కేజీఎఫ్ నిర్మాతలే RCBని కొనేస్తారా.? టాప్ ఫ్రాంచైజీ కోసం క్యూ గట్టిగానే ఉందిగా
ఐపీఎల్ 2025 విజేత RCB యాజమాన్యం మారనుంది. ప్రస్తుతం డియాజియో సంస్థ ఆర్సీబీని విక్రయించాలని నిర్ణయించింది. కేజీఎఫ్, కాంతార వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది.

ఆర్సీబీ ఓనర్స్ చేంజ్..
ఐపీఎల్ 2025 టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్న డియాజియో సంస్థ తమ ఐపీఎల్ టీమ్‌ను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ 2026 మార్చి 31 నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో 2026 సీజన్ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త యాజమాన్య నిర్వహణలో మ్యాచ్‌లు ఆడుతుంది.
ప్రముఖ కంపెనీలు పోటీ
ఈ యాజమాన్య మార్పు నేపథ్యంలో, ఆర్సీబీ టీమ్ ఓనర్షిప్ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కూడా చేరింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి భారీ విజయాలు సాధించిన పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కాయి. ఈ సంస్థ ఇప్పటికే ఆర్సీబీకి సన్నిహితంగా వ్యవహరిస్తోంది.
ఆర్సీబీతో హోంబలే ఫిలింస్ కలిసి..
ఏప్రిల్ 2023 నుండి ఆర్సీబీ అధికారిక డిజిటల్ భాగస్వామిగా హోంబలే ఫిలింస్ వ్యవహరిస్తోంది. RCB కోసం అనేక సృజనాత్మక ప్రోమోలు, సినిమాటిక్ మ్యాచ్ టీజర్‌లు, క్యాంపెయిన్‌లను కూడా రూపొందించారు. 18వ ఐపీఎల్ ఎడిషన్‌లో ఆర్సీబీ తమ మొదటి టైటిల్‌ను గెలుచుకోవడంతో, దాని విలువ విపరీతంగా పెరిగింది. ఆర్సీబీ ప్రస్తుత అంచనా విలువ సుమారు 2 బిలియన్ యూఎస్ డాలర్లు(రూ. 17,000 కోట్లు)గా ఉంది.
మరి భారీ మొత్తాన్ని చెల్లిస్తుందా.?
ఇంత భారీ మొత్తాన్ని హోంబలే ఫిలింస్ సమకూర్చగలదా అనే సందేహాలు అభిమానుల మధ్య వ్యక్తమవుతున్నాయి. ఆర్సీబీని కొనుగోలు చేసే సంస్థకు జట్టు పేరు మార్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చినట్లే, ఆర్సీబీ పేరు కూడా మారవచ్చని ఊహాగానాలున్నాయి.
హోంబలే వస్తే పేరు మారదు.?
అయితే, హోంబలే ఫిలింస్ వంటి సంస్థ యాజమాన్యం చేపడితే జట్టు పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గానే కొనసాగే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఆర్సీబీ హోమ్ మ్యాచ్‌లను పూణేలో ఆడతారని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా, 2026 ఐపీఎల్ సీజన్ నాటికి ఆర్సీబీకి ఏ సంస్థ కొత్త యాజమాన్యం అవుతుందో వేచి చూడాలి.