T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి జితేష్ శర్మను తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమ్ కాంబినేషన్ కారణంతోనే ఇషాన్ కిషన్, రింకూ సింగ్‌లకు సెలెక్టర్లు సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. జితేష్ కు ఎందుకు ఈ పరిస్థితి?

ఆ ఇద్దరి వల్లే జితేష్ శర్మకు చోటు పోయిందా? అగార్కర్ క్లారిటీ!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసిన టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మను జట్టు నుంచి తప్పించడం అభిమానులను, మాజీ క్రికెటర్లను షాక్‌కు గురిచేసింది.
శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోవడం ఒక వార్త అయితే, నిలకడగా రాణిస్తున్న జితేష్ శర్మను పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే, దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టత ఇచ్చారు. ఇది ఆటగాడి ప్రతిభకు సంబంధించిన విషయం కాదని, కేవలం జట్టు కూర్పు ఆధారంగా తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు.
అసలు జితేష్ శర్మ చేసిన తప్పేంటి? సోషల్ మీడియా అభిమానులు ఫైర్
టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో జితేష్ శర్మ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఐపీఎల్‌లో జితేష్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఒత్తిడిలో మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం, వికెట్ల వెనుక అతని చురుకుదనం జట్టుకు ఎంతో మేలు చేశాయి. ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
ఇటీవల భారత టీ20 జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న జితేష్‌ను ఆఖరి నిమిషంలో వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించడంపై అభిమానులు మండిపడుతున్నారు. అసలు జితేష్ చేసిన తప్పేంటి? అని సోషల్ మీడియా లో నిలదీస్తున్నారు. జితేష్ టీ20 కెరీర్‌ను గమనిస్తే, అతను ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడి 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌లో కూడా తనవంతు పాత్ర పోషించాడు. అయినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది.
భారత సెలెక్షన్ కమిటీ, అగార్కర్ ఏం చెప్పారంటే?
ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జితేష్‌ను ఎంపిక చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. జితేష్‌ను పక్కన పెట్టడం అంటే అతని సామర్థ్యాన్ని తక్కువ చేయడం కాదని స్పష్టం చేశారు.
అగార్కర్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా ప్రధాన వికెట్ కీపర్ (సంజు శాంసన్) టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఏదైనా సమస్య వస్తే ప్రత్యామ్నాయంగా టాప్ ఆర్డర్‌లో ఆడగలిగే మరో వికెట్ కీపర్ ఉండాలని భావించాం. జితేష్ ఎలాంటి తప్పు చేయలేదు. కానీ, టీమ్ కాంబినేషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని వివరించారు.
ఇర్ఫాన్ పఠాన్ ఆవేదన.. సూర్యకు సూచన ఇదే
జితేష్ శర్మను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ప్రపంచ కప్ జట్టు నుంచి నన్ను ఎందుకు తప్పించారు? నా తప్పేంటి? అని జితేష్ కచ్చితంగా ఆలోచిస్తూ ఉండి ఉంటాడు" అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించారు. అలాగే, వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌ను కచ్చితంగా తిరిగి పొందాలని ఇర్ఫాన్ సూచించారు.
ఆ ఇద్దరి సర్‌ప్రైజ్ ఎంట్రీ.. సమీకరణాలు మారాయి మరి !
జితేష్ శర్మ స్థానాన్ని కోల్పోవడానికి, ఇషాన్ కిషన్, రింకూ సింగ్‌ల ఎంపిక ప్రధాన కారణమని తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌కు సెలెక్టర్లు సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 విజేతగా నిలపడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు, ఫినిషర్ పాత్ర కోసం రింకూ సింగ్‌ను ఎంపిక చేశారు. సౌతాఫ్రికా సిరీస్‌లో డ్రాప్ అయినప్పటికీ, వరల్డ్ కప్ కోసం అతన్ని తిరిగి పిలిచారు. టాప్ ఆర్డర్‌లో బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం ఉండటంతో ఇషాన్ కిషన్ రేసులోకి వచ్చాడు. ఫినిషర్ పాత్రకు జితేష్ కంటే రింకూ సింగ్‌పై సెలెక్టర్లు మొగ్గు చూపారు. ఈ సమీకరణాల వల్ల జితేష్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు.
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్, భారత జట్టు ఇదే
టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 20న ఫైనల్‌తో ముగుస్తుంది. భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపికైన 15 మంది సభ్యుల భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, రింకూ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

