IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్
India vs South Africa : అస్వస్థత కారణంగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మిగిలిన టీ20 మ్యాచ్‌లకు టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

సౌతాఫ్రికా సిరీస్ నుంచి అక్షర్ అవుట్
India vs South Africa : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం టీమిండియా ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే, సిరీస్ నిర్ణయాత్మక దశలో ఉండగా భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అస్వస్థత కారణంగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ధృవీకరించింది.
అక్షర్ పటేల్ అనారోగ్య సమస్యల వల్ల ధర్మశాలలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు. ప్రస్తుతం అతను జట్టుతో పాటే లక్నోలో ఉన్నాడు. అక్కడ బీసీసీఐ వైద్య బృందం అతని ఆరోగ్యాన్ని మరింత నిశితంగా పరిశీలించనుందని సమాచారం. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అతను బ్యాటింగ్‌లో 23 , 21 పరుగులతో రాణించడమే కాకుండా, బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్ ఎంపిక
అక్షర్ పటేల్ స్థానంలో సెలెక్షన్ కమిటీ షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసింది. డిసెంబర్ 17న లక్నోలో , డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనున్న చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు షాబాజ్ జట్టుతో కలవనున్నాడు. 31 ఏళ్ల షాబాజ్ అహ్మద్‌కు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు.
ఇప్పటివరకు షాబాజ్ అహ్మద్ భారత్ తరఫున ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను చివరిసారిగా 2023 అక్టోబర్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టు తరఫున మైదానంలోకి దిగాడు. 2023లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లపై జరిగిన టీ20 సిరీస్‌లలో కూడా అతను జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు అక్షర్ స్థానంలో వచ్చిన షాబాజ్, తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.
ఆధిక్యంలో భారత్
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1తో ముందంజలో ఉంది. కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించగా, న్యూ చండీగఢ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచి సిరీస్‌ను సమం చేసింది. అయితే, ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను కేవలం 117 పరుగులకే కట్టడి చేసి, 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20లలో 1000కి పైగా పరుగులు, 100కి పైగా వికెట్లు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు.
మరోవైపు, భారత పేస్ బౌలింగ్ ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా మూడో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. మిగిలిన రెండు మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ, లక్నోలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.
నాలుగో టీ20 మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 17న సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు పడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంటుంది. సిరీస్‌లో నిలవాలంటే దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.
ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
IND vs SA : జట్ల వివరాలు
సిరీస్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, ఇరు జట్ల స్క్వాడ్ వివరాలు కింద ఉన్నాయి..
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), డోనోవన్ ఫెరీరా (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, ఒట్నియెల్ బార్ట్‌మన్, కేశవ్ మహారాజ్, క్వెనా మఫాకా, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్ట్జే.

