IND vs SA: హార్దిక్ హిట్ షో.. రీఎంట్రీలో సఫారీలకు చుక్కలు ! సిక్సర్ల కింగ్
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుని, రోహిత్, కోహ్లీల సరసన చేరాడు. అతని ఇన్నింగ్స్ తో భారత్ భారీ స్కోరు సాధించింది.

IND vs SA: కటక్‌లో హార్దిక్ పాండ్యా విధ్వంసం
కటక్ బారాబతి స్టేడియంలో హార్దిక్ పాండ్యా విధ్వంసం రేపాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20 సమరంలో విశ్వరూపం చూపించాడు. గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరంగా ఉండి, ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చిన ఈ కుంగ్‌ఫూ పాండ్యా.. తన బ్యాట్‌తో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
క్లిష్టమైన పిచ్‌పై భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేసిన వేళ, హార్దిక్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ భారత జట్టును పటిష్ఠ స్థితిలో నిలబెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరును సాధించి, దక్షిణాఫ్రికా ముందు 176 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
ఆరంభంలో భారత్ కు షాక్.. సఫారీ బౌలర్ల దాడి
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (4) లుంగి ఎంగిడి బౌలింగ్‌లో బౌండరీ కొట్టినప్పటికీ, ఆ తర్వాత షాట్ టైమింగ్ కుదరక వెంటనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) తనదైన శైలిలో సిక్సర్, ఫోర్ కొట్టి జోష్ నింపే ప్రయత్నం చేసినా, అది ఎంతో సేపు నిలవలేదు. మార్క్రామ్ చేతికి చిక్కి సూర్య ఔట్ అవ్వడంతో భారత్ 17 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (17) రెండు ఫోర్లతో ఆకట్టుకున్నా, భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు.
ఆదుకున్న తిలక్.. మెరిసిన అక్షర్
కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే బాధ్యతను యువ ఆటగాడు తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) తమ భుజాలపై వేసుకున్నారు. వికెట్లు పడుతున్నా కూడా స్కోరు బోర్డును ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు. అయితే, సఫారీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు వీరి భాగస్వామ్యం ఎక్కువసేపు నిలవలేదు.
యాన్సెన్ అద్భుతమైన క్యాచ్‌తో తిలక్ వర్మను పెవిలియన్ పంపగా, అక్షర్ పటేల్ ఫెర్రీరా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో భారత ఇన్నింగ్స్ ముగిసిపోతుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు.
హార్దిక్ విధ్వంసం.. రీఎంట్రీ అదిరింది
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే అసలైన ఆటగాడు బయటకు వస్తాడన్నట్లుగా, హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన హార్దిక్, కేశవ్ మహరాజ్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది తన ఉద్దేశాన్ని చూపించాడు.
అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో, నోర్జి వేసిన 20వ ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది స్కోరును 175కు చేర్చాడు. శివమ్ దూబే (11), జితేష్ శర్మ (10*) అతనికి సహకరించారు.
100 సిక్సర్ల క్లబ్.. దిగ్గజాల సరసన హార్దిక్ పాండ్యా
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కేవలం పరుగులు చేయడమే కాకుండా, ఓ అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్న నాలుగో భారతీయ క్రికెటర్‌గా హార్దిక్ చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (155), విరాట్ కోహ్లీ (124) వంటి దిగ్గజాల సరసన హార్దిక్ (100) చేరాడు. తక్కువ బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా తనలో ఇంకా ఉందని హార్దిక్ ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించాడు.

