- Home
- Sports
- CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ చరిత్ర.. 39 మెడల్స్ తో 4వ స్థానం.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో రికార్డుల మోత
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ చరిత్ర.. 39 మెడల్స్ తో 4వ స్థానం.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో రికార్డుల మోత
Glasgow Commonwealth Games : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ చరిత్ర సృష్టించింది. 39 పతకాలతో టీమిండియా 4వ స్థానంలో నిలిచింది. బాక్సింగ్ లో 7 స్వర్ణాలు, మీరాబాయి చాను హ్యాట్రిక్ తో మెరిసారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కుస్తీ, బ్యాడ్మింటన్ లేకపోయినా దుమ్మురేపిన భారత్.. ఏకంగా 39 మెడల్స్ ప్లస్ టాప్ 4 స్పాట్
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిశాయి. ఆగస్టు 2న పోటీలన్నీ పూర్తయ్యాయి. ఆగస్టు 3న ముగింపు వేడుకలు జరిగాయి. ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందే భారత్‌కు పెద్ద సవాల్ ఎదురైంది. మనకు ఎక్కువగా పతకాలు తెచ్చిపెట్టే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, షూటింగ్ వంటి కీలక క్రీడలు ఈసారి కామన్వెల్త్ లో లేవు. దీంతో భారత్ టాప్ లో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ మన అథ్లెట్లు అంచనాలను మించి రాణించారు. అద్భుత ప్రదర్శనతో భారత్‌ను పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలబెట్టారు. మొత్తం 39 పతకాలతో టోర్నీని సగర్వంగా ముగించారు.
మొత్తం 122 మంది అథ్లెట్లు.. 13 గోల్డ్ మెడల్స్
కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ తరఫున మొత్తం 122 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఎనిమిది సాధారణ క్రీడలు, ఐదు పారా క్రీడల్లో మనవాళ్లు పోటీపడ్డారు. అథ్లెటిక్స్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, బౌల్స్, బాక్సింగ్, జూడో, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వేట్ లిఫ్టింగ్ తో పాటు పారా అథ్లెటిక్స్, పారా పవర్ లిఫ్టింగ్, పారా స్విమ్మింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, 3x3 వీల్ చైర్ బాస్కెట్ బాల్ లలో పోరాడారు. భారత్ గెలుచుకున్న 39 పతకాలలో 13 గోల్డ్ మెడల్స్, 17 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
బాక్సింగ్ లో పంచ్.. మీరాబాయి చాను చరిత్రాత్మక హ్యాట్రిక్
ఈసారి భారత పతకాల వేటలో బాక్సింగ్ మెయిన్ రోల్ పోషించింది. భారత్ గెలిచిన 13 గోల్డ్ మెడల్స్ లో ఏకంగా 7 స్వర్ణాలు ఒక్క బాక్సింగ్ నుంచే రావడం విశేషం. బాక్సింగ్ లో 7 గోల్డ్, 3 సిల్వర్ లతో మొత్తం 10 పతకాలు వచ్చాయి. మరోవైపు వేట్ లిఫ్టింగ్ లో స్టార్ అథ్లెట్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల విభాగంలో గోల్డ్ గెలిచి కామన్వెల్త్ గేమ్స్ లో వరుసగా మూడో స్వర్ణాన్ని సాధించారు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా నిలిచారు. వేట్ లిఫ్టింగ్ లో భారత్ కు 1 గోల్డ్, 6 సిల్వర్, 1 బ్రాంజ్ తో మొత్తం 8 పతకాలు వచ్చాయి. పారా పవర్ లిఫ్టింగ్ లో ఝండూ కుమార్ ఒక కాంస్యం అందించారు.
అథ్లెటిక్స్, జూడోలో అదరగొట్టిన మనోళ్లు
అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు సత్తా చాటారు. సాధారణ అథ్లెటిక్స్ లో 5 సిల్వర్, 5 బ్రాంజ్ లతో 10 పతకాలు రాగా, పారా అథ్లెటిక్స్ లో 3 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ తో 6 పతకాలు వచ్చాయి. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పురుషుల జావలిన్ త్రోలో రజతం సాధించగా, గుల్వీర్ సింగ్ 10000 మీటర్లలో సిల్వర్, 5000 మీటర్లలో బ్రాంజ్ గెలుచుకున్నారు. జూడోలో భారత్ చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. అస్మిత డే (-48 కేజీలు), హర్ష్ సింగ్ (-60 కేజీలు) గోల్డ్ మెడల్స్ సాధించగా, యామిని మౌర్య సిల్వర్, ఉన్నతి శర్మ బ్రాంజ్ గెలుచుకున్నారు. జూడో నుంచి మొత్తం 4 పతకాలు ఖాతాలో పడ్డాయి.
మెడల్స్ పట్టికలో ఆస్ట్రేలియా టాప్.. ఇండియా నంబర్ 4
కామన్వెల్త్ గేమ్స్ 2026 లో 70 గోల్డ్, 45 సిల్వర్, 56 బ్రాంజ్ లతో మొత్తం 171 పతకాలు సాధించి ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ (110 పతకాలు) రెండో స్థానంలో, కెనడా (62 పతకాలు) మూడో స్థానంలో నిలిచాయి. భారత్ 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రాంజ్ లతో (39 పతకాలు) నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. స్కాట్లాండ్ కూడా 39 పతకాలే గెలిచినప్పటికీ, భారత్ కంటే తక్కువ సిల్వర్ మెడల్స్ (9) ఉండటంతో ఐదో స్థానానికి పరిమితమైంది.
కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత పతక విజేతల పూర్తి జాబితా
1. ఝండూ కుమార్ – పారా పవర్ లిఫ్టింగ్ (పురుషుల హెవీవెయిట్) – కాంస్యం
2. ఋషికాంత్ సింగ్ – వేట్ లిఫ్టింగ్ (పురుషుల 60 కేజీలు) – రజతం
3. మీరాబాయి చాను – వేట్ లిఫ్టింగ్ (మహిళల 48 కేజీలు) – స్వర్ణం
4. ముత్తుపాండి రాజా – వేట్ లిఫ్టింగ్ (పురుషుల 65 కేజీలు) – రజతం
5. జ్ఞానేశ్వరి యాదవ్ – వేట్ లిఫ్టింగ్ (మహిళల 53 కేజీలు) – రజతం
6. బింద్యారాణి దేవి – వేట్ లిఫ్టింగ్ (మహిళల 58 కేజీలు) – కాంస్యం
7. షర్మిల ధన్ ఖడ్ – పారా అథ్లెటిక్స్ (మహిళల షాట్ పుట్ F57) – స్వర్ణం
8. సర్వేష్ కుషారే – అథ్లెటిక్స్ (పురుషుల హైజంప్) – రజతం
9. శిల్ప కె. శైల – పారా అథ్లెటిక్స్ (మహిళల షాట్ పుట్ F57) – కాంస్యం
10. వల్లూరి అజయ్ బాబు – వేట్ లిఫ్టింగ్ (పురుషుల 79 కేజీలు) – రజతం
11. హర్జిందర్ కౌర్ – వేట్ లిఫ్టింగ్ (మహిళల 69 కేజీలు) – రజతం
12. గుల్వీర్ సింగ్ – అథ్లెటిక్స్ (పురుషుల 10,000 మీటర్లు) – రజతం
13. మురళి శ్రీశంకర్ – అథ్లెటిక్స్ (పురుషుల లాంగ్ జంప్) – రజతం
14. దిలీప్ గావిత్ – పారా అథ్లెటిక్స్ (పురుషుల 100 మీటర్లు T47) – స్వర్ణం
15. మొహమ్మద్ బాసిల్ – పారా అథ్లెటిక్స్ (పురుషుల 100 మీటర్లు T47) – రజతం
16. లవ్‌ప్రీత్ సింగ్ – వేట్ లిఫ్టింగ్ (పురుషుల +110 కేజీలు) – రజతం
17. సీమా కలిరామనా – అథ్లెటిక్స్ (మహిళల డిస్కస్ త్రో) – కాంస్యం
18. అస్మిత డే – జూడో (మహిళల -48 కేజీలు) – స్వర్ణం
19. హర్ష్ సింగ్ – జూడో (పురుషుల -60 కేజీలు) – స్వర్ణం
20. యామిని మౌర్య – జూడో (మహిళల -57 కేజీలు) – రజతం
21. తేజస్విన్ శంకర్ – అథ్లెటిక్స్ (పురుషుల డెకాథ్లాన్) – కాంస్యం
22. యష్ వీర్ సింగ్ – అథ్లెటిక్స్ (పురుషుల జావలిన్ త్రో) – కాంస్యం
23. నీరజ్ చోప్రా – అథ్లెటిక్స్ (పురుషుల జావలిన్ త్రో) – రజతం
24. ప్రీతి పవార్ – బాక్సింగ్ (మహిళల 54 కేజీలు) – స్వర్ణం
25. ప్రవీణ్ చిత్రావేల్ – అథ్లెటిక్స్ (పురుషుల ట్రిపుల్ జంప్) – రజతం
26. సెల్వా ప్రభు – అథ్లెటిక్స్ (పురుషుల ట్రిపుల్ జంప్) – కాంస్యం
27. జాస్మిన్ లంబోరియా – బాక్సింగ్ (మహిళల 57 కేజీలు) – స్వర్ణం
28. జాదుమణి సింగ్ – బాక్సింగ్ (పురుషుల 55 కేజీలు) – రజతం
29. శుభం జుయాల్ – పారా అథ్లెటిక్స్ (పురుషుల షాట్ పుట్ F57) – రజతం
30. సోమన్ రాణా – పారా అథ్లెటిక్స్ (పురుషుల షాట్ పుట్ F57) – స్వర్ణం
31. ఉన్నతి శర్మ – జూడో (మహిళల -63 కేజీలు) – కాంస్యం
32. సాక్షి చౌదరి – బాక్సింగ్ (మహిళల 51 కేజీలు) – స్వర్ణం
33. ప్రియా ఘంఘాస్ – బాక్సింగ్ (మహిళల 60 కేజీలు) – స్వర్ణం
34. అరుంధతి చౌదరి – బాక్సింగ్ (మహిళల 70 కేజీలు) – స్వర్ణం
35. లవ్లీనా బోర్గోహైన్ – బాక్సింగ్ (మహిళల 75 కేజీలు) – రజతం
36. సచిన్ శివాచ్ – బాక్సింగ్ (పురుషుల 60 కేజీలు) – స్వర్ణం
37. అంకుష్ పంగాల్ – బాక్సింగ్ (పురుషుల 80 కేజీలు) – స్వర్ణం
38. నరేందర్ బర్వాల్ – బాక్సింగ్ (పురుషుల +90 కేజీలు) – రజతం
39. గుల్వీర్ సింగ్ – అథ్లెటిక్స్ (పురుషుల 5000 మీటర్లు) – కాంస్యం

