IND vs AFG : పసికూన అప్ఘాన్ పై పంజావిసిరిన భారత్.. గిల్ సేనను గెలుపుకు టాప్ 5 రీజన్స్
India vs Afghanistan : అప్ఘానిస్తాన్ పై టీమిండియా మరో విజయాన్ని సాధించింది. మొదటి వన్డే విక్టరీని తలదన్నేలా రెండో వన్డే విజయం ఉంది. ఈ మ్యాచ్ లో గిల్ సేన విజయానికి టాప్ 5 రీజన్స్ ఏమిటో తెలుసుకుందాం.

అప్ఘాన్ పై టీమిండియా అద్భుత విజయం
India vs Afghanistan 2nd ODI : పసికూన అప్ఘానిస్తాన్ తో జరుగుతున్న వన్డే సీరిస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే మొదటి వన్డేలో విజయం సాధించి మంచి ఊపుమీదున్న గిల్ సేన రెండో వన్డేలో మరింత దూకుడు ప్రదర్శించింది. వరల్డ్ రికార్డులు బద్దలుగొడుతూ ఏకంగా 402 పరుగులు చేసి కొండంత లక్ష్యాన్ని అప్ఘాన్ ముందుంచింది. అసాధ్యమైన లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన అప్ఘాన్ ఓటమిని అంగీకరించింది... 170 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది.
ఈ విజయంతో మూడు వన్డేల సీరిస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. మొదటి వన్డేలో బౌలింగ్ తో అదరగొడితే ఈ వన్డేలో బ్యాటింగ్ తో దుమ్ములేపింది. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం వెనకున్న ప్రధాన కారణాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ విజయం బ్యాటింగ్ దే..
లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలోనే ఔటయినా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రస్తుత కెప్టెన్ శుభ్ మన్ గిల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ 39 బంతుల్లో 48 పరుగులు చేశాడు...కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు.
రోహిత్ ఔటయ్యాక గిల్, ఇషాన్ కిషన్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ సెంచరీలు చేయడంతో టీమిండియా భారీ స్కోరు సాధ్యమయ్యింది. ఎప్పుడైతే ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేశారో, టీమిండియా స్కోరు 400 దాటిందో అప్పుడే అప్ఘాన్ ఓటమి ఖాయమయ్యింది... టీమిండియా గెలిచిపోయింది.
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్
శుభ్ మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడాడు... బ్యాటింగ్ బాధ్యతను తన భుజానేసుకున్నాడు. కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 154 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ తో కలిసి 140 బంతుల్లో 224 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్ సెంచరీ టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించింది.
ఇషాన్ దెబ్బకు అప్ఘానీ బౌలర్లు పరేషాన్
కెప్టెన్ గిల్ తో పోటీపడి బ్యాటింగ్ చేశాడు ఇషాన్ కిషన్... అప్ఘాన్ బౌలర్లను చితక్కొడుతూ పరుగుల వరద పారించాడు. ఇతడు 7 భారీ సిక్కర్లు, 14 బౌండరీలతో విరుచుకుపడి కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు సాధించాడు. ఇషాన్ సెంచరీ టీమిండియా భారీ విజయం అందుకోవడంలో ఉపయోగపడింది.
కుప్పకూలిన అప్ఘాన్ మిడిల్ ఆర్డర్
403 పరుగులు భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అప్ఘాన్ కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ 41 పరుగులు, జర్దాన్ 21 పరుగులతో పరవాలేదనిపించారు. సెదికుల్లా అటల్ కు 42 పరుగులతో రాణించాడు. రహ్మత్ షా 79 పరుగులతో చివరివరకు పోరాడాడు.
అయితే లోయర్ మిడిల్ ఆర్డర్ లో రసూలీ కేవలం 6 పరుగులకే రిటైర్డ్ హట్ గా వెనక్కి తిరగాడు. తర్వాత కెప్టెన్ షాహిది 4, ఖరోటీ 6, రషీద్ ఖాన్ 12, ఘజన్ఫర్ 1, సలీం సఫీ 9 పరుగులకే ఔటయ్యారు. దీంతో 232 పరుగులకే కుప్పకూలింది అప్ఘాన్... భారత్ 170 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అదరగొట్టిన భారత బౌలర్లు
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు పడగొట్టి అప్ఘాన్ ఓటమిని ఖాయం చేశారు. ఇక ప్రిన్స్ యాదవ్ కీలకమైన రహ్మతుల్లా షా, ఖరోటీ వికెట్లు తీశాడు. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయకున్నా ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మొత్తంగా టీమిండియా బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ సత్తాచాటింది... అందుకే అద్భుత విజయం సాధ్యమయ్యింది.

