- Home
- Sports
- Abhishek Sharma : ఇదేం బాదుడురా సామీ.. యువీ రికార్డు మిస్.. అభిషేక్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్
Abhishek Sharma : ఇదేం బాదుడురా సామీ.. యువీ రికార్డు మిస్.. అభిషేక్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్
Abhishek Sharma : న్యూజిలాండ్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం రేపాడు. కేవలం14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది యువరాజ్ రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్ పై అభిషేక్ శర్మ విధ్వంసం.. సిరీస్ భారత్ వశం
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ విన్యాసాలతో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ న్యూజిలాండ్ బౌలర్లకు పీడకలగా మారింది. కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన అభిషేక్, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే, 8 వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
యువరాజ్ రికార్డుకు చేరువగా అభిషేక్.. హార్దిక్ రికార్డు బ్రేక్
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నాడు. అయితే, దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని అభిషేక్ తృటిలో కోల్పోయాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఆ రికార్డుకు అభిషేక్ కేవలం రెండు బంతుల దూరంలో నిలిచిపోయాడు.
అయితే, అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు. 2025లో అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు అభిషేక్ 14 బంతుల్లోనే ఆ ఫీట్ సాధించి హార్దిక్ రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా చూస్తే, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ 2023లో మంగోలియాపై 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
సూర్యతో కలిసి అభిషేక్ సునామీ
154 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (12 బంతుల్లో 28) కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మతో జతకట్టాడు. వీరిద్దరూ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
కేవలం 40 బంతుల్లోనే వీరిద్దరూ 102 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులు (నాటౌట్) చేయగా, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు (నాటౌట్) చేశాడు. అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 340.98గా నమోదైంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 25 బంతులు లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 9 సార్లు హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా అభిషేక్ రికార్డు సృష్టించగా, కొద్ది నిమిషాల్లోనే సూర్యకుమార్ కూడా అదే ఫీట్ సాధించి ఆ రికార్డును సమం చేశాడు.
బౌలర్ల అద్భుత ప్రదర్శన
అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. గాయం తర్వాత విశ్రాంతి తీసుకుని జట్టులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా (3 ఓవర్లలో 23 పరుగులు, 2 వికెట్లు), హర్షిత్ రాణా (1 వికెట్) కూడా రాణించారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
యువరాజ్ రికార్డుపై అభిషేక్ స్పందన
మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడుతూ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "నా జట్టు నా నుండి ఇదే కోరుకుంటుంది. ప్రతిసారీ ఇలా ఆడటం అంత సులభం కాదు. యువరాజ్ సింగ్ 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం. ఇదంతా మానసిక బలం, సహచరుల నుండి లభించే సపోర్టు వల్లే సాధ్యమైంది. అందరు బ్యాటర్లు బాగా ఆడుతున్నారు, ఈ సిరీస్ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. నేను ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ను బట్టి ఆడాను, నాకు రూమ్ దొరికితే ఆఫ్ సైడ్ కొట్టగలను. నేను కేవలం ఫీల్డింగ్‌కు అనుగుణంగా ఆడాలనుకుంటున్నాను" అని అభిషేక్ పేర్కొన్నాడు.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-0తో ఆధిక్యంలో నిలిచి సిరీస్‌ను దక్కించుకుంది. అభిషేక్ శర్మ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లలో 152 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
