Devdutt Padikkal : 4 మ్యాచుల్లో 3 సెంచరీలు.. గంభీర్, అగార్కర్‌లకు పెద్ద తలనొప్పి!
Devdutt Padikkal : విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. 4 మ్యాచుల్లో 3 సెంచరీలతో టీమిండియా వన్డే జట్టు ఎంపికకు బలమైన పోటీదారుగా నిలిచాడు. గంభీర్, అగార్కర్‌లకు కొత్త తలనొప్పి తీసుకొచ్చాడు.

36 మ్యాచులు, 12 సెంచరీలు.. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ విధ్వంసం
దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ టీమిండియా సెలెక్టర్లకు పెద్ద సవాలు విసురుతున్నారు కర్ణాటక యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. బుధవారం అహ్మదాబాద్ లో పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ మరో సెంచరీతో మెరిశారు.
కేవలం నాలుగు మ్యాచుల్లోనే ఇది పడిక్కల్ కు మూడో సెంచరీ కావడం విశేషం. ఈ అద్భుత ఫామ్‌తో రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌కు తన ఎంపికను పక్కా చేసేలా పడిక్కల్ ఆట కొనసాగుతోంది.
అగార్కర్, గంభీర్ నిర్ణయంపై ఉత్కంఠ
భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 11 నుంచి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే బీసీసీఐ ఇప్పటి వరకు ఈ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు జట్టు ఎంపిక కత్తి మీద సాములా మారింది.
దేశవాళీ టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ చూపిస్తున్న ఫామ్‌ను సెలెక్టర్లు ఏమాత్రం విస్మరించలేరు. పడిక్కల్ కేవలం సెంచరీలతోనే సెలెక్టర్లకు సమాధానం చెబుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతడిని పక్కన పెట్టడం సెలెక్షన్ కమిటీకి సాధ్యం కాకపోవచ్చు.
కళ్లు చెదిరే లిస్ట్-A రికార్డులు దేవదత్ పడిక్కల్ సొంతం
దేవదత్ పడిక్కల్ కేవలం ఈ ఒక్క సీజన్‌లోనే కాదు, తన లిస్ట్-A కెరీర్ మొత్తం నిలకడగా రాణిస్తున్నాడు. గణాంకాలను పరిశీలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 36 లిస్ట్-A మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఏకంగా 24 ఇన్నింగ్స్‌లలో 50కి పైగా పరుగులు సాధించడం విశేషం.
అంటే ప్రతి మూడు మ్యాచ్‌ల్లో రెండు సార్లు భారీ స్కోరు నమోదుచేశాడు. ఇందులో 12 అద్భుతమైన సెంచరీలు, 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. లిస్ట్-A క్రికెట్‌లో ఆయన సగటు 81.51గా ఉండటం, మొత్తం 2364 పరుగులు చేయడం ఆయన బ్యాటింగ్ సత్తాకు నిదర్శనం.
టీమిండియా తలుపులు బద్దలు కొడుతున్న దేవదత్ పడిక్కల్
గత నాలుగు మ్యాచుల్లో మూడు సెంచరీలు సాధించిన పడిక్కల్.. జాతీయ జట్టులోకి రావడానికి తలుపులు తట్టడం లేదు, ఏకంగా బద్దలు కొడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే టెస్టులు, టీ20లలో అరంగేట్రం చేసిన పడిక్కల్, వన్డే అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు.
రాబోయే రోజుల్లో టీమిండియాకు వైట్-బాల్ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉంది. ఈ సమయంలో పడిక్కల్ ఫామ్ లోకి రావడం జట్టుకు సానుకూల అంశం. ఇప్పుడు సెలెక్టర్లు అతనికి ఛాన్స్ ఇస్తారా లేక పక్కన పెడతారా అనేది ఆసక్తికరంగా మారింది.
పుదుచ్చేరిపై బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన దేవదత్ పడిక్కల్
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ముందు కర్ణాటక బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన దేవదత్ పడిక్కల్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 228 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
పడిక్కల్ 116 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇది కేవలం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ మాత్రమే కాదు, ఎంతో పరిపక్వతతో కూడిన ఇన్నింగ్స్ కూడా. అనవసరపు షాట్లకు పోకుండా, టైమింగ్, ప్లేస్‌మెంట్‌పై దృష్టి పెట్టి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చివరకు జయంత్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
అత్యంత నిలకడైన బ్యాటర్‌గా సెంచరీల మోత మోగించిన పడిక్కల్
ఈ టోర్నీలో పడిక్కల్ ఇప్పటి వరకు 405 పరుగులు చేసి అత్యంత నిలకడైన బ్యాటర్‌గా నిలిచాడు. విశేషమేమిటంటే, అతను సాధించిన మూడు సెంచరీలు మూడు విభిన్న పరిస్థితుల్లో వచ్చాయి. మొదట దూకుడుగా ఆడుతూ జార్ఖండ్‌పై 147 పరుగుల సెంచరీ బాదాడు. ఆ తర్వాత కేరళపై 124 పరుగులు మంచి నాక్ ఆడాడు. ఇప్పుడు పుదుచ్చేరిపై 113 పరుగులతో జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ ఆడాడు.
తమిళనాడుపై మాత్రం 12 బంతుల్లో 22 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే, పరిస్థితులకు తగ్గట్టు తన ఆటతీరును మార్చుకోగలనని పడిక్కల్ నిరూపించాడు. ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, తన ప్రదర్శనతో పడిక్కల్ తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నాడు.

