- Home
- Life
- Spiritual
- కొబ్బరికాయ ఎలా పుట్టింది, శివుడిలా మూడు కళ్లు కాయపై ఎలా వచ్చాయి, గణేశ పురాణం ఏం చెపుతోంది
కొబ్బరికాయ ఎలా పుట్టింది, శివుడిలా మూడు కళ్లు కాయపై ఎలా వచ్చాయి, గణేశ పురాణం ఏం చెపుతోంది
కొబ్బరికాయ లేకుండా పూజ సంపూర్ణం అవ్వదు, ప్రతీ పూజలో నారికేళం ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఆ కొబ్బరికా ఎలా పుట్టింది? దానికి ఉన్న మూడు కళ్ల వెనుక కథ ఏంటి? గణేశ పురాణంలో కొబ్బరికాయ గురించి ఏం చెప్పారు?

కొబ్బరికాయ లేని పూజ ఉండదు
సాధారణంగా కొబ్బరికాయ లేకుండా ఏ పూజ ఉండదు. నారికేళ ప్రసాదం ఒక్క ముక్క కళ్లకు అద్దుకుని తింటే పూజ సంపూర్ణం అయిన తృప్తి కలుగుతుంది. ప్రతీ పూజలో ఎన్ని ప్రసాదాలు ఉన్నా.. కొబ్బరికాయ లేనిదే పూజ సమాప్తం అవ్వదు. మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయకు పీచు ఉంచి కొడతారు. కాని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తిగా పీచు తీసేసి కొడుతుంటారు. దానికి కారణం ఏంటి? అసలు ఏంటి ఈ కొబ్బరి కాయ ప్రత్యేకత. శ్రీ ఫలంగా పిలువబడే కొబ్బరికాయ అసలు ఎలా పుట్టింది. దానికి కారణం ఏంటి? కొబ్బరికాయ పై ఉండే మూడు కళ్లు ఎలా పుట్టాయి.
గణేశ పురాణంలో ఏం ఉంది?
ప్రముఖ ఆధ్యాత్మిక విశ్లేషకులు నండూరి శ్రీనివాస్ గారు చెప్పిన విశ్లేషణ ప్రకారం, కొబ్బరికాయ పుట్టుక గురించి గణేశ పురాణంలో చెప్పబడింది. సైన్స్ ప్రకారం అంకురోత్పత్తి సమయంలో కొబ్బరికాయ చెట్టుగా మారడంపై బుక్స్ లో వివరంగా ఉంటుంది. కాని ఆధ్యాత్మికంగా కూడా కొబ్బరికాయ పుట్టుక గురించి చెప్పబడింది. ఆధ్యాత్మికంగా నారికేళం పుట్టుక, దానికి కారణం గురించి గణేశపురాణంలో ఒక కథ ఉందని ఆయన వివరించారు. కొబ్బరికాయను శివుడు సృష్టించడం వెనకు పెద్ద కథ ప్రచారంలో ఉంది. ఇంతకీ కొబ్బరికాయ ఎలా పుట్టింది?
త్రిపురాసుర సంహారం సమయంలో
కొబ్బరికాయ పుట్టకకు త్రిపురాసుర సంహారానికి సంబంధం ఉంది. ఒక సమయంలో త్రిపురాసురులను సంహరించడానికి పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. వారు ముగ్గరు ఒక వరుసలోకి రావడంలేదు.వారిని సంహరించడం సాధ్యం కాకపోవడంతో శివునికి విసుగు వస్తుంది. అంతలో బ్రహ్మదేవుడు వచ్చి.. పరమేశ్వరునితో ఇలా అంటాడు. దేవదేవా.. ఎలాంటి కార్యం అయినా గణపతిని పూజించకుండా సాధ్యం కాదు. నేనైన, మీరైనా ఎవరైనా సరే ఆది పూజ్యుడు గణపతిని పూజిస్తేనే ఏ పని అయినా సాధ్యం అవుతుంది అనిచెప్పారు. దాంతో అసలు విషయం మర్చిపోయాను కదా అనికుని, శంకరుడు గణపతి పూజ కోసం ఓ మండపాన్ని కడతాడు. పూజ మొదలు పెట్టేసమయానికి స్వయంగా విఘ్నేశ్వరుడు వచ్చి తండ్రి ఎదురుగా కూర్చుంటాడు. పరమేశ్వరుడు పూజ మొత్తం పూర్తి చేసి నైవేధ్యం సమర్పిస్తాడు.
తండ్రి తలపండు కోరిన వినాయకుడు
పూజమొత్తం పూర్తి చేసి, నైవేధ్యంగా ఉండ్రాళ్లు సమర్పిస్తాడు శివుడు. కాని గణపతి తిరస్కరిస్తాడు, ఏ నైవేధ్యం పెట్టినా ఆయన వద్దంటాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి, గణపతికి మొదకాలు అంటే ఇష్టం కదా అని అవి సమర్పిస్తుంది, కానీ అవి కూడా వద్దంటాడు గణపతి. అప్పుడు విసిగిపోయిన పరమేశ్వరుడు, నీకు ఏం కావాలి నాయన అనిఅడుగుతాడు. వెంటనే వినాయకుడు నీ తలపండు కావాలి అని అడుగుతాడు. అదేంటి సాక్ష్యాత్తు తండ్రి శిరస్సును పండుగా సమర్పించమన్నాడేంటి, అని అంతా ఆశ్చర్యపోతారు. కాని శివుడు మాత్రం దీని వెనుకు ఏదో అర్ధం దాగి ఉంది అని, తన మనోనేత్రంతో అంతా గమనిస్తాడు. వెంటనే తన శక్తితో ఓ పండును సృష్టిస్తాడు.
పరమేశ్వరుడు సృష్టించిన ఫలం.
గణపతి తలపండు సమర్పించమని కోరడంతో పరమేశ్వరుడు ధ్యానంలో అంతర్ముఖుడై, దోసిలి పట్టుకుంటాడు. అప్పుడు తన శక్తితో ఆ చేతిలోకి గుండ్రటి ఆకారం గల ఒక పదార్ధం వచ్చి పడుతుంది. శివుడికి మూడు కళ్లు, అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, పరమేశ్వరుని మూడు కళ్లు ఆ పదార్దంపై ఏర్పడతాయి. లక్ష్మీనారాయణుల శక్తి ఆ పదార్ధంలోకి వెళ్లి చేరుతుంది. శివుని నెత్తిపై ఉన్న గంగమ్మ జలరూపంలో ఆ పదార్ధం లోపలికి చేరుతుంది. ఇక పార్వతీ దేవి శక్తి శాకంబరీ దేవి అవతారంగా మారి, స్వేత వర్ణంలో తినే పదార్ధంగా అందులోకి చేరుతుంది.
గణపతి ఇచ్చిన వరం
అప్పుడు ఆ ఫలం గణపతికి సమర్పించగానే ఎంతో ప్రీతిగా స్వీకరిస్తాడు. అది స్వీకరించి ఆయన ఓ వరం కూడా ఇచ్చాడు . దీనిని శ్రీ ఫలం అని పిలుస్తారు. ప్రతీ పూజలో ఈ ఫలం లేనిదే అది సంపూర్ణం అవ్వదు అని వరం ఇస్తాడు. అది కొబ్బరికాయ విశిష్టత, పురాణాల ప్రకారం కొబ్బరికాయ అలా ఏర్పడింది. లక్ష్మీ నారాయణుల శక్తి అందులో ఉంది కదా.. అందుకే దానికి శ్రీ ఫలం అన్న పేరు వచ్చింది.
కొబ్బరికాయ పీచు వెనుక కథ
కొబ్బరికాయ పీచు ఉంచి కొట్టడం వెనుక ఎటువంటి కారణం లేదు. పీచు తీసేస్తే మూడు కళ్లు కనిపిస్తుంటాయి. చూడటానికి లింగరూపంలో ఉంటుంది కదా.. అలా దాన్ని కొట్టడానికి మనసు ఒప్పుకోక కొంత మంది అలా పీచు ఉంచి కొడతారు. అది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఉత్తరభారతంలో కొబ్బిరికాయ పీచు మొత్తం తీసేసి కొడుతుంటారు. అంతే కాదు శబరిమలతో పాటు, తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో కూడా కొబ్బరికాయ పీచు తీసేసి కొడుతుంటారు. ఎలా కొట్టినా భక్తి ముఖ్యంగా ఉండాలి. అలా పరమేశ్వరుడు సృష్టించిన నారికేళం లేకుండా ఏ పూజా సంపూర్ణం అవ్వదు. అది భారతదేశంలో ప్రతీచోట ఆచరిస్తున్నారు కూడా.