్లేయర్లు సంతకాలు చేసిన ప్రత్యేకమైన 'నమో 1' జెర్సీని ప్రధానికి అందజేసింది.

ఢిల్లీలో ప్రధాని మోడీతో భారత మహిళా జట్టు
ప్రపంచ కప్ గెలుపు తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు ఢిల్లీకి చేరుకుంది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ తన తొలి మహిళా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయానంతరం బుధవారం (నవంబర్ 5) సాయంత్రం జట్టు ప్రధాని నివాసమైన 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది.
ప్రధాని మోదీ జట్టుకు స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. మహిళా క్రీడాకారిణుల పోరాటస్ఫూర్తి, కృషి, దేశానికి గౌరవం తీసుకువచ్చిన అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు.
2017 జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “2017లో మేము ట్రోఫీ లేకుండా ప్రధాని గారిని కలిశాం. ఈసారి ట్రోఫీతో వచ్చాం, ఇది మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఎంతో గౌరవం కూడా.. ఇలాంటి విజయ క్షణాలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాం” అన్నారు.
వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా ప్రధానమంత్రిని ప్రేరణాత్మక నాయకుడిగా వర్ణించారు. “ప్రధాని మాటలు ఎప్పుడూ మాకు ఉత్తేజాన్నిస్తాయి. ఆయన ప్రోత్సాహం ప్రతి క్రీడాకారిణికి స్ఫూర్తి” అని అన్నారు.
దీప్తి శర్మ పై ప్రధాని ప్రశంసలు
టోర్నమెంట్‌లో టాప్ ప్లేయర్ గా నిలిచిన దీప్తి శర్మ పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. దీప్తీ మాట్లాడుతూ.. “2017లో ప్రధాని నాకు కష్టపడి పనిచేయి, కల నెరవేరుతుందని చెప్పారు. నిజంగానే ఈరోజు కల నెరవేరింది” అని చెప్పారు.
ప్రధాని మోదీ దీప్తి శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఉన్న “జయ శ్రీరామ్” వ్యాఖ్యానాన్ని, అలాగే ఆమె చేయి మీద ఉన్న హనుమాన్ టాటూను ప్రస్తావించారు. దీప్తి నవ్వుతూ, “నా భక్తి నాకెప్పుడూ బలం ఇస్తుంది” అని అన్నారు.
ప్రధానికి ప్రత్యేక కానుక: నమో 1 జెర్సీ
ఈ సమావేశంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు ప్రధానమంత్రికి ప్రత్యేక బహుమతి అందజేసింది. అదే ‘నమో 1’ జెర్సీ. అందరూ ప్లేయర్లు సంతకం చేసిన భారత జెర్సీ ఇది. ఇది జట్టు తరఫున ప్రధానికి గౌరవం, కృతజ్ఞతల సూచికగా దీనిని అందించారు.
ప్రధాని మోదీ ఈ జెర్సీని స్వీకరిస్తూ, “మీ అందరి కృషి దేశాన్ని గర్వపడేలా చేసింది. భారత మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతున్నారనే దానికి మీ విజయమే ఉదాహరణ” అని అన్నారు. జట్టు సభ్యులు ప్రధానమంత్రితో ఆత్మీయంగా మాట్లాడారు, ఫోటోలు దిగారు.
భారత మహిళా జట్టుకు ఘన స్వాగతం
ఢిల్లీకి చేరుకున్న భారత జట్టుకు తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఘన స్వాగతం లభించింది. పూలమాలలు, డోలు వాయిద్యాలతో జట్టుకు స్వాగతం పలికారు. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, స్నేహ రాణా డోలు సౌండ్ కు డాన్స్ చేశారు. కోచ్ అమోల్ మజుమ్దార్‌తో సహా అందరూ సభ్యులు విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.
ప్రధాని మోదీ ఈ విజయాన్ని దేశ కుమార్తెల శక్తిగా అభివర్ణించారు. మహిళా క్రీడాకారిణుల కృషి భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించిందని ప్రధాని అన్నారు.
భారత జట్టు 2005, 2017 ఫైనల్స్‌లో టైటిల్ దక్కించుకోలేకపోయినా, 2025లో విజయం సాధించడం చారిత్రాత్మకం. త్వరలోనే ఢిల్లీలో ‘విజయ్ పరేడ్’ నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

