గువాహటి టెస్ట్ ముందు భారీ మార్పులతో భారత జట్టు మాస్టర్ ప్లాన్
India vs South Africa : గువాహటి టెస్ట్ ముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వస్తున్నాడు. భారత్ సిరీస్ సమం చేయాలంటే రెండో టెస్ట్ కీలకం.

గువాహటి భారత్, సౌతాఫ్రికా రెండో టెస్టు
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ ఇప్పుడు గువాహటి వైపు మళ్లింది. తొలి టెస్టులో ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత్, సిరీస్‌ను 1-1గా సమం చేయాల్సిన కీలక సమయంలో రెండో మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని రక్షించేందుకు వారి బౌలర్లు అద్భుతంగా రాణించారు. సైమన్ హార్మర్ ఎనిమిది వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఇప్పుడు గువాహటి బార్సపారా స్టేడియంలో నవంబర్ 22 నుంచి 26 వరకు ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఈ స్టేడియంలో ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. సూర్యోదయం త్వరగా, సూర్యాస్తమయం ముందుగానే ఉండటం వల్ల ఆట ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్‌లో, టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది.
శుభ్ మన్ గిల్ ఫిట్‌నెస్‌పై అనిశ్చితి
తొలి టెస్టులో శుభ్ మన్ గిల్ మెడ గాయం కారణంగా కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి రిటైర్ హర్ట్ అయ్యారు. నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా ఆడలేకపోయారు. ఆయన గైర్హాజరు భారత్‌కు భారీ దెబ్బ అయింది. కోల్‌కతా ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయినా, పూర్తిగా ఫిట్ కాదనే సందేహం కొనసాగుతోంది.
టెస్ట్ సిరీస్ తర్వాత టీ20 ప్రపంచ కప్ (ఫిబ్రవరి–మార్చి 2026) వరకు ఉన్న బిజీ షెడ్యూల్‌ని దృష్టిలో పెట్టుకుని, ఆయనను పూర్తిగా కోలుకున్నప్పుడే ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గిల్ గురించి తుది నిర్ణయం గురువారం వెలువడే అవకాశం ఉంది.
అవసరమైతే రిషభ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ఐపీఎల్‌లో, టీ20ల్లో ఆయనకు నాయకత్వ అనుభవం ఉంది.
అదనపు బ్యాటర్‌ను పిలిచే అవకాశం తక్కువే
సిరీస్ నిర్ణయాత్మక దశలో ఉన్నప్పటికీ, సెలక్షన్ కమిటీ కొత్త బ్యాటర్‌ను పిలిచే ఆలోచనలో లేదు. ఇప్పటికే బి. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ లాంటి రిజర్వ్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఈ కారణంగా కొత్త ఆటగాడు అవసరం లేదని భావిస్తున్నారు. నితీశ్ కుమార్ రెడ్డి కూడా జట్టుతో తిరిగి కలవనున్నారు.
నితీశ్ రెడ్డి తిరిగి జట్టులో చేరిక
ఇండియా A వన్డే సిరీస్ కోసం ఇటీవల విడుదల చేసిన నితీశ్ రెడ్డిని మళ్లీ టెస్ట్ జట్టులోకి పిలిపించారు. గిల్ ఫిట్‌నెస్‌పై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఈ నిర్ణయం వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. నితీశ్ రెడ్డి కోల్‌కతా చేరుకుని ఎడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఆప్షనల్ ప్రాక్టీస్‌లో పాల్గొననున్నారు. గిల్ చివరి క్షణంలో అందుబాటులో లేకపోతే, నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం పొందే అవకాశముంది.
భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు
భారత్ ప్రస్తుతం సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడి ఉంది. గువాహటిలో గెలవడం తప్పనిసరి. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ గెలిస్తే, 2000లో హాన్సీ క్రోంజే నాయకత్వంలో సాధించిన చారిత్రాత్మక సిరీస్ స్వీప్‌ను మళ్లీ పునరావృతం చేసినట్టవుతుంది. అది సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా చివరి సిరీస్ కూడా. టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 30 నుంచి మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
గువాహటి టెస్ట్ భారత్‌కు కేవలం సిరీస్ సమం చేసే అవకాశమే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరులో నిలబడేందుకు కీలకమైన పరీక్ష కూడా. గిల్ ఫిట్‌నెస్, జట్టు కాంబినేషన్, ప్లేయింగ్ ఆర్డర్, టైమింగ్ ఒత్తిడి.. ఇవన్నీ భారత్ ముందున్న ప్రధాన సవాళ్లు.

