- Home
- Sports
- స్టార్ ప్లేయర్ కు షాక్.. మళ్లీ తిరిగొస్తున్న బిగ్ హిట్టర్.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు ఇదే
స్టార్ ప్లేయర్ కు షాక్.. మళ్లీ తిరిగొస్తున్న బిగ్ హిట్టర్.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు ఇదే
Team India Squad South Africa Test Series: నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశే మిగిలింది.

దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 14 నవంబర్ నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్ మ్యాచ్‌ల దక్షిణాఫ్రికా సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. ఈ సారి 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు ఎంపిక చేసింది. స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడ్డ పంత్, తన పునరాగమనం ద్వారా మళ్లీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇదే సిరీస్‌లో భారత జట్టు సీనియర్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి మరోసారి అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణాను ఎంపిక చేశారు.
మహమ్మద్ షమీకి షాక్
వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ నుంచి, ఆపై ఆస్ట్రేలియా పర్యటన నుంచి మహమ్మద్ షమీని తప్పించడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రంజీ ట్రోఫీలో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచి 2 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టినా, ఆయనను మరోసారి పక్కన పెట్టడం అభిమానుల్లో నిరాశను నింపడంతో పాటు క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. సెలెక్టర్లు ఈసారి కూడా ఆయనపై దృష్టి సారించలేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఆయన బదులు ప్రసిద్ధ్ కృష్ణాను తీసుకున్నారు.
రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు
ఇంగ్లాండ్ టూర్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత గాయంతో ఆటకు దూరమైన రిషబ్ పంత్, ఇప్పుడు పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులో చేరాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆయన రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించి టీమ్‌కు విజయాన్ని అందించాడు.
ఇటీవల ఇండియా ‘ఏ’ vs దక్షిణాఫ్రికా ‘ఏ’ సిరీస్‌లో కెప్టెన్‌గా పంత్ అద్భుతంగా ఆడి, జట్టును విజయంలోకి నడిపించాడు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్‌కు డిప్యూటీగా పని చేయనున్నాడు. పంత్ స్థానంలో ఉన్న ధ్రువ్ జురేల్ రెండో ఎంపిక వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు.
దేవదత్ పడిక్కల్‌కు మరో ఛాన్స్
భారత జట్టులో కొత్తగా దేవదత్ పడిక్కల్ కు చోటుదక్కింది. 2024 ప్రారంభంలో డెబ్యూ చేసిన ఆయన చివరిసారిగా నవంబర్ 2024లో ఆస్ట్రేలియా టెస్ట్‌లో ఆడాడు. రెండు టెస్ట్‌ల్లో 90 పరుగులు చేసిన ఆయన ఇప్పుడు మరోసారి అవకాశం పొందాడు. అయితే, ఈ సిరీస్‌లో ఆయనకు ఆడే అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
జట్టు వివరాలు, మ్యాచ్ షెడ్యూల్
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. రెండవ టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు గువహాతిలో ఉంటుంది. ఈ రెండు టెస్ట్‌ల తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.
భారత టెస్ట్ జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్‌కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.